హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): భారతదేశంలో ఐటీకి కేంద్రంగా కొనసాగిన బెంగళూరు నగరంలో ఇప్పుడు స్తబ్ధత వచ్చిందని, అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరమే ఐటీకి కేంద్రంగా మారుతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అమెజాన్, గూగుల్, యాపిల్, ఫేస్బుక్ తదితర అనేక పెద్ద కంపెనీలు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి (టైర్- 2) పట్టణాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, బుధవారం శాన్‌జోస్‌లో ఐటీ సెర్వ్ అలయెన్ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్‌లో క్వాల్కామ్ సంస్థ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిందని చెప్పారు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.
ఐటీ రంగంలో ఎప్పటినుంచో లీడర్‌గా ఉన్న బెంగళూరు నగరంలో ఇప్పుడు అనేక అంశాల్లో స్తబ్ధత ఆవరించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘హైదరాబాద్, బెంగళూరు మధ్య దూరం దాదాపు ఆరువందల కిలోమీటర్లు. హైదరాబాద్ నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లటానికి ఎంత సమయం పడుతున్నదో.. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఇంటికి చేరుకోవటానికి అంత సమయం పడుతున్నదని ఇటీవలే ఓ పారిశ్రామివేత్త చెప్పారు. అంటే అక్కడ ట్రాఫిక్ సమస్య అంతగా పెరిగిపోయింది. ఇతర రంగాల్లో కూడా బెంగళూరులో స్తబ్ధత ఏర్పడింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ఐటీ రంగం హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్‌లకు పరిమితం కాకుండా ఉప్పల్, ఎల్బీనగర్ వంటి తూర్పు, కండ్లకోయ వంటి ఉత్తర ప్రాంతాలకు కూడా విస్తరించింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి ద్వి, తృతీయ శ్రేణి నగరాలకు కూడా ఈ పరిశ్రమ విస్తరిస్తున్నది. ఈ నగరాల్లో ఐటీ టవర్లు ఏర్పాటుచేసి ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం కల్పిస్తున్నాం. రూరల్ టెక్ పాలసీలో భాగంగా వచ్చే ఐదేండ్లలో 50 వేల ఉద్యోగాలు ఈ టైర్-2, టైర్-3 నగరాల్లో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో కంపెనీ ఏర్పాటుచేసుకొనే వీలున్నది. రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటుచేసి సాధ్యమైనంత ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పించండి. మీరే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు. మీ ద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఐటీ సర్వ్ అలయెన్స్‌లో 1400 లకుపైగా ఐటీ కంపెనీలున్నాయి. దీనికి అమెరికాలోని 22 రాష్ర్టాల్లో 19 చాప్టర్లు ఉన్నాయి. ఈ సభ్య కంపెనీల ఆదాయం 10 బిలియన్ డాలర్లు కాగా, లక్ష మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ లూసిడ్ మోటర్స్ సీఈవో, సీటీవో పీటర్ రాలిన్సన్, సంస్థ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ డైరెక్టర్ జేమ్స్ హాకిన్స్‌తో మంత్రి కేటీఆర్ బుధవారం శాన్ జోస్‌లో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఉన్న అవకాశాలను, రాష్ట్రంలోని సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధిని వారికి వివరించారు.
అమెరికాలోని సాన్ జోస్‌లో ఐప్లెడ్ మెటీరియల్స్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు, సీటీవో ఓమ్ నలమసుతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణలో అమలుచేస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, పరిశోధన-అభివృద్ధి, కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో హైదరాబాద్‌లోని అవకాశాలను ఆయనకు వివరించారు. ఐప్లెడ్ మెటీరియల్స్ సంస్థ సెమీ కండక్టర్లు, ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే, సోలార్ ఫొటో ఓల్టిక్ సేల్స్ తదితర ఉత్పత్తులకు సంబంధించిన మెటీరియల్స్, ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్నది.