హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): సాములపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్ బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అడిగితే విజిలెన్స్ కేసులు, ప్రతిపక్షంగా తాము నిలదీస్తే బెదిరిస్తున్నారని, కాంగ్రెస్ నడిపేది సర్కారా.. రౌడీ దర్బారా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డికి బెదిరింపులకు బీఆర్ఎస్ ఎప్పటికీ భయపడదని కేటీఆర్ తేల్చిచెప్పారు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్‌రెడ్డి చేస్తున్న భారీ కుంభకోణంపై నగర ప్రజల్లో చైతన్యం కల్పించాలని బీఆర్ఎస్వీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అరాచకాలను అడ్డుకునేందుకు విద్యార్థి విభాగం సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2న ప్రెస్‌క్లబ్‌లో ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేయాలని చెప్పారు.
ఏప్రిల్ 4నుంచి 14వరకు వరకు 50బృందాలుగా ఏర్పడి మూసీ పరీవాహక ప్రాంతాలు, బస్తీలు, గల్లీల్లో పర్యటించి ఇంటింటికీ వెళ్లి మూసీ ప్రక్షాళన వెనుక ఉన్న కాంగ్రెస్ కుట్రను వివరించాలని సూచించారు. కరపత్రాలు, పోస్టర్లు, ప్రత్యేక టీషర్టులతో క్యాంపెయిన్ నిర్వహించాలని, విద్యార్థుల దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చేలా ప్రజల్లో చైతన్యం తేవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రం బీఆర్ఎస్వీ హైదరాబాద్ నగర నేతలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. వేల ఇండ్లు కూలగొట్టిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతావో.. లేక పద్ధతి మార్చుకుంటావో తేల్చుకో రేవంత్‌రెడ్డి అని హితవు పలికారు. ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసింది ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు కోసం మాత్రమేనని, పేదల ఇండ్లు కూల్చితే ఊరుకోవడానికి కాదని స్పష్టంచేశారు.
పిచ్చోడిచేతిలో రాష్ట్రం
‘పిచ్చోడు కనిపిస్తే దూరంగా వెళ్తాం. అతడి చేతిలో రాయి ఉంటే ఇంకా దూరం వెళ్తాం. కానీ, రేవంత్‌రెడ్డి అనే పిచ్చోడి చేతిలో రాయి కాదు.. ఇప్పుడు రాష్ట్రమే ఉన్నది’ అని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తం.. మెగా డీఎస్సీ వేస్తం.. యువతలకు స్కూటీలు ఇస్తం.. విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తం.. ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం మ్యానిఫెస్టో.. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని మండిపడ్డారు. ఒక్క విద్యార్థులను, నిరుద్యోగులనే కాదు రైతు భరోసా, రుణమాఫీ, కౌలు రైతులకు ఏడాది రూ.15 వేలు ఇస్తామని రైతులను సైతం బురిడీ కొట్టించారని విమర్శించారు.
మంత్రులు.. కమల్‌హాసన్‌ను మించిపోయారు
కాంగ్రెస్ మంత్రులు కమలహాసన్ కంటే పెద్ద యాక్టర్లుగా తయారయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో గ్యారెంటీ కార్డులను 100 రోజులు భద్రంగా పెట్టుకోవాలని భట్టి ప్రజలకు సూచించారని గుర్తుచేశారు. 100 రోజులు కాదు 800 రోజులు దాటాయి ఇప్పుడు ఆ కార్డులు ఎక్కడ పెట్టుకోవాలి? అని ప్రశ్నించారు. కోసినా పైసా లేదని అని చెప్పిన రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.. నువ్వేమైన సేపువా? జమకాయవా? పిచ్చిపోయిన పుచ్చకాయవు రేవంత్‌రెడ్డీ?’ అని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్‌పై అసలు ప్రణాళికలు లేకుండా, డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తూ, పెద్దల ఇళ్లను వదిలేస్తున్నారని, ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
హైదరాబాద్‌ను కాపాడుకునే బాధ్యత యువతదే..
హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉన్నదని, మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల జీవితాలను నాశనం చేయడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్లు కూల్చకుండా, భూములు స్వాధీనం చేసుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో మూసీ శుద్ధి చేస్తే బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయని, ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భావోద్వేగ అంశమని గుర్తుచేశారు. ఇచ్చిన హామీల అమలుకు ఒక రూపాయి లేదని చెప్పే సీఎం, తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ప్రకటించడం దారుణమని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16వేల కోట్లతో రూపొందించిన మూసీ సమగ్ర ప్రణాళికను పకన పెట్టి, భారీ అంచనాలతో అవినీతికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీ) నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. అయినా, ప్రస్తుత ప్రభుత్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి బాటలు వేస్తున్నదని విమర్శించారు.
మెస్‌చార్జీలకు డబ్బులుండవు.. మూసీకి మాత్రం ఉంటయా? : సబితాఇంద్రారెడ్డి
ఫీజు రీయింబర్స్‌కు డబ్బులుండవు.. స్కాలర్షిప్, మెస్‌చార్జీలకు డబ్బుల్లేవు.. కానీ, మూసీ సుందరీకరణకు మాత్రం డబ్బులొస్తాయా? అని మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి దఫాలోనే పది వేల ఇండ్లు కూల్చబోతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోతున్నవారికి మనోధైర్యం కల్పించాలని విద్యార్థి విభాగానికి ఆమె పిలుపునిచ్చారు. మూసీ పేరుతో జరిగే అరాచకానికి తాము వ్యతిరేకమని చెప్తున్నా.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. రంగారెడ్డి జిల్లా ప్రజలు తమకు ఉన్నత స్థానాలు కల్పించారని, వారికి అండగా నిలబడటం తమ బాధ్యత అని చెప్పారు. ప్రజలకు అన్యాయం జరిగితే కోర్టుకే కాదు. ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు.
మూసీ సుందరీకరణ పేరుతో లూటీ : గెల్లు శ్రీనివాస్
మూసీ సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. నాడు చంద్రబాబు నందనవనం పేరుతో తలపెట్టిన ప్రాజెక్టును ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి మళ్లీ చేపట్టారని విమర్శించారు. బీఆర్ఎస్వీ విద్యార్థుల సమస్యలే కాదు. ప్రజాసమస్యలపైనా పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తే ఊరుకోబోమని ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టామని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా రేవంత్‌రెడ్డి పనిచేయడం లేదు కానీ, హోం మంత్రి మాత్రం బాగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
యూనివర్సిటీలకు ఫండ్స్, గ్రామాలకు నిధుల్లేవు: గాదరి కిశోర్
రాష్ట్రంలో యూనివర్సిటీలకు ఫండ్స్ రావు, గ్రామాలకు నిధుల్లేవు కానీ, మూసీ సుందరీకరణ పేరుతో భారీ స్కామ్‌కు తెరతీశారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆరోపించారు. రూ.16 వేల కోట్లతో కేసీఆర్ మొదలుపెట్టిన మూసీ అభివృద్ధి ప్రాజెక్టుతో ఏమీ మిగలదని భావించి రూ.1.50 లక్షల కోట్ల ప్రతిపాదనలతో భూదందాకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణతో బ్రాండ్ ఇమేజ్ ఎలా పెంచుతారో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. లక్ష మందిని రోడ్డున పడేసి సుందరీకరణ అంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజాసమస్యలపై గొంతెత్తాలని, అంతా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
జైళ్లకు పోయినా అండగా ఉంటాం:బాల్క సుమన్
‘జ్ఞానం కోసం చదువు.. జనం కోసం పోరాడు’ నినాదంతో బీఆర్ఎస్వీ విద్యార్థులు కదంతొక్కాలని మాజీ ఎంపీ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు పోరాడాలని, కేసులైనా, జైళ్లకు పోయినా పార్టీపరంగా అండగా ఉంటామని చెప్పారు. మూసీలో గాంధీ విగ్రహం పెట్టండి.. కానీ ప్రజలను రోడ్డున పడేయెద్దని సూచించారు. మూసీపై మేధావులు, జర్నలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. టీషర్ట్, పోస్టర్లు, డోర్ స్టిక్కర్లు సిద్ధం చేసి, 10-15 రోజులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో చైతన్యం కల్పించాలని కోరారు. హైడ్రా దుర్మార్గాలను సైతం ఎండగట్టాలని, గల్లీలో చేపట్టి ఆందోళన ఢిల్లీలో మంటలు పుట్టించాలని పిలుపునిచ్చారు.
ప్రజల పక్షాన నిలబడుతం: పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి
మూసీ రివర్‌ఫ్రంట్ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపేందుకు ఏ పోరాటానికైనా సిద్ధమేనిని బీఆర్ఎస్ యువనేత పట్లోళ్ల కార్తీక్రెడి తేల్చిచెప్పారు. ఇండ్లు గుంజుకుంటామంటే తాను కోర్టుకు వెళ్లానని, కోర్టుకే కాదు ఎక్కడికైనా వెళ్లి కొట్లాడుతాని తేల్చిచెప్పారు. బరాబర్ ప్రజల పక్షం నిలబడుతామని స్పష్టంచేశారు. మెట్రో ఇవ్వండి. మూసీ సుందరీకరణ వద్దు అంటూ కార్తీక్‌రెడ్డి నినదించారు. ప్రపంచంలో అన్ని రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు ఫెయిల్ అయ్యాయని విమర్శించారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు
మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3వేల ఎకరాలను సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు మూసీ ఒడ్డున ఉన్న ఇండ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి కాదా? అని ప్రశ్నించారు. మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యలను జాతీయ స్థాయి ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారని, గాంధీ కుటుంబసభ్యులు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారని గుర్తుచేశారు. తాను చేస్తున్న అవినీతి ప్రశ్నిస్తే శివతాండవం చేస్తా అంటూ సీఎం మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తన అధికార అహంకారాన్ని తగ్గించుకొని, మూసీ ప్రాజెక్ట్‌ను ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమలు చేయాలని, లేదంటే లక్షలాది ఇళ్లను కూల్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టే పోరాటానికి పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ‘హైదరాబాద్ మీది… భవిష్యత్తు మీది. రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్టు చేస్తనంటే ఊరుకుందామా? విద్యార్థుల సత్తా ఏమిటో కాంగ్రెస్ సర్కారుకు చూపించాలి. ప్రభుత్వం వణకాలి. బీఆర్ఎస్వీ చైతన్య కార్యక్రమాలతో ప్రభుత్వ దెబ్బకు దిగిరావాలి’ అని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నాయకులు కిశోర్‌గౌడ్, చిరుమళ్ల రాకేశ్, శుభప్రద్‌పటేల్, బమ్మెర రామ్మూర్తి, పడాల సతీశ్, తుంగ బాలు, కడారి స్వామియాదవ్, శంభీపూర్ కృష్ణ పాల్గొన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరెప్షన్ : ఎర్రోళ్ల శ్రీనివాస్
త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ నడుస్తున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఈ రెండున్నరేండ్లలో కాంగ్రెస్ గర్వంగా చెప్పుకొనేలా ఒక్కటీ లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఏడాదిన్నరలోనే ఇంటింటికీ తాగునీరు.. 24గంటలకు నాణ్యమైన విద్యుత్తునిచ్చిందని గుర్తుచేశారు. వారి ధ్యాసంతా సంపాదన, కమీషన్ల మీదేనని ఆరోపించారు. మొత్తంగా అన్ని వర్గాలను మోసం చేశారని. నాడైనా, నేడైనా ప్రజల కోసం పోరాడింది బీఆర్ఎస్.. బీఆర్ఎస్వీ.. మాత్రమేనన్నారు. రేవంత్‌రెడ్డి ధ్యాసంతా భూమి చుట్టే తిరుగుతున్నదని ఆరోపించారు. హైదరాబాద్‌ను విధ్వంసం చేస్తామంటే ఊరుకోబోమని, హైదరాబాద్ బస్తీవాసులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు.
హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదే. మూసీ ప్రక్షాళన ముసుగులో రేవంత్‌రెడ్డి చేస్తున్న లక్షన్నర కోట్ల స్కామ్‌పై ప్రజల్లో చైతన్యం తేవాలి. మూసీ పరీవాహక ప్రాంతాలు, బస్తీల్లో బీఆర్ఎస్వీ నేతలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ కుట్రను వివరించాలి. కరపత్రాలు, పోస్టర్లు, టీ షర్టులతో క్యాంపెయిన్ చేయాలి. విద్యార్థుల దెబ్బకు ప్రభుత్వం దిగిరావాలి.
– కేటీఆర్