హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలువురు పార్టీ జిల్లా నాయకులతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం వరంగల్, కరీంనగర్సహా పలు జిల్లాల ముఖ్య నేతలతో మా ట్లాడినట్టు సమాచారం. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కలిశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ పలువురు పార్టీ నాయకులతో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది? లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో పార్టీ క్యాడర్ స్పందన, అధికార పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆయా జిల్లాల నాయకులు పలు సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా నిర్వహించే సమావేశాల తేదీలు, ఆ స మావేశాలకు పంపించాల్సిన పార్టీ ముఖ్య నేతల జాబితాపై చర్చించినట్టు తెలిసింది.