హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 100వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుభాకాంక్షలు తెలిపారు. విద్యానగర్‌లోని చుక్కారామయ్య నివాసానికి వెళ్ళిన కేటీఆర్.. శాలువాతో సత్కరించారు. విద్యా ప్రదాత, తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తనదైన పాత్ర పోషించిన ఆయన 100వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనందరికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి రామయ్య అన్నారు. ఐఐటీ అనగానే గుర్తుకొచ్చే తొలి పేరు, విద్య అంటే గుర్తుకొచ్చే మార్గదర్శి, సేవ అంటే గుర్తుకొచ్చే స్ఫూర్తి అంతా చుక్కా రామయ్యదే అని పేర్కొన్నారు.
వేలాదిమంది విద్యార్థులను ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలకు పంపి దేశానికి అద్భుతమైన సేవ చేసిన గొప్ప విద్యావేత్త అన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు అపారమైనవని, ఉన్నతమైన విద్యను గ్రామీణ విద్యార్థులకు చేరవేసిన గొప్ప కృషికి ఆయన నిలువెత్తు సాక్ష్యమని ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్క రామయ్య అని కొనియాడారు. ఆయన ఆరోగ్యంగా, సుదీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి , కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్ చుక్క రామయ్యకు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

