హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి జాక్‌పాట్ సీఎం అని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నదని, అవగాహన, పరిణతి, పరిపక్వత లేని తెలివితక్కువ ముఖ్యమంత్రి అని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడని, తెలంగాణ గురించి, తెలంగాణ ఏర్పాటు వెనక ఉన్న త్యాగాల గురించి ఆయనకు తెలియదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు చెందిన ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భఘేల్ గతంలో మూడు రోజుల పాటు ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఆదివారం జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తాము అధికారంలో ఉండి ఉంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నెలపాటు ఘనంగా నిర్వహించేవారమని చెప్పారు. తెలంగాణ అవతరణ, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని, ఆయనకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ అవతరించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ తరఫున, 60 లక్షల పార్టీ కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు, చివరికి ప్రాణాలర్పించిన అమరులందరికీ వందనాలు సమర్పించారు. 2001లో మలిదశ ఉద్యమంతో కొత్త విప్లవాన్ని సృష్టించి, చరిత్రను మలుపు తిప్పి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ఏరాష్ట్రం కోసమైతే ప్రాణత్యాగాలు జరిగాయో అవన్నీ ఫలించి దశాబ్దకాలంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు. తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది అన్న తీరుగా దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకులు, సబ్బండవర్గాలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఉద్యమ విశేషాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల నెమరేత..
తెలంగాణభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య సరస్వతి చేత కేటీఆర్ ప్రారంభింపజేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫొటోలను తిలకించి ఉద్యమ ఘట్టాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను నెమరేసుకున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర తొలిముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేశారు. వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. సమావేశంలో ఉద్యమ కాలం నాటి విశేషాలను వివరించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. కార్యక్రమానికి ముందు రసమయి ఇతర గాయకులు తెలంగాణ ఉద్యమ గీతాలు పాడుతూ ఉత్సాహం నింపారు.
నేడు ముగింపు వేడుకలు
ఉత్సవాల ముగింపులో భాగంగా నేడు అన్ని జిల్లాల బీఆర్ఎస్ కార్యాలయల వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. దవాఖానలు, అనాథాశ్రమాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేయనున్నారు.
మరో స్వాతంత్య్ర పోరాటం..
నిబద్ధతతో పోరాడి గమ్యాన్ని ముద్దాడిన ఒకే ఒక్కడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ పోరాట పఠిమను ఎక్స్ వేదికగా ఆదివారం గుర్తుచేశారు. ‘స్వాతంత్య్రం ఇవ్వలేదు.. తీసుకోబడింది’ అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలను ఉటంకిస్తూ, తెలంగాణ ఎవరి దయా దాక్షిణ్యాలతోనో ఏర్పాటైంది కాదని, పోరాడి సాధించుకున్నదని స్పష్టంచేశారు. ‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2001లో నిర్వహించిన పార్టీ తొట్టతొలి సభలోనే ఢిల్లీ మెడలువంచి తెలంగాణ సాధిస్తామని ప్రకటించారంటే ఎంత ధైర్యం కావాలి! ఉద్యమబాట వీడితే రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునివ్వాలంటే పుట్టిన మట్టిపై ఎంత ప్రేమ ఉండాలి! అసాధ్యమనుకునే ఒక స్వప్నాన్ని సుసాధ్యం చేసి చూపిస్తామని చెప్పిన మాట ఆయన ఉకు సంకల్పానికి నిదర్శనం! నడి మధ్యలో కాడిపారేసి పారిపోయిన ఉత్తుత్తి ఉద్యమకారులు, నకిలీ నాయకులు ఎందరో! పట్టుదలతో, నిబద్ధతతో పోరాడి గమ్యాన్ని ముద్దాడిన ఒకే ఒకడు కేసీఆర్!’ అని గుర్తుచేశారు.
దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని..
దశాబ్దం గడిచిన సందర్భమిది!
ఆధునిక భారతం కళ్లరా చూసిన..
మరో స్వాతంత్య్ర పోరాటం మన తెలంగాణ ఉద్యమం!
బకపలచని, ఉకు సంకల్పం కలిగిన..
కేసీఆర్ పోరాట ఫలితమిది!
అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై..
ఏర్పడిన కొత్త రాష్ట్రం మనది!
సబ్బండ వర్గాలు కొట్లాడి, పోట్లాడి..
మారాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిది!
60 ఏళ్ల విధ్వంస గాయాలను..
పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మన తెలంగాణది!
పాలన చేతకాదంటూ నొసటితో వెకిరించిన వాళ్లే..
మనసునిండా ప్రశంసించిన దశాబ్దమిది!
తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా..
అనితర సాధ్యంగా సాగింది ఈ దశాబ్ద ప్రయాణం!
శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు..
దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ!
నాడు కరవు, రాళ్లురప్పల, కల్లోలిత తెలంగాణ..
నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ!
అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇకముందు ఉండాలని..
తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలని..
కాంక్షిస్తూ.. ఆకాంక్షిస్తూ.
ప్రతి ఒకరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు
జై తెలంగాణ…జైజై తెలంగాణ
– కేటీఆర్