హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): అదానీకి మేలు చేయటం కోసం తెలంగాణకు కీడు చేస్తారా? అని రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను గృహనిర్బంధాలు, అరెస్టులు చేయటమే ప్రజాపాలనా? అని నిప్పు లు చెరిగారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య తదితరులను ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుం డా అడ్డుకోవడం నియంతృత్వమే అవుతుందని విమర్శించారు.
తమ పార్టీ నేతలతోపాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలను ముందస్తు అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేయడం రేవంత్ సరారు అణచివేత చర్యలకు పరాకాష్ట అని నిప్పులు చెరిగా రు. అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక పర్వాన్ని అడ్డుకొని తీరుతామని స్పష్టంచేశారు. పోలీసుల అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాభిప్రాయసేకరణ నిర్బంధాల మధ్య చేయడం అప్రజాస్వామికమని, ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటూ నిర్బంధపాలన సాగించటం సిగ్గుచేటని మండిపడ్డారు.కాంగ్రెస్ సరారుకు దుమ్ముంటే నిర్బంధాలులేని ప్రజాభిప్రాయసేకరణ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలే మరణశాసనం రాస్తారని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, పర్యావరణవేత్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.