భూగోళం తలకిందులైనా తెలంగాణ రాదన్నవారికి నేను గుర్తుచేస్తున్నా. భూగోళం తలకిందులేమీ కాలేదు కానీ.. దేశ రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసి, భూగోళంపైన తెలంగాణ చరిత్ర పటం గీయించిన నాయకుడు మన చంద్రశేఖరుడు. ‘సంభవామి యుగే యుగే’ అని ఒకరు పుడితే.. అసంభవాలు కూడా సంభవాలు అవుతయి. కేసీఆరే అసలు దురంధర్.
– కేటీఆర్
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పూలను బతుకమ్మ దేవత రూపంలో పూజించే తెలంగాణ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని కొందరు చరిత్ర తెలియని అజ్ఞానులు మాట్లాడుతున్నారని.. అసలు డిక్షనరీలు పుట్టకముందే వేల ఏండ్ల కిందటనే పుట్టింది మన తెలంగాణ అని స్పష్టంచేశారు. ఎందరో అమరుల త్యాగాలు, కేసీఆర్ అసమాన పోరాటంతో విముక్తి పొందిన తెలంగాణ, బీఆర్ఎస్ పాలనలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు వానపాములు కూడా నాగుపాముల్లా బుసలుకొడుతూ తెలంగాణ అభివృద్ధిపై విషం చిమ్ముతున్నాయని ధ్వజమెత్తారు. నాలుగు ఫీట్ల నాయకులైన కాలనాగులతో జాగ్రత్త అని హెచ్చరించారు.
కాలాలు మారుతున్నా మూలాలు మరచిపోకుండా మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నదని చెప్పారు. ప్రవాసీ తెలంగాణవాసులు పురిటి గడ్డ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా శాఖ ఆధ్వర్వంలో నిర్వహించిన 12వ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ చారిత్రక వైభవం, ఉద్యమ ఘట్టాలతో పాటు పదేండ్ల కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న గోసను కళ్లగట్టారు. ప్రవాసీ తెలంగాణవాదుల కర్తవ్యాన్ని గురుచ్తేస్తూ భవిష్యత్ తెలంగాణ రూపకల్పనకు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
వేల ఏండ్ల కిందట తెలివాహ నది నీళ్లతో తడిచిన మాగాణంలో మన కథ మొదలైంది. తెలివాహ అంటే.. గోదావరి నది. ఆ నది ఒడ్డున ఉన్న మాగాణమే.. తెలిగాణగా, ఆ తర్వాత తెలంగాణగా మారింది. గోదావరి, కృష్ణా రెండు జీవ నదుల మధ్యన విలసిల్లిన ప్రాచీన నాగరికత. ఆ నాగరికతకు నవీనమైన వారసులం మనం. ఆ నదుల నీళ్లు తాగి పెరిగిన వందల తరాల బంధువులం మనం.
– కేటీఆర్

కాలాలు మారుతున్నా.. మూలాలను మర్చిపోకుండా.. జననీ జన్మభూమి వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకమని కేటీఆర్ పేర్కొన్నారు. ‘మలేషియాలో తెలంగాణ పరిమళాలను వెదజల్లుతున్న మిత్రులకు సలాం. పుట్టిన నేలను తల్చుకుంటేనే ఒక పులకింత.. పరదేశంలో ఉంటూ మన ప్రదేశం వాళ్లంతా ఒక్కచోట కలిసి.. ఆటలు, పాటలు పాడుతుంటే ఆనందంగా ఉన్నది. ఏ దేశామేగినా.. ఏ పీఠమెక్కినా.. ఉన్న ఊరును, కన్న తల్లిని ఎన్నడూ మర్చిపోలేదు. మన ఊరు తెలంగాణ, మన తల్లి తెలంగాణ. ఖండాలు దాటి వెళ్లినా.. సప్త సముద్రాలు దాటిపోయినా.. పిల్లలెప్పుడూ తల్లి క్షేమాన్ని కోరుకుంటారు.
అందుకే ప్రతి ప్రదేశంలో ఉన్న మన బిడ్డలు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నారు’ అని కేటీఆర్ చెప్పారు. గతేడాది అమెరికాలోని డల్లాస్‌లో ఆవిర్భావ సంబురాలను ఘనంగా జరుపుకొన్నామని, ఈసారి మలేషియాలోని తెలంగాణ కమ్యూనిటీ మధ్యన ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. ‘మీరందరూ ప్రవాసులు కారు.. ప్రతిక్షణం తెలంగాణ తల్లి హృదయ నివాసులు’ అని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి పుట్టిన రోజు, బానిస సంకెళ్లను తెంచుకున్నరోజు.. స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు.. తమ ఊపిరి వదిలి.. పోరాటానికి ఊపిరులు ఊదిన అమరులను స్మరించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘చరిత్ర తెలియని కొంతమంది అజ్ఞానులు.. డిక్షనరీలో తెలంగాణ అనే పదమే లేదన్నారు. వాళ్లకు తెల్వంది ఏందంటే.. డిక్షనరీలు పుట్టకముందే వేల ఏండ్ల కిందటనే పుట్టింది మన తెలంగాణ’ అని కేటీఆర్ వెల్లడించారు. ‘ఏడేడు తరాలు.. చుట్టాలు ఎవరంటే.. రాణీరుద్రమ, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ, రాంజీ గోండు, కొమురం భీం, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, దొడ్డి కొమురన్న, షోయబుల్లా ఖాన్, షేక్ బందగీ.. ఇలా ఎందరో వీరులు.. ధీరులు.. అణువణువునా, నరనరాన పోరాట స్ఫూర్తి పోటెత్తే జాతి మనది’ అని కేటీఆర్ ఉద్యమగుర్తులను మననం చేసుకున్నారు. ‘తమ బిడ్డలకు ఉద్యమాల ఉగ్గు పాలు తాగించి పెంచింది తెలంగాణ తల్లి. ప్రతి తరంలో ఏదో ఒక రణం. సాయుధ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, త్యాగాలతో తరించి గొప్ప సమాజం తయారైంది. మన ఊరి పేరు ఉద్యమం. ఇంటి పేరు చైతన్యం’ అని అన్నారు.

‘25 ఏండ్ల కిందట తెలంగాణ ఏర్పడటం అసంభవం, అసాధ్యమన్నారు. తెలంగాణ వస్తే మీకు నడిపే సత్తా ఉన్నదా? మీ దగ్గర నాయకత్వ పఠిమ ఉన్నదా? మీకంత శక్తి ఉన్నదా?’ అని శంకించించారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఆశలు లేవు, నమ్మకాలు లేవు, అటు సూర్యుడు ఇటు పొడిచినా.. తెలంగాణ రానే రాదని అన్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. కానీ, చంద్రుడే సూర్యుడై తెలంగాణను పొడిపించాడు. ఆయనెవరో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయనే చంద్రశేఖరుడు’ అని కేసీఆర్ త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఆ నాడు సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కేసీఆర్ తెలంగాణ జాగ్రఫీని క్రియేట్ చేశారని చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. ‘నాడు అసంభవం అనుకున్న తెలంగాణ నేడు ఎట్లా సంభవమైంది? ‘సంభవామి యుగే యుగే’ అని ఒకడు పుడితే.. అసంభవాలు కూడా సంభవాలు అవుతయి. అనితర సాధ్యుడు అడుగువేస్తే.. అసాధ్యం కూడా సుసాధ్యమైంది’ అని కేటీఆర్ అన్నారు.
‘పోరాటాలే కాదు.. తెలంగాణలో కళాకారులు, చిత్రకారులు, వాగ్గేయగాణకు, వైతాళికులు వర్ధిల్లిన.. సాహిత్య, సాంస్కృతిక మాగాణ మన తెలంగాణ. మహా భాగవతం రచించిన పోతన, ఆదికవి పాల్కూరి సోమన్న నుంచి దాశరథి, కాళోజీ, వట్టికోట అళ్వారుస్వామి, సీ నారాయణరెడ్డి దాకా మహాకవులు మన ప్రాంతం నుంచి వచ్చారు. కంచర్ల గోపన్న నుంచి గోరటి వెంకన్న దాకా ధిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజా కళాకారులెందరో?’ అని కేటీఆర్ వర్ణించారు. సింగిడి రంగులను పేర్చి, పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించే ఒకే ఒక్క పండుగ బతుకమ్మ అని.. దానిని ఆచరించే ఒకే ఒక్క జాతి తెలంగాణ జాతి అని సగర్వంగా చెప్పారు.
‘బతుకమ్మలు, బోనాలు.. జాలువారే జానపద పాటలు తెలంగాణ సొంతమన్నారు. ‘పుడితే పాట, చస్తే పాట, పండుగొస్తే పాట, పస్తులుంటే పాట, గెలిస్తే పాట, ఓడినా పాటే.. అదీ తెలంగాణ వైవిధ్యం. అందుకే అంటున్నా.. ఎవ్వరికి ఉన్నది ఇల్లాంటి అమోఘమైన సంస్కృతి? ఎవ్వరికి ఉన్నది ఇంత అపురూపమైన సంప్రదాయం. గర్విద్దాం.. గల్లా ఎగరేసి చెబుదాం.. నాది తెలంగాణ, నేను తెలంగాణ బిడ్డనని’ అని తన ప్రసంగంతో ఉత్సాహం నింపారు.
ఇతిహాసాల కాలం నాటి కథ మనది. మహాజనపదాల యుగంలో మనుగడ సాగించిన.. అస్మక జనపదం నాటిది మన అస్తిత్వం. మన రాష్ట్ర చరిత్ర మహోన్నతం. మన ఆనవాళ్లు అతి పురాతనం. శాతవాహనుల శౌర్య పరాక్రమాలు.. కాకతీయుల కళావైభవాలు.. కుతుబ్‌షాహీ, అసఫ్ జాహీలు కీర్తి పతాకాలుగా రాజిల్లిన తెలంగాణ మనది.
– కేటీఆర్
‘తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఒక రణం జరిగింది. స్వరాష్ట్రం కోసం ఒక సమరమే జరిగింది. ఇది మామూలు పోరాటం కాదు. మహోన్నత పోరాటం. ఆ వీరుల గాథలు వింటేనే నెత్తురు ఉరుకులు పెడుతున్నది. ఆ ఉద్యమ కథలు వింటేనే తనువు పులకరిస్తున్నది’ అని కేటీఆర్ చెప్పారు. సకలజనుల సమ్మె, సాగర హారాలు, మిలియన్ మార్చ్‌లు, వంటా వార్పులు, జలసాధన యాత్రలు జరిగాయన్నారు. విదేశాల్లో ఉన్న మీరు ప్రవాస తెలంగాణ బిడ్డలు.. పుట్టిన గడ్డ కోసం మీరు అండదండగా నిలబడ్డారని వివరించారు. మలేషియాలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఎప్పటికప్పుడు అస్తిత్వ పోరాటాల ద్వారా మన రాష్ట్రం సాధించుకున్నామని.. మనం కలలుగన్న తెలంగాణ నిజమై అభివృద్ధి బాట పట్టిందన్నారు.
జూన్ 2వ తేదీ ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ ఘట్టం వెనుక చరిత్రనే మార్చిన రెండు తారీఖులు ఉన్నాయి. అందులో ఒకటి 2001 ఏప్రిల్ 27 జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరిన రోజు.. టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టినరోజు..
ఊహకందని వ్యూహాలు, ఎదురులేని ఎత్తుగడలు, అహింసనే ఆయుధంగా చేసుకొని గమ్యాన్ని ముద్దాడిన అసలు దురంధరుడు కేసీఆరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని తెగించి 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు పూనుకున్నారని తెలిపారు. చిమ్మచీకట్లో ఒక్కడే బయల్దేరిన నాడు నమ్మి, వెంట నడిచిన వారు లేరని.. అయ్యేది కాదు, పోయ్యేది కాదని సూటిపోటి మాటలు మాట్లాడరని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో అరుణ్‌జైట్లీ కేంద్ర మంత్రిగా ఉండగా ఢిల్లీకి వెళ్లి కలిసినప్పుడు ఓ గొప్ప మాట చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘చరిత్రలో చాలా పార్టీలు చూశాం, పార్టీకి పోరాడే నాయకుడైనా ఉంటాడు లేదా పరిపాలన తెలిసిన వారు ఉంటారు.. అయితే మీరు అదృష్టవంతులు.. ఆ రెండూ కలగలిసిన నాయకుడు కేసీఆర్ రూపంలో మీకు ఉన్నార’ని చెప్పినట్టు వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో అతి తక్కువ కాలంలో అమోఘమైన ప్రగతిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదని ఆయన చెప్పారు. మోటివేషన్, ఇన్స్పిరేషన్ కావాలంటే వ్యక్తిత్వ వికాసం చదువాల్సిన అవసరం లేదని తెలంగాణ అభివృద్ధిని చదువాలని సభికులకు కేటీఆర్ సూచించారు.
శిథిలాల నుంచి శిఖరాలకు, ఉద్యమ తెలంగాణ, ఉజ్వల తెలంగాణగా ఎదిగిన స్ఫూర్తిదాయక, అపురూపమైన కథం తెలంగాణది అని వివరించారు. ప్రపంచంలో కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, వియత్నాంలాంటి దేశాలను ‘ఏషియన్ టైగర్స్ క్లబ్’గా పిలుస్తారని, అవి చిన్న దేశాలే అయినా సాధించిన విజయాలు అతి గొప్పవని కేటీఆర్ పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ సైతం అనతికాలంలోనే అద్భుత విజయాలను సాధించిందని తెలిపారు. ‘లీడర్ ఈజ్ వన్, హూ నోస్ ద వే, గోస్ ద వే, అండ్ షోస్ ద వే’ అని జాన్ మ్యాక్స్‌వెల్ చెప్పారని, అలాగే రేపటి తరాల గురించి ఆలోచించేవాడే నిజమైన నాయకుడు అని పేర్కొన్నారు. కరువులు, వలసల నుంచి తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని స్పష్టంచేశారు.
మలేషియాతో తెలంగాణకు అనుబంధం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఏకైక ఉద్దేశంతో మలేషియా మాదిరిగానే తెలంగాణలో ఆయిల్‌పామ్ విప్లవం సృష్టించారని తెలిపారు. మలేషియా నుంచి పామాయిల్ విత్తనాలు, మొక్కలు తీసుకువచ్చి తెలంగాణలో నాటించిన అంశాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. కేవలం పదేండ్లలోనే కేసీఆర్ ముందుచూపుతో పంట మార్పిడి జరగాలని ఆయిల్‌పామ్ పంటను ప్రోత్సహించడం వల్లే ఈ రోజు పరిస్థితి మారిందని పేర్కొన్నారు. వ్యవసాయదారులకు 24గంటల ఉచిత విద్యుత్, ఇంటింటికీ నల్లా పెట్టి మంచినీళ్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.
నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్‌దే అని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ నినాదం దిశగానే కేసీఆర్ పాలన సాగిందని స్పష్టంచేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. 2014లో మన తలసరి ఆదాయం రూ.94వేలు అని, 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయం రూ.3,47,000లకు చేరుకున్నదని ఆయన వివరించారు.
ఖండాలు దాటి వెళ్లినా.. సప్త సముద్రాలు దాటిపోయినా.. పిల్లలెప్పుడూ తల్లి క్షేమాన్ని కోరుకుంటారు. అందుకే తెలంగాణ గడ్డమీదనే కాదు.. ప్రపంచంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మన బిడ్డలు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నారు. మలేషియాలో తెలంగాణ పరిమళాలను వెదజల్లుతున్న మిత్రులకు సలాం.
– కేటీఆర్
పుడితే పాట, చస్తే పాట, పండుగొస్తే పాట, పస్తులుంటే పాట, గెలిస్తే పాట, ఓడినా పాటే.. అదీ తెలంగాణ వైవిధ్యం. అందుకే అంటున్నా.. ఎవ్వరికి ఉన్నది ఇల్లాంటి అమోఘమైన సంస్కృతి? ఎవ్వరికి ఉన్నది ఇంత అపురూపమైన సంప్రదాయం. గర్విద్దాం.. గల్లా ఎగరేసి చెబుదాం.. నాది తెలంగాణ, నేను తెలంగాణ బిడ్డనని.
– కేటీఆర్
29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ(ఎస్వోటీఆర్), ధాన్యం ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి, తలసరి విద్యుత్తు వినియోగంలో, జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను అందించడంలో, ఇనిస్టిట్యూషనల్ డెలివరీల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. 2014 ఆగస్టులో కేసీఆర్ సింగపూర్‌లో నిర్వహించిన ‘ఇంపాక్ట్’ సదస్సులో మాట్లాడుతూ.. ఉన్న కంపెనీల్లో ఉద్యోగం వదిలి, సొంత కంపెనీ స్థాపించిన వ్యాపారవేత్తలు మాతృసంస్థను మించి ఎదిగేదాక విశ్రమించరని, తెలంగాణ విజయగాథ కూడా అలాంటిదే అని కేటీఆర్ ఉదహరించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన రిపోర్టులో ఉత్తమ గ్రామపంచాయతీలకు ఎంపికైన గ్రామాల్లో 30శాతం గ్రామాలు తెలంగాణ నుంచే ఉన్నట్టు చెప్పారు.
ఇవేమీ తెలియని 4ఫీట్లు ఉన్న నాయకులు కొంతమంది తెలంగాణ గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, నీళ్ల గురించి, నిధుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాధించిన రాష్ట్రంలో నరం లేని నాలుక ఉన్నవాళ్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాముల మాదిరి బుసలు కొడతాయని, కానీ రెండున్నరేండ్లలో మన సమయం వస్తుందని, మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
‘భవిష్యత్ తెలంగాణ రూపకల్పనే లక్ష్యంగా బీఆర్ఎస్కు రాబోయే 25 ఏండ్ల కోసం ప్రత్యేకమైన విజన్ ఉన్నది..దానిని సాకారం చేసే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది..’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతికరంగాలు ప్రపంచాన్ని కుదేపిస్తున్న ప్రస్తుత తరుణంలో విజ్ఞానమున్న వాడిదే అగ్రస్థానమని స్పష్టంచేశారు. నాడు అణ్యాయుధాలున్న దేశం అగ్రస్థానంలో నిలబడితే ఇప్పుడు విజ్ఞానవంతులు కలిగిన దేశమే అన్నిరంగాల్లో పురోగమించే పరిస్థితి ఉన్నదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములుకావాలని పిలుపునిచ్చారు. అన్నింటా వెనుకబడ్డ తెలంగాణను పదేళ్ల పాలనలో అద్భుతాలు సృష్టించి అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్కే దక్కిందని పునరుద్ఘాటించారు.
అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో తల్లడిల్లిన తెలంగాణకు 24గంటల ఉచిత, నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇదేస్ఫూర్తితో 24గంటల స్వచ్ఛమైన తాగునీరందించాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని, ఇదే భవిష్యత్ తమ కార్యాచరణ అని స్పష్టంచేశారు. అలాగే ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకుసాగుతామని ప్రకటించారు. తెలంగాణను తిరిగి అభివృద్ధి పథంలో నిలిపే శక్తి కేసీఆర్‌కే ఉన్నదని, మళ్లీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నుంచి వచ్చిన అంధకారాన్ని తరిమికొట్టి భవిష్యత్ తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు.
ప్రస్తుత గ్లోబల్ ప్రపంచంలో అనేక దేశాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులు, స్థానికులతో కలిసిమెలిసి సాగినప్పుడే విజయాలు సాధ్యమని నొక్కి చెప్పారు. స్థానిక సంస్కృతితో కలిసి ముందుకుసాగినప్పుడే అద్భుతమైన ఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. మలేషియాలో ఇంత అద్భుతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించిన మలేషియా తెలుగు అసోసియేషన్, బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
విజయవంతానికి రాత్రింబవళ్లు కృషి చేసిన బీఆర్ఎస్ శ్రేణులకు మనసారా కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మైటా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి, బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సీనియర్ నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి. పార్టీ జనరల్ సెక్రటరీ గ్యాదరి బాలమల్లు, నాగేందర్‌రెడ్డి, ప్రజాగాయకుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో నరం లేని నాలుక ఉన్నవాళ్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాముల మాదిరి బుసలు కొడతాయి. కానీ రెండున్నరేండ్లలో మన సమయం వస్తుంది. మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం.
– కేటీఆర్