హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ‘ఎస్ఎల్బీసీ టెన్నెల్లో 8 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిస్తే మంత్రులు మాత్రం హెలికాప్టర్ యాత్రలు చేస్తూ చేపల కూరతో విందులు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు అన్నంలేక పస్తులుంటున్నారు. ఇదీ రేవంత్రెడ్డి సర్కారు నిర్వాకం’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు హాస్టల్ సిబ్బంది మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయం, రాత్రి రామాజిపల్లిలోని గంగమ్మ ఆలయంలో అన్నదానానికి వెళ్లాలని చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు. తిండి కోసం అంతదూరం వెళ్లలేక విద్యార్థులు పస్తులతో రాత్రి గడిపారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘విద్యార్థులను పండగపూట పస్తులుంచడమే ప్రజాపాలనా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.