దండేపల్లి, ఆగస్టు 7 : ‘నమస్తే అమ్మా, నేను కేటీఆర్‌ను.. మీ సమస్య గురించి నాతో విజిత్ చెప్పిండు. నేనున్నా..’ అంటూ బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన నరెడ్ల సతీశ్ రెండేండ్ల క్రితం దుబాయ్ వెళ్లి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జూలై 29 న షార్జాలో రోడ్డు ప్రమాదానికి గురికాగా పోలీసులు దవాఖానకు తరలించారు.
అతడి ఎడమ చేయి.. కుడి కాలు ఫ్రాక్చర్ కాగా, మరుసటి రోజు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. హాస్పిటల్ ఖర్చులు రూ.5 లక్షలు కాగా కుటుంబసభ్యులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావును సంప్రదించగా.. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం కేటీఆర్‌ను సంప్రదించారు. దీంతో విజిత్‌రావు శుక్రవారం నర్సాపూర్ గ్రామానికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితుడి భార్య భవాని, తండ్రి రామన్నను ఫోన్లో కేటీఆర్‌తో మాట్లాడించారు. కష్టకాలంలో అండగా నిలిచిన కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. విజిత్‌రావు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉండేందుకు కేటీఆర్ హామీ ఇచ్చారని, వారి దవాఖాన ఖర్చులన్నీ భరించి, స్వదేశానికి రప్పించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పారు.