హైదరాబాద్, జూన్3 (నమస్తేతెలంగాణ): ‘రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతాం.. అని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరిన్రు. ఆయనకు దమ్ముంటే, తన మాటపై నిలబడే ధైర్యముంటే 20 లక్షల ఇండ్లు కట్టించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఓట్లడుగాలి. లేదంటే పొంగులేటి ఇంట్లో కూర్చోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు అంశాలపై సమాధానాలు ఇచ్చారు. వచ్చే ఏడాది కచ్చితంగా తాను పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల అంశాలపై కూలంకషంగా వివరించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 32 పంపులు ఉన్నాయి. నార్లాపూర్ వద్ద మొదటి పంప్‌ను ఆన్ చేసి నీరందించింది కేసీఆర్ కాదా? పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దే. పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చింది కేసీఆరే. ఎవరైనా కాదనగలరా? ఈ రోజు ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా కరీంనగర్‌ను మించిపోయి నంబర్‌వన్‌గా నిలిచింది. ఇందుకు కారణం కాళేశ్వరం నీళ్లు కాదా? కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని టెయిల్ల్యాండ్ ప్రాంతాలకు కాళేశ్వరం నీరందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. నల్లగొండ అయినా, ఖమ్మం అయినా ప్రతి జిల్లా ప్రజల కోసం ప్రేమతోనే పనిచేశాం. కానీ కొన్నిచోట్ల సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు, భూసేకరణలో సమస్యలు ఉండవచ్చు. మూడు, నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఒకేసారి నిర్మించేటప్పుడు ఒకటి కొద్దిగా ముందు అవుతుండవచ్చు. మరొకటి వెనుక అవుతుండవచ్చు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తిచేసి మోటర్ ఆన్‌చేసి నీళ్లు చూపెట్టినం కదా! మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు ఆయన మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టుకున్నడు. కానీ పనులు మాత్రం చేస్తలేడు. వేగంగా పూర్తిచేసి నీళ్లు ఇవ్వమనండి. మేం వద్దంటున్నమా?
ఇక ప్రజల విచక్షణను మేము ఎప్పుడు? ఎక్కడ? అవమానించినం. కాంగ్రెసోళ్లు చెప్పిన దొంగమాటలు కొందరు నమ్మారని అన్నం. నేనే కాదు.. ప్రజలు కూడా కాంగ్రెస్‌కు ఓటేసి తప్పుచేశామంటున్నరు. సోషల్ మీడియాలో చూడండి. వాళ్ల ఆర్తనాదాలు వినబడటం లేదా? బాధలు కనిపించడంలేదా? ఇక వ్యతిరేకత అంటరా. అందరి మీద వస్తది. ఎవరూ దేవుడు కాదు. ఎవరి ప్రయత్నం వారు చేస్తరు. కొన్నిసార్లు ఫలితాలు వస్తయి, రావు. 2014, 2018లో గెలిచినం. 2023లో వెంట్రుకవాసి తేడాతో ఓడిపోయినం. దానికేం బాధలేదు. కానీ ఈ కాంగ్రెస్ దుర్మార్గులు తెలంగాణను భ్రష్టు పట్టిస్తుంటే చాలా బాధనిపిస్తున్నది.
20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగుతానని గతంలో మంత్రి పొంగులేటి సవాల్ విసిరిన్రు. ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే వచ్చింది. నిజంగా ఆయనకు దమ్ముంటే, మాటమీద నిలబడే నాయకుడైతే 20 లక్షల ఇండ్లు కట్టిన తర్వాతే ఓట్లడుగాలి. లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇక ఇంతకన్నా చెప్పేదేం ఉండదు.
కేటీఆర్: మీకు ఈ సోర్స్ ఎవరిచ్చారో తెలియదు. కానీ ఇదంతా అబద్ధం. బీజేపీతో పొత్తు ఆలోచన అసలే లేదు. మీరు భగవద్గీతను తెచ్చిపెట్టండి. నిజం తప్ప అబద్ధం చెప్పను. ‘బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటయి.. నేను గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిని అవుతాను..’ అన్నదానిపై ఇంతకంటే ఇమాజినేషన్ స్క్రిప్ట్ ఎవరూ రాయలేదు. కానీ ఈ సోర్స్ ఆధారంగా స్క్రిప్ట్ రాసి సినిమా తీస్తే బాహుబలి కంటే పెద్ద హిట్ అవుతుంది. సినిమా స్క్రిప్ట్ రాసి మీరే ప్రొడ్యూస్ చేయండి. ఎవరైనా హీరోను మీ జర్నలిస్టుల నుంచి మంచి వాళ్లను చూసి పెడుదాం. మా పరిధి చాలా చిన్నది. నేను చాల చిన్న మనిషిని. చిన్న రాష్ట్రమైన తెలంగాణలోనే ఉంట. మీతోనే ఉంట. ప్రెస్‌క్లబ్‌కు రావద్దంటే నాకేం అభ్యంతరంలేదు. బయటే ఉండి నా పని నేను చేసుకుంట.
కేటీఆర్: నేపాల్ తరహాలో ఇక్కడ కూడా జెన్-జీ ఉద్యమం రావచ్చు అని నేను ఆరు నెలల క్రితమే ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పిన. కానీ అప్పుడక్కడా ఉన్నవాళ్లు కొందరు వెకిలిగా నవ్వారు. ఇప్పుడు ఏమైంది? సీజేఐ అన్న ఒక్క మాటమీదికెళ్లి కాక్రోచ్ జనతా పార్టీ పెడితే సోషల్ మీడియాలో బీజేపీ కంటే ఎక్కువగా 14 మిలియన్లు ఫాలోవర్లు చేరారు. దీనర్థం యువత తీవ్ర నిరాశలో ఉన్నది. ప్రభుత్వాలపై వారికి కోపం కనిపిస్తున్నది. దానిని ఎవరూ చానలైజ్ చేసుకొంటే వారే నెగ్గుతారు.
కచ్చితంగా పాదయాత్ర చేస్తా. వచ్చే ఏడాది మొదలుపెడుతా. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏ టైమ్‌లో చేయాలనేది పార్టీలో చర్చించి, పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకొంటం.
నవ్వుతూ మాట్లాడుమని కొందరు మిత్రులు నాతో చెప్తుంటారు. కానీ లేని నవ్వును తెచ్చుకొని మాట్లాడటం కష్టం. నాదీ తెలంగాణ కదా! ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతా. నేను అహంకారంగా ఎప్పుడు మాట్లాడిన. ఒక ఉదంతం చూపెట్టమని అంటే ఎవరూ చెప్పరు. కడుపులో కత్తులు పెట్టుకొని పెదవులపై చిరునవ్వులు చిందించే తెలివితేటలు నాకులేవు. కొంతమందికి నిజం నిక్కచ్చిగా చెబితే నచ్చదు. పర్లేదు అట్ల అలవాటైంది.