జిల్లాలో ముగ్గురు మోసగాళ్లున్నరు. ఆ మంత్రులకు 30% కమీషన్ల యావ తప్ప కనీసం రైతులకు యూరియా ఇవ్వాలన్న సోయి కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో 7 నుంచి 8 స్థానాలు గెలుస్తం. ఇంకా గట్టిగా పనిచేస్తే పదికి పది స్థానాలు కూడా గెలుస్తం. -కేటీఆర్
ఖమ్మం, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు 30% చొప్పున కమీషన్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘బాంబులేటి’కి 30% టాక్స్ కట్టాల్సిందేనని, ఆయన దగ్గరికి ఏ భూ పంచాయితీ వెళ్లినా, దాని విలువలో 30% అడుగుతున్నారని విమర్శించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు. జిల్లాలో ముగ్గురు మోసగాళ్లు ఉన్నారని, వీరికి అసలైన నాయకుడు అలీబాబా వీరిపైన ఉన్నారని విమర్శించారు. ముగ్గురు మంత్రుల్లో ఏ ఒకరూ జిల్లాకు పనికొచ్చే పనులు చేయడం లేదని, కనీసం రైతులకు యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైందనే విషయాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో క్వార్టర్ ఫైనల్ ఫలితాలు వచ్చాయని, ఇక పురపాలక, ప్రాదేశిక ఎన్నికల్లో సెమీఫైనల్ ఫలితాలు వస్తాయని, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ ఫలితాలు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, ఆగ్రహం కనిపిస్తున్నాయని స్పష్టంచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ 7-8 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని, నేతలందరూ మరింత ఐక్యంగా కష్టపడితే పదికి పది స్థానాలూ గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు.
యూరియా లేని యాప్
షాపుల్లో యూరియా లేకుండా, యాప్ తెచ్చినా, కార్డు తెచ్చినా ప్రయోజనమేమిటని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా యూరియా కట్ట కూడా రైతులకు ఇప్పించలేకపోయారని అన్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ పాలేరు నియోజకవర్గ రైతు ఒకరు స్వయంగా తనతో మాట్లాడిన విషయాన్నే చెప్తున్నానని కేటీఆర్ వివరించారు.
గ్యారెంటీ కార్డు ఎక్కడ దాచుకోవాలి?
‘గ్యారెంటు కార్డును భద్రంగా భద్రపర్చుకోండి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కార్డులోని హామీలన్నింటినీ అమలు చేస్తాం’ అంటూ నాడు డిప్యూటీ సీఎం భట్టి మాట ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. మరి ఇప్పుడు రెండేండ్లయినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ కార్డును ఎక్కడ దాచుకోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ది సర్వభ్రష్ట ప్రభుత్వమని కేటీఆర్ మండిపడ్డారు.

అభివృద్ధి, పెట్టుబడి కోసమే అప్పులు
కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసిన మాట నిజమేనని, కానీ అది తెలంగాణ అభివృద్ధి కోసం, సంపద సృష్టికి, సంక్షేమానికి ఉపయోగించా రని వివరించారు. కేసీఆర్ చేసిన అప్పు రూ.2.87 లక్షల కోట్లని కేంద్రం చెప్తుంటే.. రూ.6 లక్షల కోట్లంటూ భట్టి, రూ.7 లక్షల కోట్లంటూ తుమ్మల, రూ.8 లక్షల కోట్లంటూ బాంబులేటి, రూ.10 లక్షల కోట్లంటూ రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మరి, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో అప్పుగా తెచ్చిన 2 లక్షల కోట్లు ఎకడికెళ్లాయని ప్రశ్నించారు.
ఆంధ్రాలో చదివితే తప్పు.. అల్లుడైతే ఒప్పా?
‘1991లో గుంటూరులోని రావు రత్తయ్య కాలేజీలో ఇంటర్ చదువుకున్నాను. నేనైతే ఆంధ్రాలో చదువుకోవద్దు. ఆయన మాత్రం అదే ఆంధ్రాలోని భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకోవచ్చా’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన బాంబులేటి మంత్రి దీపావళికి బాంబులు వేస్తానని అన్నాడని, ఇప్పటికే రెండు దీపావళులు వెళ్లాయని గుర్తుచేశారు. ఆయన మాత్రం అదానీ, మోదీ కాళ్లు పట్టుకొని ఈడీ కేసులు లేకుండా బీజేపీలో చేరతానంటూ దండం పెడుతున్నారని విమర్శించారు. మరో మంత్రి కార్పొరేటర్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని, తాను ఇకడికి వస్తుంటే ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను తీసుకెళ్లి సీఎం రేవంత్ దగ్గర కూర్చోబెట్టారని మండిపడ్డారు. ‘ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని వెళ్లినా పీకేది ఏమీ లేద’ని స్పష్టంచేశారు. తాము కొత్తవారికి అవకాశం ఇస్తామని, కొత్త నాయకులకు తయారుచేస్తామని చెప్పారు. ఖమ్మంలో మున్నేరు కరకట్ట పనులు, కేబుల్ బ్రిడ్జి పనులు, రహదారులు, జంక్షన్ లభివృద్ధి, కొత్త బస్టాండు, మున్సిపల్ ఆఫీస్, ఐటీ హబ్ లాంటి అభివృద్ధి పనులను చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేని వివరించారు. ఇవన్నీ తన హయాంలో జరుగుతున్నట్టు తుమ్మల చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
ఈస్ట్‌మన్ కలర్లో సినిమా..
కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఈస్ట్‌మన్ కలర్లో సినిమా చూపించారని కేటీఆర్ విమర్శించారు. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం..’ అంటూ హామీలు ఇచ్చి రెండేండ్లు అవుతున్నదని కానీ, ఖమ్మంకు ఇంతవరకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ అద్భుతంగా డిజైన్ చేశారని గుర్తుచేశారు. 90% పనులు కేసీఆర్ పూర్తి చేశారని, 2023 డిసెంబర్ రెండో తేదీన మనం దిగిపోయే నాటికి కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి మాదిరిగా వారి చేతికి తాళాలు ఇచ్చి తప్పుకొన్నామని తెలిపారు. అయినా ఈ రెండేండ్లలో వారేం చేశారని ప్రశ్నించారు. ఒక్క పనీ ముందుకు జరగకపోగా ముగ్గురు మంత్రులు కమీషన్ల యావలో పడ్డారని దుయ్యబట్టారు.

ఖమ్మంలో రౌడీ రాజ్యం
ఆర్మీ రవిని నిజంగా అభినందిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. ఈ తమ్ముడి మీద పొంగులేటి కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నించారని, ఎన్నో నిర్బంధాలను ఎదురొని 135 ఓట్ల మెజారిటీతో గెలిచాడని కేటీఆర్ అభినందించారు. అనేక మేజర్ గ్రామపంచాయతీలను టీఆర్ఎస్ గెలిచిందని చెప్పారు. పాలేరు, సత్తుపల్లిలో ఎకువ స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ స్థానాలను గెలుచుకునేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో గూండారాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రు లు, ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని, అయినా సర్పంచ్‌లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. గెలిచిన సర్పంచ్‌లకు రక్షణగా ఉండేది అంబేదర్ రాసిన రాజ్యాంగమేనని అన్నారు. ఈ ఏడాదంతా ప్రజా ఆందోళనలు నిర్వహిస్తూనే, మరోవైపు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించామని తెలిపారు. సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ, చంద్రావతి, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
రామన్నకు ఘన స్వాగతం
కూసుమంచి: హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం మీదుగా ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు బుధవారం ఘనస్వాగతం పలికారు. గులాబీ జెండాలు చేబూని.. బైక్ ర్యాలీలు నిర్వహించి స్వాగతం చెప్పారు. మహిళలు కేటీఆర్‌కు హారతులు పట్టారు. జిల్లా సరిహద్దు, నాయకన్‌గూడెం సెంటర్, కూసుమంచి మండల కేంద్రంలో కార్యకర్తలతో కేటీఆర్ కరచాలనం చేశారు. కూసుమంచి, చేగొమ్మ, జుఝల్రావుపేట, రాజుపేట, గైగోళ్లపల్లి, కిష్టాపురం, ఈశ్వరమాధారం, కూసుమంచి తదితర గ్రామాల నుంచి కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు బైక్ ర్యాలీలు చేపట్టారు. కేటీఆర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా నాయకన్‌గూడెం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ఆ పార్టీ జెండాలతో స్వాగతం పలికారు.
ప్రాజెక్టులపై సీఎంకు అవగాహన లేదు
సీఎం రేవంత్‌రెడ్డికి సాగునీటి ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చిన నాయకుడు, తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఒక కొడుకుగా నా రక్తం రగిలిపోదా?’ అని ప్రశ్నించారు. వాళ్ల మాదిరిగా తాను దిగజారి మాట్లాడనని అన్నారు. సీఎం నోరుపారేసుకుంటుంటే తాను కూడా అనక తప్పడం లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. తెల్లారి లేవగానే రేవంత్‌రెడ్డి ఫ్రస్టేషన్లో ఉంటున్నారని ఆరోపించారు. ‘పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు. హ్యాపీగా పని చేసుకోవచ్చు కదా. కానీ సెక్యూరిటీ సిబ్బందిని కూడా చెంపదెబ్బలు కొడుతున్నావు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘గీతమ్మా.. రేపు ఎవరినైనా కరుస్తడో ఏమో.. ఇంట్లో కట్టేయ్.’ అంటూ చురకలంటించారు.
మళ్లీ సారే కావాలి కేటీఆర్‌తో ముచ్చటించిన కూలీలు
‘అయ్యా.. బాగున్నవా..? పెద్దసారు ఎట్లున్నడు..? మళ్లీ సారే కావాలంటున్నరు..’ అంటూ కేటీఆర్‌ను గడ్డం పట్టుకొని ముజ్జుగూడెంకు చెందిన వ్యవసాయ మహిళా కూలీలు ముచ్చటించారు. ముజ్జుగూడెం పర్యటన ముగించుకొని బుధవారం హైదరాబాద్ తిరుగు పయనమైన సమయంలో యాసంగి నాట్లు ముగించుకున్న మహిళా కూలీలు ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ వాహనాలను చూసేందుకు వారంతా రోడ్డుపైకి రావడంతో, కేటీఆర్ కారు ఆపి వారితో మాట్లాడారు. ‘అమ్మా.. మళ్లీ సారునే తెచ్చుకుందామా..’ అని కేటీఆర్ అనగానే.. ‘తెచ్చుకుందాం..’ అంటూ అన్నమ్మ అనే మహిళా కూలీ.. కేటీఆర్ గడ్డం పట్టుకొని మాట్లాడింది. ఈ సందర్భంగా ‘సారే కావాలంటున్నారే.. తెలంగాణ పల్లెల్లోన..’అనే పాటను కూలీలు పాడారు. వారిని కేటీఆర్ ఉత్సాహపరిచారు. వారితో కాసేపు ముచ్చటించిన కేటీఆర్‌కు కూలీలు కరచాలనం చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
రాహుల్‌గాంధీకి నెలనెలా కప్పం కట్టకపోతే రేవంత్‌రెడ్డి పోస్టు ఊడిపోతుంది. నెలకు రూ.100 కోట్ల చొప్పున 60 నెలలకు రూ.6,000 కోట్లు కట్టకపోతే సీఎం పోస్టు ఊస్ట్. కాళ్లు మొకాలి. కప్పం కట్టాలి. పోస్టు భద్రంగా ఉంటుందో లేదో చూసుకోవాలి.
నువ్వు పీకింది ఏమీ లేదు. బూతు మాటలు తప్ప మంచి పని ఒక్కటీ లేదు. -కేటీఆర్
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన నాయకత్వం ఉన్నది. అందరూ ఐక్యంగా పనిచేస్తే పదికి పది స్థానాలు గెలుస్తాం. కాంగ్రెస్
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, కోపం కనిపిస్తున్నాయి. -కేటీఆర్