హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జీఎస్డీపీ, తలసరి వృద్ధిరేటులో తెలంగాణ అట్టడుగున నిలవడమే ఇందుకు నిదర్శనమని బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తారా? కోట్లాది మంది జీవితాలతో చెలగాటం ఆడుతారా? అని కాంగ్రెస్ హైకమాండ్‌పై ధ్వజమెత్తారు. ఆర్థిక వృద్ధిలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రాన్ని.. పాతాళానికి పడేసిన ఈ పాపం క్షమించరానిదని పేర్కొన్నారు. టూరిస్టు పార్టీలను నమ్మితే జరిగే విధ్వంసమిదేనని, విజన్ లేనోళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే జరిగే వినాశనం ఇలాగే ఉంటుందని తెలిపారు. నాటి పదేండ్ల దార్శనిక పాలనకు.. నేటి దగుల్బాజీ విధానాలకు మధ్య తేడాను నాలుగు కోట్ల సమాజం నిశితంగా గమనిస్తున్నదని వివరించారు. ఇక జీవితంలో ఈ ఢిల్లీ పార్టీలను తెలంగాణ నమ్మదని, మళ్లీ ఎప్పటికీ మోసపోదని చెప్పారు.