హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పుణ్య మా అని రాష్ట్రంలో ఐటీ హబ్‌లు ఒకొక్కటి పట్టాలు తప్పుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త కంపెనీల రాక దేవుడెరుగు.. ఉన్న కంపెనీలు పోకుండా చూడాలని ఎక్స్ వేదికగా సర్కార్‌కు సూచించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకూ ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో 8 ఐటీ హబ్‌లను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఐటీ హబ్‌ల పరిస్థితి బాగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యు త్తు, ఇంటర్నెట్ బిల్లులను కూడా కట్టలేని దుస్థితి నెలకొన్నదని తెలిపారు. దీని ప్రభావం కంపెనీలపై పడుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.
అసలు ఏం జరిగిందంటే..
సిద్దిపేట శివారులోని నాగులబండ వద్ద 63కోట్లతో ఐటీ టవర్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఈ టవర్‌తో చాలామంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాయి. ఈ టవర్‌కు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో కొన్ని కంపెనీలు సేవలను నిలిపివేశాయి. బిల్లు చెల్లించలేదన్న కారణంతో నాలుగు రోజులు గా ఐటీ టవర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న హరీశ్‌రావు చొరవ తీసుకొని సేవలను పునరుద్ధరించారు.
ప్రపంచాన్ని మార్చే శక్తి బాలికలదే
అమ్మాయికి అవకాశం, అధికా రం ఇస్తే ప్రపంచాన్నే మార్చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ బాలి కా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఎక్స్‌లో ఓ ఫొటోను పోస్ట్‌చేశారు. రేపటి ప్రపంచాన్ని అద్భుత విజయాల దిశగా తీర్చిదిద్దే శక్తి అమ్మాయిలకే ఉన్నదని, కేటీఆర్ పేర్కొన్నారు.