నిజామాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రాజన్న సిరిసిల్ల/నిజాంసాగర్: ‘కాంగ్రెస్, బీజేపీది మిలీ జులీ బంధం. బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు ఆ రెండు పార్టీలు జట్టుకట్టి పని చేస్తున్నాయి. వీళ్లకు భయపడే ముచ్చటే లేదు. బీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టీ. మేం ఎవరికీ భయపడబోము. హిందూ ముస్లింలను కేసీఆర్ రెండు కండ్లలా చూసుకున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డితోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాన్సువాడలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్‌లో కేటీఆర్ ప్రసంగించారు.
రేవంత్‌రెడ్డి ఎంగిలి మెతుకుల కోసమే ఇక్కడి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారాడని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుపై స్పీకర్‌కు ఫిర్యాదు ఇస్తే తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని సిగ్గులేకుండా పోచారం చెప్పుకొన్నారని తెలిపారు. ఒకవేళ బీఆర్ఎస్లో ఉంటే ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు నా పక్కన ఉండాలి కదా? ఎక్కడికి వెళ్లాడంటూ పోచారంను కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సీట్లలో కాకుండా వేరే చోట ఎందుకు కూర్చున్నావని అడిగితే.. బాత్రూమ్ పోయేందుకు సులువుగా ఉంటుందని సీటు మారానంటూ పోచారం సమాధానం ఇచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు ఓటేసి ఎమ్మెల్యేగా పోచారంను గెలిపిస్తే ప్రజలను మోసం చేశారరని ధ్వజమెత్తారు. దమ్ముంటే పోచారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తలపడాలని సవాల్ విసిరారు. రోషం ఉంటే రాజీనామా చేసి ఎన్నికను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి ముమ్మాటికీ కాంగ్రెస్ మనిషి కాదని కేటీఆర్ చెప్పారు. ఢిల్లీలో మోదీని చౌకీదార్ అంటూ రాహుల్ బాబా చెప్తున్నారని.. ఇక్కడ మాత్రం అదే మోదీని బడేభాయ్ అంటూ రేవంత్ బాబా చెప్పుకొంటున్నాడని, రేవంత్ ముమ్మాటికీ ఈ బడేభాయ్కి తమ్ముడేనని తెలిపారు. మోదీ, రేవంత్ తోడు దొంగలని విమర్శించారు. రేవంత్ పాలనలో గురుకులాల్లో పిల్లలకు సరిగా అన్నం పెట్టడం లేదని విమర్శించారు. ఇమామ్‌లకు కేసీఆర్ రూ.5వేలు ఇచ్చారని, కాంగ్రెస్ వస్తే రూ.12 వేలు ఇస్తానని చెప్పి 12పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు కేసీఆర్ పాలనలో లక్షా 116 ఇస్తే అదనంగా తులం బంగారం ఇస్తానంటూ రేవంత్‌రెడ్డి మాటలు చెప్పాడని, కానీ కాంగ్రెస్ వాళ్లు మహిళల మెడలో నుంచి బంగారం ఎత్తుకుపోయే దొంగలని, దండుపాళ్యం, స్టూవర్ట్‌పురం దొంగల్లా ప్రజలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. మొదటి ఐదేండ్లు వ్యవసాయ మంత్రిగా, ఆ తర్వాత శాసన సభాపతిగా గౌరవించారని, ప్రతి సందర్భంలో లక్ష్మీపుత్రుడంటూ కితాబునిచ్చారని గుర్తుచేశారు. బాన్సువాడకు పోచా రం చేసిందేమీ లేదని చెప్పారు. తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బాన్సువాడను పురపాలక సంఘంగా మార్చానని తెలిపారు. ‘డబుల్ బెడ్ రూం ఇండ్లను పోచారం ఇంటెనుక పొలం అమ్మి ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండు. మంకుపట్టు పడితే పెద్ద మనిషి గదా అని నిజామాబాద్ జిల్లాలో సాయపడతాడేమో అని 10 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిండు.
మరచిపోకండి. కేసీఆర్ హయాంలో 10 వేల కోట్లు అభివృద్ధి చేసిండు’ అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లోకి పోచారం పోయినంక బాన్సువాడకు రూపాయి తెచ్చిండా? రేవంత్‌రెడ్డి ఇచ్చిండా? అని ప్రశ్నించారు. బాన్సువాడకు వస్తున్న మార్గంలో గాంధారిలో తనకు ఒక పంతులు కలిశారని కేటీఆర్ చెప్పారు. రూ.4వేలు వచ్చిన వాళ్లు కాంగ్రెస్‌కు, రూ.2 వేలు పింఛన్ వచ్చిన వాళ్లు కారు గుర్తుకు 11న ఓటెయ్యాలని గుర్తు చేశారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, గిర్దావర్ గంగాధర్, యలమంచిలి శ్రీనివాస్, అంజిరెడ్డి, రత్నకుమారి, రాంచందర్, ధర్మతేజ, మాధవరెడ్డి పాల్గొన్నారు.
సిరిసిల్లకు బతుకునిచ్చిన కేసీఆర్‌ను మున్సిపల్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని, నేతన్నలను అవమానించినోళ్లను, బెదిరించినోళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని 7వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ప్రసగించారు. తనను ఐదు సార్లు గెలిపించిన సిరిసిల్లను బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పదేండ్లలో రూ.1,531 కోట్ల తో అభివృద్ధి చేశానని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఈ రెండేండ్లలో ఏంచేసిందని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మన అభ్యర్థులను గెలిపించుకుంటే.. నాకు బలం ఇచ్చినోళ్లు అయితరు.. అవతల రేవంత్‌రెడ్డిని గల్లాపట్టి అడుగొచ్చు. మనకు చేస్తా అన్న పనులు, హామీలు ఎందుకు చేయలేదని నిలదీస్తాం’ అని చెప్పా రు. సమైక్య రాష్ట్రంలో సిరిసిల్లలో ఉపాధి లేక వందల మంది నేత కార్మికులు చనిపోయారని, తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాక నేతన్నలకు బతుకునివ్వాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెసోళ్లు రాంగానే బతుకమ్మ చీరలు బంద్ చేసిండ్రని, నేతన్నల బతుకులు ఆగం చేసిండ్రని దుయ్యబట్టారు.

సిరిసిల్లలో బతుకమ్మ చీరలు బంద్ పెట్టడంతో సాంచాలు మూలనపడ్డాయని, నేతన్నలకు పనిలేకుండా పోయిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదని సేట్లు, ఆసాములు వెళ్లి కాంగ్రెస్ నేత మహేందర్‌రెడ్డిని అడిగారని చెప్పారు. కేటీఆర్‌పై కోపముంటే మీరు మీరు కేసులు పెట్టుకోవాలని, కానీ మా చీరల ఆర్డర్లు ఎందుకు ఆపుతున్నారని, మా కడుపు మీద రేవంత్‌రెడ్డి ఎందుకు తన్నుతున్నాడని నేతన్నలు ప్రశ్నిస్తే.. ‘ఏముందయ్య మీ శాలోల్లు, నిరోధ్‌లు, అప్పడాలు, పాపడాలు అమ్ముకోర్రి’ అని కేకే మహేందర్‌రెడ్డి అవమానించిన విషయం నిజం కాదా? చెప్పాలని ప్రశ్నించారు.
ఇలా అవమానించిన, కడుపు మీద, గుండెమీద కొట్టిన కాంగ్రెసోళ్లకు ఎందుకు ఓట్లేయాలి? మనకు రోషం లేదా? అని చెప్పారు. సిరిసిల్లలో మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి చేతులు తిప్పుతూ ఏదో అని పోయిండని, ఆయన బండి సంజయ్ కాదు, తొండి సంజయ్ అని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అక్షింతలు పట్టుకొని వచ్చి దేవుడి పేరిట ఓట్లు అడగడం తప్ప వారితో అయ్యేది లేదు.. పోయేదేమీ లేదని విమర్శించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గతంలో కేసీఆర్‌ను ఉద్దేశించి పోచారం చేసిన వ్యాఖ్యల వీడియోను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రదర్శించారు. ‘జన్మలో మిమ్మల్ని మరువను.. ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా’ అంటూ ఆనాడు పోచారం చెప్పిన మాటల వీడియోను ప్రజల ముందుంచారు. సచ్చే వరకు కేసీఆర్‌తో ఉంటానని చెప్పినోడు ఇప్పుడెక్కడున్నాడు? అంటూ ప్రశ్నించారు. మాట తప్పినందుకు బండ కట్టుకొని బాయిలో దూకండంటూ హితవు పలికారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని కూడా కేటీఆర్ వినిపించారు. పోచారం శ్రీనివాసరెడ్డిని ఆంబోతుగా, ఆయన కుమారులను దున్నపోతులుగా దూషించిన సంగతిని ప్రజల కండ్లకు కట్టారు. బండ బూతులు తిట్టిన రేవంత్‌రెడ్డి చంకలో కూర్చున్నాడంటూ పోచారం వైఖరిపై కేటీఆర్ మండిపడ్డారు.
‘ముఖ్యమంత్రిని అనుముల రేవంత్‌రెడ్డి అని పిలువడం మానేశా.. లాగుల తొండల్‌రెడ్డి అని పిలుస్తున్నా’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రైతుబంధు ఎకరాకు రూ.15 వేలు, ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్ష చెక్కుతోపాటు తులం బంగారం, రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలు, ప్రతి మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామని ఎన్నో హామీలు ఇచ్చింది. తీరా ఇప్పుడు ఆ హామీలు ఏవని నిలదీస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి లాగులో తొండలు ఇడుస్తా అని అంటడు.. అందుకే ఆయన్ను లాగుల తొండల్‌రెడ్డి అని పిలుస్తున్నా’ అని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి ఆలోచన చేయాలని, ఈ ఎన్నికలతోనే ప్రభుత్వంలో మార్పు రాదని పేర్కొన్నారు. కానీ ఉదయం లేచినప్పటి నుంచి ఓ మంచి పనిచేయడం చేతకాని లాగుల తొండల్‌రెడ్డి.. 24 గంటలూ కేసీఆర్‌ను తిట్టుడే పనిగా పెట్టుకొన్నాడని ధ్వజమెత్తారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. రూ.1,000, రూ.2,000 కోసం ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేస్తే.. హామీలను విస్మరించినా ప్రజలు తమకే ఓటేస్తున్నారని, ఆ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతాడు జాగ్రత్త అని హెచ్చరించారు. కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు ఉన్నారు.