KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 50వేల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్న నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గమని.. ఉప ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలువాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అధికారంలోకి వచ్చాక బస్తీల్లో ఉండే పేదల ఇండ్లు కూల్చుతున్నదని మండిపడ్డారు.
సీఎం రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలో ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నాడని.. హైదరాబాద్‌లో రేవంత్, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లోనే ఉందని.. ఇలా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ నేతల ఇండ్లన్నీ బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నాయన్నారు. కూట్లో రాయి తెయ్యలేని వాడు, ఎట్లో రాయి తీస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడని విమర్శించారు. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలకు నివాళిగా, మరొక్కసారి జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగురవేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. 20 నెలల కాంగ్రెస్ అసమర్థ, అవినీతి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలంతా వచ్చి తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
మోసగాళ్లకు, మోసగాళ్ల పార్టీ అయిన కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని, రానున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. 20 నెలల కాంగ్రెస్ మోసాన్ని చూసిన తర్వాత కూడా కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలిచిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయని.. మళ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు వేసినా, ఉన్న పథకాలన్నీ పోతాయన్నారు. కాంగ్రెస్ మోసానికి తెలంగాణ ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీల ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడమేనన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు తాను ఒక్కటే చెబుతున్నానని.. గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దని.. గెలుస్తామని ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినా మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీని వీడలేదని.. ఉపఎన్నిక గెలిచి మాగంటి గోపీనాథ్ అంకితమివ్వాలన్నారు.