హైదరాబాద్ సిటీబ్యూరో/ఎర్రగడ్డ, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలన్న ఓ సామాన్యుడి కోరికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు నెరవేర్చారు. హైదరాబాద్‌లోని బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీంఖాన్ ఇంటికి కేటీఆర్ వెళ్లి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రజా జీవితంలో ఇలాంటి ఆహ్వాన ఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయని కేటీఆర్ చెప్పా రు. అసలు విషయం ఏమిటంటే.. ఈ నెల 2న నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేటీఆర్‌కు ఇబ్రహీంఖాన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. పదేండ్లుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా రాష్ర్టాభివృద్ధికి అద్భుతంగా పని చేశారని తెలిపారు. దుదదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని, ఈ ఐదేండ్ల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని పేర్కొన్నారు. పదేండ్లు రాష్ర్టానికి అందించిన సేవలకు తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. ఇంటికి వస్తానని ఇబ్రహీంఖాన్ ఇచ్చిన మాట మేరకు.. ఆదివారం వెళ్లారు. కేటీఆర్‌కు ఇబ్రహీంఖాన్ కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఖాన్ కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. దివ్యాంగులైన తన పిల్లలకు అసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే కేటీఆర్ కార్యాలయం స్పందించి ఫించన్ మంజూరు చేయించిన విషయాన్ని కుటుం బం గుర్తుచేసి సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఇంటికి ఆహ్వానించడం సంతోషం
ఇబ్రహీంఖాన్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీంఖాన్ పిల్లలకు చెవుడు, మూగ ఉన్నందున వారికి అవసరమైన చికిత్స ఖర్చులు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఉన్నారు. కేటీఆర్ కోసం ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అక్కడ పెద్దసంఖ్యలో గుమిగూడారు.