హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై కావాల్సింది డిక్లరేషన్ కాదని, డెడికేషన్ అని స్పష్టంచేశారు. బీసీల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే ప్రధానమంత్రి దగ్గరకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రితో పాటు బీఆర్ఎస్ నేతలు వస్తారని హామీ ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణపై జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడారు. ‘ఢిల్లీలో మీరు చేసిన ధర్నాకు మేము రాలేదు సరే.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేసిన ధర్నాకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా రాలేదు.
వారు కూడా కాంగ్రెస్ చేసింది ధర్నా కాదు.. డ్రామా అని అనుకున్నారా? అందుకే రాలేదా? ఎందుకు రాలేదు? బీసీలంటే కావాల్సింది డిక్లరేషన్లు కాదు.. డెడికేషన్ కావాలి. ఒక్కటే ప్రభుత్వం 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయి.. మిగతవారిని కన్ఫ్యూజ్ చేయొద్దు. డెడికేషన్‌తో పనిచేయండి. శాస్త్రీయంగా పనిచేయండి’ అంటూ ప్రభుత్వానికి చురకలంటించారు. ‘ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఎమ్మెల్యే ఇప్పిస్తాడా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు 20 నెలల్లో ఢిల్లీకి పోయిండు. ఏం ఉపయోగం లేదు. ప్రధానమంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలి. మేము ఈ బిల్లును సపోర్ట్ చేస్తున్నాం’ అని కేటీఆర్ మద్దతుపలికారు. సభలో నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు. ‘ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోతున్న.
2021లో చేయబోయే జనాభా లెక్కలతో పాటు.. కులగణన కూడా చేయండి అంటూ తీర్మానం చేసినం. రాహుల్ గాంధీ మాట్లాడక ముందే.. కేసీఆర్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కులగణనపై మాట్లాడింది.. తీర్మానించింది. బలహీన వర్గాలకు రాష్ట్ర చట్ట సభల్లో, పార్లమెంట్లో కూడా రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని, ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసి పంపినం.
– కేటీఆర్
తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని కేసీఆర్ చెప్పిండు. అన్నట్టుగానే తెలంగాణ సాధించిండు. అలాగే ముఖ్యమంత్రికి కూడా చిత్తశుద్ధి ఉంటే అలాంటి నిర్ణయం తీసుకోవాలి. బీసీ బిల్లు సాధించుడో.. నేను మళ్లీ హైదరాబాద్‌కు రానని చెప్పుడో తేల్చాలి’ అని డిమాండ్ చేశారు. ఇంతముఖ్యమైన బిల్లు సాధించాలంటే ముఖ్యమంత్రి ఆమరణ దీక్ష చేయాలని చెప్పడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. ఢిల్లీలో అపాయింట్మెంట్ అడిగితే.. చెప్పులు ఎత్తుకుపోతారేమోనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్తున్నాడని, అలా అంటే ఎవరు ఇస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అందుకే ముఖ్యమంత్రి బుద్ధి మార్చుకోవాలి.. భాష మార్చుకోవాలి. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది’ అని స్పష్టంచేశారు.
తెలంగాణలో బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకురండి. కేవలం రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడం వల్లే సామాజిక న్యాయం జరగదు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బీసీలను అభివృద్ధి చేయాలి. అవకాశాలు రావాలి.
– కేటీఆర్
ఆదివారం సభలో మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన చట్టసవరణ బిల్లుకు బీఆర్ఎస్ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నట్టు కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని స్వాగతించారు. ఆ బిల్లులో రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలని చెప్పి..కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించారని కేటీఆర్ చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్‌కు కూడా ప్రత్యేక సమావేశం పెట్టాలని కోరారు. బీఆర్ఎస్ ఆది నుంచీ బీసీ నినాదంతోనే పనిచేస్తున్నదని గుర్తుచేశారు. 2004లో యూపీఏ ప్రభుత్వంలో ఆ పార్టీతో పొత్తులో భాగంగా డిసెంబర్ 17న బలహీన వర్గాల నాయకులను, వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని నాటి ప్రధాని మన్మోహన్ అపాయింట్మెంట్ తీసుకొని, బలహీనవర్గాలతో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ మాట్లాడించారని గుర్తుచేశారు. కేసీఆర్ మాట్లాడితే నాటి ప్రధాని మన్మోహన్ కూడా ఒప్పుకొన్నారని చెప్పారు. 45 నిమిషాలు టైం ఇస్తే గంటన్నరకుపైగా చర్చ జరిగిందని, ఆ సమావేశంలో వకుళాభరణం కృష్ణమోహన్, ఆర్ కృష్ణయ్య వంటి నేతలు ఉన్నారని తెలిపారు. కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదని, మంత్రిత్వశాఖ ఉండాలని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే ఎంతో మేలుంటుందని తెలిపారు.
బీసీలకు న్యాయం చేయాలనుకుంటే దాని పరిధి అసెంబ్లీ కాదు. ఇక్కడెన్ని మాట్లాడినా ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకున్నా.. పొలిటికల్ డైలాగ్‌లు కొట్టుకున్నా.. నిజంగా న్యాయం జరగాలంటే పార్లమెంట్లో తీర్మానం, రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమవుతుంది. 9వ షెడ్యూల్లో పెట్టడం ద్వారానే సాధ్యమవుతుంది. ఇదే వాస్తవం. ఇది ముఖ్యమంత్రికి, మంత్రులకు తెల్వదని అనుకోను. వారికి తెలిసీ ఇరుక్కుపోయారు.
– కేటీఆర్
పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తీసుకొచ్చినట్టు కేటీఆర్ చెప్పారు. పార్టీ విధానాల్లో వాటిని అమలు చేశామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 2014లో స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌గా కనకమామిడి స్వామిగౌడ్‌ను నియమించారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేనిది.. తెలంగాణలో మొట్టమొదటి అడ్వకేట్ జనరల్‌గా బలహీన వర్గాలకు చెందిన బీఎస్ ప్రసాద్‌ను కేసీఆర్ ప్రభుత్వం నియమించుకున్నదని చెప్పారు. ఇప్పటికీ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ఉన్నారని, మూడు ప్రొటోకాల్ పోస్టుల్లో రెండు బీసీలకు ఇచ్చి కేసీఆర్ బీసీల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారని చెప్పారు. ‘ఇప్పుడు రాజ్యసభ సభ్యులు మాకు నలుగురు ఉన్నారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు అవకాశం వస్తే.. కే కేశవరావు, డీ శ్రీనివాస్, బండా ప్రకాశ్, లింగయ్య యాదవ్, గాయత్రి రవిచంద్రను బీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యసభకు పంపింది. అవకాశం వచ్చినప్పుడు అద్భుతాలు చేశాం’ అని గుర్తుచేశారు.
ఎలాంటి లొసుగులు లేకుండా చట్టాలను చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డుపడదు. మేము మొదట్నుంచీ చెప్తున్నది కూడా అదే.. శాస్త్రీయంగా అధ్యయనం చేసి చేస్తే ఏ జ్యూడిషియల్ రివ్యూలో కూడా ఎలాంటి ఇబ్బందులు రావు. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
– కేటీఆర్
రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని బీఆర్ఎస్ సీలింగ్ పెట్టిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ ఖండించారు. పంచాయతీరాజ్ చట్టంలో ఎక్కడా ‘సీలింగ్’ అనే పదం లేదని, అధికారులు మంత్రులను, ప్రజలను, సభను తప్పుదోవ పట్టించొద్దని హితవుపలికారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాన్ని తెచ్చారు. సుప్రీంకోర్టులో 2010లో రాజ్యాంగ ధర్మాసనం 50 శాతం సీలింగ్‌పై తీర్పు ఇచ్చింది. ఆ సీలింగ్ పెట్టింది కేసీఆర్ కాదు.. బీఆర్ఎస్ కాదు. అది పెట్టింది రాజ్యాంగ ధర్మాసనం’ అని స్పష్టంచేశారు. ‘దాన్ని మార్చడం ఎవరి తరం కాదు కాబట్టే.. మనం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే మార్చగలం. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది’ అని తేల్చిచెప్పారు.
మేమందరం కూడా ఆదర్శంగా తీసుకునేది జయశంకర్ గారినే. ఆయన చెప్పినట్టు భావ సారూప్యత లేకపోయినా ధ్యేయ సారూప్యత ఉండాలి. తాతాలికంగా విభేదించినా సాధించే లక్ష్యంలో సారూప్యత ఉండాలని ఆయన చెప్పారు. 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో మేము చిత్తశుద్ధి, నిజాయితీగా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతాం.
– కేటీఆర్
‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఆరు నెలల్లోనే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మేం కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే.. చేస్తామని చెప్తే బాగుండేది. దీంతో ఇక్కడ బీసీల నుంచి ఒత్తిడి పెరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘బీసీ నినాదంపై కాంగ్రెస్ 5 విధాలుగా మాట్లాడుతున్నది. మొదటిసారి రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని, రెండోసారి ఆర్డినెన్స్ ద్వారా చేస్తామని, మూడోసారి పార్టీ పరంగా ఇస్తామని, నాలుగోసారి రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత ఇస్తామని చెప్పారు. ఇప్పుడు బిల్లు తెస్తామని అంటున్నారు. ఒక్కటే పార్టీ ఐదు సందర్భాల్లో, ఐదు రకాలుగా మాట్లాడితే రాష్ట్రంలోని బీసీ బిడ్డలు చూస్తలేరా? మీ నిజాయితీని, చిత్తశుద్ధిని చూస్తలేరా? చిత్తశుద్ధిలేని శివపూజ చేస్తూ ప్రతిపక్షం మీద నెపంపెట్టి తప్పించుకుంటామంటే ఎలా?’ అంటూ నిలదీశారు. చిత్తశుద్ధితో చెప్తున్నాం.. ఈ బిల్లును మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం’ అని చెప్పారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు అంటే గౌరవం ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. అదే సుప్రీంకోర్టు పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో ఆ అంశం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. మరి దానిపై కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.
– కేటీఆర్
‘కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 37 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలని, ఇక్కన్నుంచి పార్లమెంట్‌కు బిల్లు పెట్టారు. అక్కన్నుంచి రాష్ట్రపతికి వెళ్లింది. ఇంకా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నది’ అని కేటీఆర్ తెలిపారు. ఇదే అంశాన్ని గత మార్చిలో సీఎం కూడా అసెంబ్లీలో ప్రస్తావించారని చెప్పారు. ‘ఇప్పుడు 42 శాతం సాధించాలంటే ఆ 37 శాతం ఫైలు వెనక్కి తెప్పిస్తున్నాం.. తెప్పించి ఈ 42 శాతం ఫైలును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తామని అంటున్నారు. ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా? మేము 37 శాతం బిల్లు పంపలేదా? అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచిదా? దయచేసి ఆలోచించాలి’ అని కోరారు.
రాహుల్ గాంధీ చెప్తున్న ‘జిత్నా ఆబాదీ.. ఉత్నా హక్. జిత్నే బాగేదారి.. ఉత్నే ఇస్సేదారి’ అనేది మంచి మాట, మంచి ఆలోచన, ఆచరణీయమని, అయితే.. రాహుల్‌గాంధీ 42 శాతం రిజర్వేషన్ గురించి ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాన్ని పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఎందుకు మాట్లాడం లేదు? అని కేటీఆర్ నిలదీశారు. ‘కాంగ్రెస్ పార్టీకి వంద మంది ఎంపీలు ఉన్నారు కదా.. ఎందుకు గట్టిగా పట్టు పడటం లేదు? 42 శాతం రిజర్వేషన్‌పై అక్కడ కదా చర్చ జరగాల్సింది. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ చేస్తే కంఠశోష తప్ప ఏముంటుంది? ఇక్కడ ఉండే బీసీ బిడ్డలను మభ్య పెట్టడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందేందుకు తాపత్రయ పడుతున్నారు’ అని కేటీఆర్ విమర్శించారు. ‘జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్, చిరంజీవులు వంటి మేధావులు, తెలంగాణ బిడ్డలు రాజ్యాంగ సవరణ చేయాలని సూచిస్తున్నారు. బీసీ రిజర్వేషన్‌పై డిక్లరేషన్ ఒక్కటే కాదు, డెడికేషన్ కూడా ఉండాలి. అది ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. స్వాగతిస్తారు’ అని పునరుద్ఘాటించారు.
బీహార్‌లో ఎన్నికల సందర్భంగా కొన్ని పత్రికా ప్రకటనల్లో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలైందని ప్రకటనలిచ్చారు. ఇక్కడేమో చర్చ జరుగుతున్నది. బీహార్‌లో మన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఫొటోలతో తెలంగాణ ప్రజల డబ్బులు పెట్టి ఇక్కడ రిజర్వేషన్లు పాసే కాలేదు. పాసైపోయినట్టుగా చెప్తుండటం ఆశ్చర్యంగా ఉన్నది.
– కేటీఆర్
‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో బీసీల జనాభా 6 శాతం తగ్గింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతంగా వచ్చిన బలహీన వర్గాల సంఖ్య 6 శాతం ఎలా తగ్గింది? దీన్ని ఏ రోజైనా కాంగ్రెస్ ప్రభుత్వం రివ్యూ చేసిందా? చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అది చేయకపోగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సర్వేలో పాల్గొనలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మేమేందో, మా కులమేందో ప్రజలకు తెలుసు. మా ఎన్నికల అఫిడవిట్ ఉన్నది. ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే మమ్మల్ని దెప్పిపొడుస్తడు. మేం పాల్గొనకపోవడం వల్ల 6 శాతం తగ్గదుకదా?’ అని ప్రశ్నించారు. ‘బలహీన వర్గాలకు సేవ చేయాలనుకుంటే.. డిక్లరేషన్ పెట్టినప్పుడే ‘కండీషన్స్ అప్లయ్’ అని పెట్టి.. రాహుల్ ప్రధాని అయితేనే ఇస్తామని చెప్పాల్సింది’ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ కోసం పొన్నం ప్రభాకర్ నాడు పార్లమెంట్లో కొట్లాడిన అంశాన్ని కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రశంసించారని గుర్తుచేశారు.
‘ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టికల్ 243 డీ6 ప్రకారం.. బీసీ రిజర్వేషన్లు రాష్ర్టాలే ఇచ్చుకోవచ్చు అని ఆదేశాలు వచ్చాయి. దీంతో 2018లో కేసీఆర్ ప్రభుత్వం దాన్ని అనుసరించి.. కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. స్థానిక సంస్థల్లో జీవో 396తో 34శాతం రిజర్వేషన్లు కల్పించుకున్నాం’ అని కేటీఆర్ గుర్తుచేశారు. ‘కేసీఆర్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన వెంటనే గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఈయన ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, కాంగ్రెస్ పార్టీ నేత. ఆరోజు కాంగ్రెస్ చేసిన నిర్వాకం వల్లే ఇది జరిగింది’ అని చెప్పారు. సీఎం రేవంత్ రాజకీయపరమైన అంశాలు మాట్లాడకపోతే తాము కూడా మాట్లాడమని చెప్పారు. ‘ఈ బిల్లుకు సహకరిస్తూ.. సలహాలు ఇస్తున్నాం. స్వీకరిస్తారా? లేదా? అనేది మీ విజ్ఞత. 2018లో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం. బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని 396 జీవో తెచ్చినం. గోపాల్‌రెడ్డి అడ్డుకున్నది వాస్తవం’ అని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలకు కేటీఆర్ వివరణ ఇచ్చారు.
సభను ఎన్నిరోజులు నడుపుతారో ఇప్పటి వరకూ చెప్పలేదని కేటీఆర్ నిలదీశారు. హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి బీఏసీలో సభను 15 రోజులు నడపాలని కోరారని చెప్పారు. ‘ఎరువులు, యూరియా కొరత ఉన్నది.. వరద సమస్యలు ఉన్నయి. బీసీల సమస్యలు కూడా చర్చిద్దాం.. బీసీ డిక్లరేషన్‌కు ఒక్కరోజు పెడదాం.. రైతు, యువజన, ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్లపై సభ పెట్టాలని కోరితే పట్టించుకోకుండా సభ నడపడానికి సిద్ధంగా లేక ప్రభుత్వం పారిపోతున్నది. మేమేం చేయాలి’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు కలుగజేసుకొని ‘కేటీఆర్ వ్యాఖ్యలను మేము చాలా తీవ్రంగా వ్యతిరికేస్తున్నాం. ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షమే పారిపోతున్నది’ అన్నారు. దానికి కౌంటర్‌గా కేటీఆర్ మాట్లాడుతూ ‘ఎల్ఏ మినిస్టర్ చాలా తెలివిగా పద ప్రయోగాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నరు. ఈ రోజు రాత్రో, రేపో సభను వాయిదా వేస్తారని మీకు తెలుసు. మాకు తెలుసు. ప్రభుత్వం పారిపోతున్నదా? ప్రతిపక్షం పారిపోతున్నదా? ప్రజలు నిర్ణయిస్తారు. మేము 15 రోజులు చర్చ జరగాలని సభా వేదికగా డిమాండ్ చేస్తున్నం. పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నం. నిర్వహిస్తరో? లేదో? సీఎం, ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నం’ అని చెప్పారు.
బీహార్‌లో తెలంగాణ ప్రజల డబ్బుతో ఇస్తున్న యాడ్స్‌పై కేటీఆర్ మాట్లాడుతుండగా విప్ ఆది శ్రీనివాస్ కలుగజేసుకొని మాట్లాడారు. అసెంబ్లీలో చర్చలకు రాకుండా ప్రతిపక్షం పారిపోతున్నదన్నారు. ఆ తర్వాత కేటీఆర్‌కు అవకాశం రావడంతో ‘ఈ సంప్రదాయం ఎక్కడా చూడలేదు.. ప్రతిపక్షం మాట్లాడుతుంటే విప్‌లు కూడా కలుగజేసుకుంటున్నారు. మా ఆది శ్రీనివాస్ అన్న కూడా మంత్రి కావాలి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి. మా జిల్లా బిడ్డ. మా రాజన్న సిరిసిల్ల. అన్నకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు.
‘రాహుల్‌గాంధీ, మోదీ ఇద్దరూ కలిసి చాయ్ తాగి డిసైడ్ చేసుకుంటే ఇది అర్ధగంటలో ఒడిసిపోయే ముచ్చట. 42 శాతం బిల్లు పాసైతది. రాజ్యాంగ సవరణ జరుగుతది’ అని కేటీఆర్ చెప్పారు. ‘అలా కాకుండా మీరింకా పదిరోజులు సభ నడిపి, చర్చపెట్టినా అవ్వదు. ఇదంతా బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు. చట్టంలో లొసుగులు ఉంటేనే, రాజ్యాంగబద్ధంగా లేకపోతేనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. కోర్టుకు పోవద్దు అనే మాట కరెక్టు కాదు. ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే.. ప్రభుత్వాలు చట్టాలకు లోబడి పనిచేయకపోతే ఎవరైనా కోర్టుకుపోతారు. పోవద్దు అనే మాట తప్పు. న్యాయసమీక్షకు నిలబడని జీవోలతో ఎట్లా బీసీల జీవితాలు మారుస్తారో ప్రభుత్వమే చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణపై ఆదివారం జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడుతుండగా వరుసగా మంత్రులు కలుగుజేసుకొని ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ ప్రసంగం మొదలు పెట్టిన 5 నిమిషాల్లోపే మంత్రి పొన్నం కలుగజేసుకొని బీసీ సబ్‌ప్లాన్‌పై చర్చ పెడతామని చెప్పారు. ఆ తర్వాత శ్రీధర్‌బాబు కలుగజేసుకున్నారు. మరో రెండు నిమిషాల వ్యవధిలోనే మళ్లీ మంత్రి శ్రీధర్‌బాబు కలుగజేసుకొని కేటీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ఆ తర్వాత విప్ ఆది శ్రీనివాస్ కాసేపు అడ్డు తగిలారు. మళ్లీ వెంటనే శ్రీధర్‌బాబు కలుగజేసుకొని త్వరలోనే కేంద్రం నుంచి బీసీ బిల్లుకు క్లియరెన్స్ వస్తుందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్లీ పొన్నం ప్రభాకర్‌గౌడ్ కలుగజేసుకున్నారు. వీరితో పాటు ఆఖరికి మంత్రి సీతక్క సైతం కేటీఆర్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. ముగ్గురు మంత్రులు, ఒక విప్ రెండు మూడు నిమిషాలకోసారి అడ్డుపడ్డా కేటీఆర్ సమర్థవంతంగా తిప్పికొట్టారు.