హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యార్థుల మెడికల్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఎంట్రెన్స్‌లో అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్థానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న తెలంగాణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాలసీపరమైన మార్పులు లేదా స్థానికతకు సంబంధించిన అర్హతలను మార్చినప్పుడు, వాటిని గతానుగతంగా కాకుండా భవిష్యత్తు కోసం కటాఫ్ డేట్ పెట్టి, రెండు లేదా మూడేండ్ల సమయం ఇస్తే బాగుంటుందని సూచించారు. కానీ, విద్యార్థులు అప్పటికే తమ ఇంటర్మీడియట్‌ను ఇతర ప్రాంతాల్లో చదువుతూ, ప్రిపేర్ అవుతున్న వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన ఆదేశాలతో ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ఉపశమనం కల్పించాలని ఆశాభావం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికతకు సంబంధించి ఇబ్బందికరమైన జీవోను తీసుకువచ్చిందని విద్యార్థులు కేటీఆర్‌కు తెలిపారు. గతంలో పదో తరగతి వరకు 7 సంవత్సరాలు ఎకడ చదివితే అకడే స్థానికులుగా పరిగణించే నిబంధన ఉండేదని వారు గుర్తుచేశారు. అయితే ఇప్పుడు 9, 10, 11, 12 తరగతులు వరుసగా చదివిన వారికే స్థానికత వర్తిస్తుందని, వారికే మెడికల్ సీట్ల అడ్మిషన్లు దకుతాయని వివరించారు. కొత్తగా ఇచ్చిన ఆదేశాల వల్ల వందల మంది విద్యార్థులు నష్టపోతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. పదో తరగతి వరకు తెలంగాణలో చదివిన తర్వాత, అత్యుత్తమ శిక్షణ కోసం ఆంధ్రాతో పాటు అనేక నాన్-తెలుగు రాష్ట్రాలలో కోచింగ్‌లు తీసుకుని నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యామని తెలిపారు. ఇప్పుడు ప్రతిభ కనబరిచి అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించి ప్రవేశాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను విన్న కేటీఆర్, వెంటనే ప్రభుత్వ ప్రధానకార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. సమస్యను సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కలుస్తుందని కేటీఆర్ విద్యార్థులకు తెలిపారు.