KTR | హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం విద్యార్థులు కొట్లాడుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి నాలుగుకోట్ల మందికి ప్రతినిధివనే ఇంగితం నీకుందా? సిగ్గు అనిపిస్తలేదా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ఇంత దిగజారాలా? ఇంత తప్పుడు పనులు చేయాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రోజుకు సీఎం 18గంటలు పని చేస్తానని చెప్పుకుంటడు ముఖ్యమంత్రి. కనీసం రోజుకు పది నిమిషాలు మనిషిలా పని చేయ్. రియల్ ఎస్టేట్ బ్రోకర్లా 18 గంటలు కాదు.. 20 గంటలు పని చేయొచ్చు. పది నిమిషాలు ఓ మనిషిలా, తండ్రిలా, ఓ తాతలా భవిష్యత్ తరాలపై సోయితో పని చేయాలని ముఖ్యమంత్రికి చెబుతున్నా. నేను అడుగుతున్నా.. ప్రభుత్వ భూమి అని పెద్దలు చెబుతున్నరు. మరి దొంగల్లా ఎందుకుపోతున్నరు ?’అంటూ ప్రశ్నించారు.
‘ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి దొంగల్లా వెళ్లి.. దొడ్డిదారిన జేసీబీలు పెట్టి.. పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా.. దొడ్డిదారిన ఈ ప్రయోగాలు చేస్తున్నరు. మీరే కదా కోర్టుకు చెప్పారు. మార్చి 27-28 పిల్‌ను వాటా ఫాండేషన్ ఫైల్ చేస్తే.. మీరే పది రోజులు సమయం ఇవ్వండి మా జవాబు చెబుతాం.. కౌంటర్ ఫైల్ చేస్తాం అన్నారు. మరి ఏం పడిపోయిందని ఇవాళ బుల్డోజర్లు.. అర్ధరాత్రి.. అపరాత్రి అని లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి.. అక్కడున్న జంతువులను చంపి.. పక్షుల గూడ్లు చెదిరేలా చేసి.. పదిరోజుల్లో దొంగల్లా ఎందుకు వ్యవహారం చేస్తున్నరు. ప్రభుత్వ భూమి అన్నది నిజమే అయితే.. ఎందుకు ఈ దొంగ వ్యవహారం. పగటిపూట ఎందుకు పోవడం లేదు. ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నరు. కోర్టు సెలవులు చూసుకొని శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ చూసుకొని వందలాది వాహనాలను పంపి.. బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యంలో నీతివంతమైన పరిపాలన అందించేవారు.. ప్రజాపాలన అని చెప్పుకునే వారు చేయాల్సిన పనేనా?’ ధ్వజమెత్తారు.
‘దొంగదారిన పోవడమే కాకుండా.. పలికిన మాటలు మాట్లాడుతున్నరు. గుంటనక్కలు అని మాట్లాడుతున్నరు. ఇవాళ పిల్లలు చెబుతున్నరు మేం నక్కలమే.. నీలాగా పందికొక్కుము కాదని చెబుతున్నరు. ముఖ్యమంత్రికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పలిచి మాట్లాడొచ్చు కదా? హైకోర్టు ఎన్నిసార్లు తిట్టింది? హైడ్రాతో శనివారం, ఆదివారాలు పని చేస్తూ కోర్టు సెలవు దినాల్లో పేదల ఇండ్లను కూలగొడుతున్నరు.. ఇంకోసారి పిచ్చిపిచ్చి చేస్తే.. హైడ్రాని రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించలేదా? అయినా బుద్ధి రాదా? బుల్డోజర్లు శనివారాలు, ఆదివారాలు ప్రజలపైకి ఎందుకుపోతున్నయ్? ఎన్నిసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధిరాదా? నీ ప్రభుత్వానికి ఇంగితం రాదా? అక్కడ పులులు లేవు.. జింకలు లేవని పంచ్ డైలాగులు చెప్పడేం ఏమున్నది. అక్కడ ఏం ఉన్నదో కనీసం పోయి చూసినవా? ’ అంటూ ప్రశ్నించారు.
‘ఈ రోజు పిల్లలు చెబుతున్నరు.. ఫుట్‌బాల్ ఆడేందుకు వచ్చిండు.. భూములపై కన్నేసి ఈ రోజు మమ్మల్ని ఫుట్‌బాల్ ఆడుతూ.. భూములు గుంజుకుంటున్నడని చెబుతున్నరు. ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం.. ఆడపిల్లల బట్టలు చింపడం.. న్యాయం కోసం ఆరాటపడుతున్నరు. ప్రజల కోసం, హైదరాబాద్ భవిష్యత్ కోసం పోరాడుతున్నరు. చదువుకునే పిల్లల్లో 70-75శాతం మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్లు కాదు. నాలుగైదేళ్లు చదువుకొని పీహెచ్డీ చేసుకొని వెళ్లిపోతారు. వాళ్లకు హైదరాబాద్‌పై ఉన్న ప్రేమలో నీకు అరపైసా అన్న ఉన్నదా? హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్లు కొట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి, నాలుగుకోట్ల మందికి ప్రతినిధివనే ఇంగితం నీకుందా? సిగ్గు అనిపిస్తలేదా? కనీసం. డబ్బుల కోసం ఇంత దిగజారాలా? ఇంత తప్పుడు పనులు చేయాలా?’ అని నిలదీశారు.