రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : సిరిసిల్లలోని తెలంగాణ భవన్ (Telangana Bhavan).. పేదింటి వివాహాలకు వేదికగా మారింది. పేదంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు, బాంక్వెట్ హాళ్లు ఖరీదైన ఈ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఏసీ కల్యాణ మండపం ఉచిత సేవలందిస్తున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు పేదలందరికీ ఆర్థిక భారం తప్పిస్తున్నది. కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో అత్యధికంగా పేద వర్గాలే ఉన్నందున వారి పిల్లల పెండ్లిళ్లు ఉచితంగా నిర్వహించుకునేందుకు పార్టీ సమావేశ మందిరాన్నే ఏసీ ఫంక్షన్హాల్గా మార్చుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాల్లో అంతులేని సంతోషం నింపుతున్నది.
సుమారు వెయ్యి మంది కూర్చునే సామర్థ్యంతో ఆకర్షణీయంగా ఏసీ సదుపాయంతో రెండున్నరేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో ఇప్పటివరకు 50 వివాహాలు, అనేక శుభకార్యాలు జరిగాయి. పార్టీ కార్యకర్తలతో పాటు, పేదలందరికీ ఉచితంగా అందజేస్తుండంతో కుటుంబాలు సంతోషపడుతూ, కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాయి.
50వ వివాహానికి హాజరైన కేటీఆర్
తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన 50వ వివాహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్త ఆవునూరి వెంకట్రాములు కూతురు ప్రత్యూష-అభిషేక్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, ఇటీవల తంగళ్లపల్లి మండలానికి చెందిన ఎంపీటీసీ కుంటయ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన కేటీఆర్ మాట నిలుబెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం కుంటయ్య కూతురు వివాహాన్ని తెలంగాణ భవన్లో సొంత ఖర్చులతో నిర్వహించి కుటుంబానికి పెద్దన్నగా నిలిచారు.
కేటీఆర్ ఆలోచనతోనే..
కేటీఆర్ ఆలోచన పేదింటి వివాహాలకు ఆసరా అవుతున్నది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం తెచ్చి వేలాది మంది కుటుంబాలకు పెద్దగా నిలిచిండు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో సమావేశ మందిరంలో పేదింటి బిడ్డల వివాహాలకు ఉచితంగా అందజేయాలన్న కేటీఆర్ ఆలోచన సఫలీకృతమైంది.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
అందరికీ అందుబాటులో..
కల్యాణ మండపాన్ని పార్టీ శ్రేణులతో పాటు పేదలందరికీ ఉచితంగా ఇస్తున్నాం. కేటీఆర్ సూచన మేరకు పేదింటి బిడ్డల వివాహాలకు తెలంగాణ భవన్ వేదికగా మారింది. పేదలు తమ బిడ్డల వివాహాలు చేసేందుకు పడుతున్న కష్టాలను చూసి రామన్న చలించారు. సమావేశ మందిరాన్ని కల్యాణ వేదికగా మార్చి అందరికీ ఉచితంగా అందించి.. ఆర్థిక భారం తప్పించాలని తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి ఉపయోగపడుతున్నది.
– జిందం చక్రపాణి, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు