కాళేశ్వరంలోని ఒక్క బరాజ్‌లో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే వీళ్లు చేస్తున్న రాద్ధాంతం అంతాఇంతా కాదు.. దున్న ఈనిందని కాంగ్రెసోళ్లంటే.. దుడ్డెను కట్టెయ్యిమని బీజేపోళ్లంటున్నరు. ఇంత నికృష్టమైన రాజకీయాలు బహుశా దేశంలో ఎక్కడా లేవు.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం, ప్రాధాన్యం సుప్రీంకోర్టుకు, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు అర్థమైందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాత్రం అర్థంకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం తేలిపోయిందని, సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకొచ్చాయని, కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బరాజ్‌లను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలిచి, 20 నుంచి 30 శాతం కమీషన్లు దండుకోవాలన్నదే కాంగ్రెస్ పార్టీ అసలు ఎజెండా అని ధ్వజమెత్తారు.
580 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ముఖ్యమంత్రి అందాల పోటీలో ఉండటం కరెక్టేనా? అని నిలదీశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు మంత్రులంతా టూర్ గైడ్లుగా మారారని విమర్శించారు. మిస్ వరల్డ్ పోటీదారులకు నిజాం కట్టిన చార్మినార్ లేదా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను తప్ప, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఒకదానినైనా రేవంత్‌రెడ్డి చూపించగలడా? అని నిలదీశారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ కట్టినవి ఏమైనా ఉంటే చూపించాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో గురువారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి ఇవాల్టికి సరిగ్గా మూడు నెలలు. ఇప్పటికీ అందులో చికుకున్న వారిని బయటకు తీయలేకపోయిండ్రు. రేవంత్‌రెడ్డి భాషలో చెప్పాలంటే ప్రభుత్వంలో మొగోడు ఉంటే ఈ ప్రమాదంలో చికుకున్న వారిని బయటకు తీసేటోడు. కమీషన్ల కోసం ముందూవెనుక చూడకుండా ఎస్ఎల్బీసీ పనులను హడావుడిగా మొదలుపెట్టి ఎనిమిది మందిని బలిగొన్నది వాస్తవం కాదా?
– కేటీఆర్
కాళేశ్వరంలోని రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఏం చర్యలు తీసుకున్నదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలింది. నేడు మే 22! అంటే 90 రోజులు గడిచినా అందులో చికుకున్న వారిని బయటకు తీయలేకపోయారు. ప్రభుత్వంలో దక్షత ఉన్న నాయకుడుంటే ఎప్పుడో బయటకు తీసేవాడు. కమీషన్ల కోసం ముందూవెనుక చూడకుండా టన్నెల్ పనులను హడావుడిగా మొదలుపెట్టారు. అది కుప్పకూలి ఎనిమిది మందిని బలిగొన్నది. ఇప్పటివరకు ఒక్కరి మీదైనా చర్యలు తీసుకున్నారా?’ అని నిలదీశారు. రేవంత్, కాంగ్రెస్ కమీషన్ల కక్కుర్తిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాళేశ్వరం కమిషన్ పేరిట డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
ఇవ్వాళ ముఖ్యమంత్రి మనసు నిండా తిరుగున్నది ఏమిటంటే.. ఒకవైపు మిస్ వరల్డ్ బ్యూటీస్.. మరోవైపు కాళేశ్వరం మీద నోటీస్! మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఈ ప్రభుత్వం చూపిస్తున్నవి ఏమిటి? కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనం, వీ హబ్ తప్ప 50 ఏండ్లలో కాంగ్రెస్ కట్టినవి ఏమైనా ఉంటే చూపుమనండి!
– కేటీఆర్
‘రాష్ట్రంలో 580 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ముఖ్యమంత్రి అందాల పోటీలో ఉం డటం కరెక్టా? అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే, అందాల పోటీల్లో రేవంత్‌రెడ్డి బిజీగా ఉండటం కరెక్టా? ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఒక్క డిక్లరేషన్ అయినా అమలు చేశారా? ఉన్నవాటికే దిక్కులేదు. మళ్లీ ఇప్పుడు నల్లమల డిక్లరేషనట! రైతు, యూత్, విద్యారి, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు పోయినయి. ఇప్పుడు ఇంకో డిక్లరేషనా? బిచ్చపోన్ని.. రాష్ట్రం దివాలా తీసింది అంటున్నవు. రాష్ట్ర ప్రభు త్వం దగ్గర రూపాయి లేదంటున్నవు. అందరూ దొంగల్లా చూస్తున్నారంటున్నవు.. మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు అందాల పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? బ్యూటీ కాంటెస్టు పెట్టాలని ప్రజలు కోరిం డ్రా? అందాల పోటీలు పెడితే ఉద్యోగాలు వస్తయని మీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నరు. ఎక్కడ ఉద్యోగాలు వచ్చినయి? ఎవరికి వచ్చినయి? మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు మంత్రులంతా టూర్ గైడ్లుగా మారిపోయిండ్రు. మంత్రులు సొంగ కార్చుకుంటూ అందాలభామల చుట్టూ తిరుగుతున్నరని సీపీఐ నారాయణ అన్నరు’ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు.
‘రైతుల ఆత్మహత్యలు.. వడ్ల కొనుగోళ్ల మీద సమీక్షలు లేవు. ఒక్క గ్యారెంటీ అమలు కాదు. మీడియాను మేనేజ్ చేసి డైవర్షన్ గేమ్ ఆడుతున్నరు. బోలెడు నోటీసులిచ్చామంటున్నరు. బోలేడు కమిషన్లు వేసిండ్రు. ఏం చేసిండ్రు? కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా నాకు రాలేదు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తం. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిందన్నరు. పని పూర్తయిందన్నరు. రిపోర్టు తయారవుతోందన్నరు. మళ్లీ ఎందుకు విచారణ పొడిగించాల్సి వచ్చిందో చెప్పాలి? అసలు సీఎం ఏం చేద్దామనుకుంటున్నరు? ఇంకో మూడేండ్లు రిపేర్ చేయను.. కాళేశ్వరం కింద రైతులు పంటలు వేయకుండా ఉండాలని కోరుకుంటున్నరా? రిపేర్ చేసి రైతులకు నీళ్లివ్వకుండా 17 నెలలుగా పంటలు ఎండబెడుతున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బరాజ్‌లను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలిచి, 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే ఈ అసలు ఎజెండా.. కమీషన్లు తీసుకుంటున్నట్టు మీ మంత్రులే చెప్తున్నరు. డబ్బులు ఇవ్వంది ఫైల్ కదలదని ఓపెన్‌గానే చెప్తున్నరు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నోటీసులంటున్నారు. గుల్జార్‌హౌస్‌లో 17 మంది చనిపోతే అటువైపు కన్నెత్తి చూడలేదు. అందాల పోటీలకు ఆరుసార్లు వెళ్లి.. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఒక్కసారీ వెళ్లలేదు. ప్రభుత్వ చేతగాని తనం బయటపడుతుంటే, పాతబస్తీలో పేదలు నిలదీస్తుంటే.. ప్రజల దృష్టి మళ్లించేందుకే కాళేశ్వరం నోటీసులు’ అని కేటీఆర్ ఫైరయ్యారు.
రేవంత్ కమీషన్ల కక్కుర్తి.. కాంగ్రెస్ కమీషన్ల కక్కుర్తి.. ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాళేశ్వరం కమిషన్లు, నోటీసులు అంటూ డ్రామాలాడుతున్నరు. ఘోష్ కమిషన్‌ను ఇట్లనే తెరపైకి తెచ్చిండ్రు. ఫార్ములా-ఈ రేస్‌పై డ్రామా కొన్ని రోజులు.. ఎలక్ట్రిసిటీ డ్రామా కొన్ని రోజులు.. ఇట్ల ఒకటి తర్వాత ఒకటి ఎన్నిరోజులు.
– కేటీఆర్
90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డిని వెంటనే పూర్తిచేసి పాలమూరు ప్రజలకు సాగునీరు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్ ఆ ప్రాజెక్టును ఎందుకు పకన పెట్టారో చెప్పాలని నిలదీశారు. ‘ఆ ప్రాజెక్టుకు మామ పేరు పెట్టుకున్నరు. అందుకైనా మిలిగిన పనులు పూర్తిచేయాలి కదా? పాలమూరు ప్రాజెక్టుపై సుప్రీం తీర్పు చెప్పినట్టే, కాళేశ్వరంపైనా స్పష్టమైన తీర్పులు వచ్చి కాళేశ్వరం ప్రాధాన్యతను తెలియజేస్తయి’ అని కేటీఆర్ తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఏమీ జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పిటిషన్‌ను కొట్టేసింది. ధర్మం.. న్యాయం ముమ్మాటికీ గెలుస్తది. వందకు వందశాతం కాళేశ్వరం మీద కూడా నిజం నిలకడ మీద తేలుతది.
– కేటీఆర్
‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నిజం ఎలా తేలిందో.. ఆరోపణలు శుద్ధ తప్పు అని ఎలా తేలిందో.. కాళేశ్వరంపైనా నిజాలు నిలకడ మీద తేలుతాయి. కాంగ్రెస్ చెప్తున్న ప్రజాపాలన కాస్తా పర్సంటేజీల పాలనగా మారింది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు! కాంగ్రెస్ కమీషన్లు బయట పడుతున్నాయని తెలిశాకే ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు! జస్టిస్ ఘోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందని చెప్పారు. ఆ పెద్దయనే చెప్పిన తర్వాత ఇంకా ఏమున్నది? కమిషన్ గడువు మళ్లీ పొడిగించిండ్రు. ఇప్పటికే ఏడుసార్లు ఎందుకు పొడిగించిండ్రో ప్రభుత్వం చెప్పాలి. 60 నెలలు టైమ్‌పాస్ చేయాలని చూస్తున్నట్టున్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే దమ్ము లేదు. 420 హామీల ఊసులేదు. ఒక్క డిక్లరేషన్‌కు దిక్కు లేదు. రోజుకో డ్రామా అడుతున్నరు’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
‘సీఎం రేవంత్‌రెడ్డిలో అపరిచితుడున్నడు. ఆయన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నడు. అందుకే ఒకే అంశంపై రోజుకోలా మాట్లాడుతడు. ఒక రోజు రాములా.. మరోరోజు రెమోలా మారుతడు.. కాళేశ్వరం కూలేశ్వరమని రెమోలా మాట్లాడుతడు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తున్నం.. టెండర్ పిలుస్తున్నమని రాములా చెప్తడు. మరి రాము కరెక్టా? రెమో కరెక్టా?.. చెప్పులు ఎత్తుకపోయేవాడిలా చూస్తున్నారు. బిచ్చపు బతుకైందని రెమో అంటడు. తెల్లారి అసెంబ్లీలో లక్షా అరవై వేల కోట్ల అప్పు చేసినట్టు రాము చెప్తడు.. ఎవరు కరెక్టు? చారిత్రక అనవాళ్లయిన చార్మినార్, కాకతీయ కళాతోరణాలను రెమో రాచరికపు పోకడలంటడు.. అవే అనవాళ్లను డ్రోన్‌షో పెట్టి రాము చూపిస్తుంటడు. మిస్ వరల్డ్ పోటీదారులకు అదే చార్మినార్‌ను రాము చూపిస్తడు. రెమోనేమో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటడు. అవే అనవాళ్ల దగ్గరకు మిస్‌వరల్డ్ పోటీదారులను తీస్కపోయి రాము ఫొటోలు దింపిస్తడు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని రెమో అంటడు. రాము ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తుంటడు’ అని కేటీఆర్ దెప్పిపొడిచారు.