నల్లగొండ ప్రతినిధి, మే 21 (నమస్తే తెలంగాణ)/చందంపేట: రాష్ట్రంలో ఐదు నెలల పాలనలోనే కాంగ్రెస్ సర్కార్ ఐదేండ్ల అపఖ్యాతి మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ‘ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసోళ్లు కింటా వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పడేమో సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తమని చెప్తున్నరు. తెలంగాణలో 80-85 శాతం దొడ్డు వడ్లే పండిస్తరు. అలాంటి దొడ్లు వడ్లకు కాకుండా సన్నాలకే బోనస్ ఇస్తామంటూ సన్నాయి నొక్కులు నొకుతున్నది సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లాంటి సర్కార్‌కు బుద్ధిచెప్పాలంటే, రైతు బిడ్డల తరఫున ప్రశ్నించే గొంతుక కావాలి. అట్లాంటి గొంతును శాసనమండలిలో వినిపించే రాకేశ్‌రెడ్డికే పట్టభద్రులు ఓటు వేయాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మద్దతుగా నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, పట్టభద్రులతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘రెండు లక్షల ఉద్యోగాలన్నరు. మెగా డీఎస్సీ వేస్తమన్నరు. జాబు క్యాలెండర్ ప్రకటిస్తమన్నరు. ఇట్ల చెప్పిన వేటికీ నేటికీ అతీగతీ లేదు. ఇక పరీక్ష ఫీజులే ఉండవన్నరు. టెట్ పరీక్షకు ఫీజు అప్పడు రూ.400 ఉంటే ఇప్పుడు ఐదు రెట్లు పెంచిండ్రు’ అని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల్లో గెలిచే వరకు ఓ మాట.. గెలిచాక మరో మాటతో రేవంత్ సర్కార్ బోడి మల్లయ్య సామెతను తలపిస్తున్నదని మండిపడ్డారు.
పెద్దల సభగా పేరొందిన మండలి ఎన్నికల్లో ఓ చీటర్, బ్లాక్‌మెయిలర్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. దందాలు చేసి బెదిరించేవారిని గెలిపిస్తే సమాజానికి నష్టమని హెచ్చరించారు. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పునరాలోచించాలని, ఇట్లాంటి చీటర్‌కు, బ్లాక్ మెయిలర్‌కు సపోర్టు చేస్తే మీకే ఎసరు పెట్టడం ఖాయమని హితవుపలికారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి కష్టపడి చదువుకొని గోల్డ్‌మెడల్ సాధించి, అమెరికాలో ఫేస్బుక్, సిటీ బ్యాంక్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేస్తూ అక్కడే స్థిరపడే అవకాశం ఉన్నా.. పుట్టినగడ్డ తెలంగాణకు ఏదైనా చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రాకేశ్‌రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పొంతనే లేదని చెప్పారు. పొద్దున లేస్తే నోటికి ఏదోస్తే అది, ఎంతోస్తే అంత బూతులు మాట్లాడుతూ 56 క్రిమినల్ కేసులతో 76 రోజులు జైలులో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పారు. అందుకే పట్టభద్రులంతా ఆలోచించి ఓటేయాలని కోరారు. నిజాయితీపరుడైన రాకేశ్‌రెడ్డికి ఓటేస్తారా? యూట్యూబ్‌ని అడ్డం పెట్టుకొన్న బ్లాక్‌మెయిలర్, చీటర్‌గా పేరుబడ్డ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తారా? అనేది తేల్చుకోవాలని సూచించారు.
కేసీఆర్‌పై పదేండ్లు ఒత్తిడి తెచ్చినా అప్పగించలేదని, రేవంత్‌రెడ్డి వచ్చిన ఒక్క నెలలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించాడని కేటీఆర్ విమర్శించారు. ఇటీవల 4.5 టీఎంసీల నీటిని సాగర్ నుంచి ఆంధ్రాకు తీసుకెళ్లినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కసారైనా ప్రశ్నించాడా అని నిలదీశారు. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్న రేవంత్‌రెడ్డి.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా రాత పరీక్ష పెట్టకుండా ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా ఉద్యోగాలు ఇచ్చాడో పట్టభద్రులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే నిరుద్యోగులు, పట్టభద్రుల తరఫున కొట్లాడేందుకు రాకేశ్‌రెడ్డికి ప్రథమ ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి కాచివడబోసి ఒక బ్లాక్ మెయిలర్‌కు టికెట్ ఇచ్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతుల పక్షాన ప్రభుత్వంపై కొట్లాడే దమ్ము ధైర్యం తనకు ఉన్నాయని, అందుకే పట్టభద్రులు తనకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాకేశ్‌రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో ప్రభుత్వంపై పోరాటం చేసి నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్ధ్దాలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. సమావేశాల్లో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, తిప్పన విజయసింహారెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు కర్నె ప్రభాకర్, చెరుకు సుధాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, నల్లమోతు సిద్దార్ధ, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి కనిలాల్నాయక్ చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. కనిలాల్ ఇటీవల మృతి చెందగా.. దేవరకొండలోని రవీంద్రకుమార్ ఇంటికి మంగళవారం కేటీఆర్ వెళ్లారు. రవీంద్రకుమార్‌ను పరామర్శించారు. పౌర సరఫరాలశాఖలో ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి వచ్చిన కనిలాల్నాయక్.. ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నిక అయ్యారని గుర్తు చేశారు.