KTR | మొన్న ఉద్యమ పార్టీగా.. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కీర్తి మనది..!! నిన్న అధికార పార్టీగా.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించిన ఘనత మనది..!! నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా.. కోట్లాది ప్రజల పక్షాన దగాకోరు సర్కారుపైసమరశంఖం పూరించి తెలంగాణ గొంతుకగా నిలిచిన చరిత మనది..!! అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ప్రజలతో విడదీయలేని పేగు బంధానికి ప్రతీక.. తెలంగాణ స్వీయ రాజకీయ అస్థిత్వ పతాక..” మన గులాబీ జెండా ” అని కేటీఆర్ అన్నారు. 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమ శక్తినంతా ధారపోసి నిస్వార్థంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ జాతిపిత కేసీఆర్ సారథ్యంలో ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణంలోని ప్రతి పేజీ చారిత్రాత్మకం.. ప్రతి పోరాటం ప్రతిష్టాత్మకం..ప్రతి మలుపు ఓ చెరగని సంతకం అని అన్నారు. ఎన్నెన్నో త్యాగాలు, బలిదానాల పునాదుల మీద సాధించిన తెలంగాణ, కాంగ్రెస్ కబంధహస్తాల్లో విధ్వంసం అవుతున్న వేళ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన.. మరో ప్రతినబూనుదామని పిలుపునిచ్చారు. తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కొట్లాడుదామని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం.. మనమంతా పునరంకితం అవుదామని అన్నారు.