హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమకేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీలు జారీచేశారు. ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నందినగర్‌లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు. అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు. లీగల్ టీమ్‌కు అనుమతి లేదంటూ నిలిపివేశారు. వారిని దించిన తర్వాతే ఆఫీస్‌లోకి రావాలన్నారు. అయితే లీగల్ టీమ్ ఉంటే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్లతో వచ్చానన్నారు. లీగల్ టీమ్‌తో రావద్దని నోటీసుల్లో ఉందా, ఉంటే చూపించాలని పోలీసు అధికారులను ప్రశ్నించారు.
కాగా, తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి ఎం. విద్యాసాగర్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆయనతోపాటు సుమారు వంద మంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.