హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు హైదరాబాద్ ఏఐజీ దవాఖాన వైద్య బృందంతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. గోపీనాథ్‌కు ఐసీయూలో అందిస్తున్న చికిత్స వివరాలను సీనియర్ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.
గోపీనాథ్‌కు అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉన్నదని ఏఐజీ వైద్య బృందం కేటీఆర్‌కు వివరించింది. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను కేటీఆర్ ధైర్యం చెప్పారు. గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండేందుకు కేటీఆర్ తన పర్యటనను కుదించుకుని గురువారం రాత్రే హైదరాబాద్‌కు బయలుదేరారు.