KTR | హైదరాబాద్లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి, 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంఆణ ప్రజల ఇంటి పండుగ అని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తామని, ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అసహ్యం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సాధించిన విజయాలు అసమాన్యమైనవని, అనితర సాధ్యమైనవని కొనియాడారు. 2017 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150కి 99 కార్పొరేట్ స్థానాలు గెలిచి బీఆర్ఎస్ చరిత్ర సృష్టించిందని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో క్లీన్ స్వీప్ చేశామన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓఆర్ఆర్ లోపల గులాబీ జెండానే ఎగిరిందని తెలిపారు. హైదరాబాద్ వాసుల ముందు కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు, దొంగనాటకాలు పనిచేయవని అన్నారు.
హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అరాచకం సృష్టించారని కేటీఆర్ అన్నారు. తన అన్న ఇంటిని కూల్చలేదు, ధనవంతుల ఇళ్లను ముట్టుకోలేదని తెలిపారు. గరీబోళ్ల ఇండ్లను కోర్టు సెలవులు చూసుకుని హైడ్రా ప్రతాపం చూపించిందని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా హైడ్రా తన పనితీరు మార్చుకోలేదని అన్నారు. హైడ్రా దెబ్బ, రేవంత్ చేతగానితనానికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పతనమైందని తెలిపారు. లక్ష మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదల కడుపు కాంగ్రెస్ కొట్టిందని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటున్నారని మండిపడ్డారు. మూసీతో మురిసే రైతులు ఎందరు? వచ్చే ఉద్యోగాలు ఎన్ని? అని అంటే రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్టీపీలను కట్టి మూసీలోకి వ్యర్థాలు పోకుండా చేశామని గుర్తుచేశారు. మూసీ కోసం ఇండ్లను కోల్పోయినవారు బూతులు తిడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఈ సన్నాహక సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.