ముస్లింల కబ్రస్థాన్‌కు జాగ లేదట. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి భూమి లేదట. కానీ, భూదందాలు చేయడానికి మాత్రం 9292 ఎకరాలు ఉన్నయా? అందులో 7వేల ఎకరాలు స్వాధీనం చేసుకుని దందాల కోసం కాకుండా ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం వెచ్చించాలి! లేదంటే వేలం వేసి, వచ్చిన ఆదాయాన్ని ప్రజాసంక్షేమానికి వినియోగించాలి! అంతేకానీ కొందరికి అప్పనంగా దోచిపెడుతా, రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటా అంటే మాత్రం చూస్తూ ఊరుకోం! – కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రూ.5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ’ (HILTP) అనేది ఒక పాలసీ కాదని, రూ.లక్షల కోట్ల భూ కుంభకోణం కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
తన సన్నిహిత రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, తన అనుకూల రియల్ ఎస్టేట్ గ్రూపులకు అత్యంత విలువైన 9,292 ఎకరాల ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించేందుకు ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. హెచ్ఐఎల్టీపీ పాలసీ ఆమోదం పొందడానికి ముందే భూముల డీల్స్ కుదిరాయని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అవినీతికి సంబంధించిన 9 వేల ఎకరాల భూ స్కాంలో పారిశ్రామికవేత్తలు పాలుపంచుకుంటే తమ ప్రభుత్వం వచ్చాక, కేటాయింపులను రద్దు చేస్తామని హెచ్చరించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్‌రెడ్డి తలపెట్టిన ఈ కుంభకోణం విషయంలో బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. పాలసీ రద్దు కోసం తాము ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని చెప్పారు. గతంలో హెచ్‌సీయూ భూములను అమ్మాలని చూస్తే విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.
9,292 ఎకరాలు కాజేసేందుకు కుట్ర
రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా రేవంత్‌రెడ్డి ముఠా గద్దల్లా వాలిపోతున్నదని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు ఎంతో విలువైన ప్రభుత్వ భూములపై రేవంత్ కుటుంబసభ్యుల కన్నుపడిందని తెలిపారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్‌తో సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల భూమిని హెచ్ఐఎల్టీపీ పేరిట తమ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ భూముల మారెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ.40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉన్నదని, వీటి మొత్తం విలువ రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. కానీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (ఎస్ఆర్వో) నిర్ధారించే ప్రభుత్వ విలువలో కేవలం 30% నగదుకే అప్పగించాలని చూస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన మనసు ఎప్పుడూ భూముల చూట్టూనే తిరుగుతుందని ఎద్దేవా చేశారు. మంచిరేవుల భూమిపై రేవంత్‌రెడ్డి అన్న కన్నుపడిందని, అందుకే భూమి కేటాయింపులు ఆగిపోయాయని, మంత్రి కొండా సురేఖ కూతురు మీడియా ముఖంగా ఈ ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.
కేసీఆర్ సర్కారు తెచ్చిన చట్టం బుట్టదాఖలు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్వో రేట్ల కంటే 100% నుంచి 200% అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రభుత్వ భూమిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించినప్పుడు ఎస్ఆర్వో రేట్ల కంటే 100% అధికంగా చెల్లించాలని నాడు తాము ఆ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. ఒక పరిశ్రమకు కేటాయించిన భూమిని సదరు వ్యక్తి మరొకరికి బదలాయిస్తే ఎస్ఆర్వో రేట్ల 200% అధికంగా చెల్లించాలని చట్టం చేశామని వివరించారు. ఆ చట్టం ప్రతిని ఈ సందర్భంగా కేటీఆర్ మీడియా ఎదుట ప్రదర్శించారు. కానీ, కాంగ్రెస్ సర్కారు ఎస్ఆర్వో రేటులో కేవలం 30% చెల్లించాలని భూ కేటాయింపులు చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి? ఇంతలా తగ్గించారని ప్రశ్నించారు. ఎస్ఆర్వో విలువ కంటే భూముల మారెట్ ధరలు నాలుగైదు రెట్లు ఎకువగా ఉన్నాయని చెప్పారు. ఎస్ఆర్వో విలువలో 30% నగదు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుండగా, మిగతా రూ.లక్షలాది కోట్లు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయని ఆరోపించారు.
ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసమే
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా సుమారు పదేండ్లు పనిచేసినందున పరిశ్రమలకు భూముల కేటాయింపులపై తనకు సంపూర్ణ అవగాహన ఉన్నదని కేటీఆర్ గుర్తుచేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీతో భూములు కేటాయిస్తుంటాయని చెప్పారు. ‘ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వాలు రాయితీ ధరలకే పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయిస్తాయి. కానీ, ఇప్పుడు అవే భూములను ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం క్రమబద్ధీకరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తకువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం నన్ను సంప్రదించారు. కానీ, మేము ఆ ప్రతిపాదనలను తిరసరించాం. ప్రభుత్వ భూమిని ప్రైవేటు ప్రయోజనాల కోసం కేటాయించలేమని స్పష్టంగా చెప్పాం. కానీ, మేము ఆపిన పనినే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారు. ప్రజల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం భూములను సేకరించి, ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల కోసం రెగ్యులరైజ్ చేస్తామంటే కుదరదు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
పాలసీ ఆమోదం.. అనుమానాస్పదం
హెచ్ఐఎల్టీపీ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం అత్యంత అనుమానాస్పదంగా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. పరిశ్రమకు భూమి కేటాయించాలని 7 రోజుల్లో దరఖాస్తులు రావడం, 7 రోజుల్లో ఆమోదాలు పొందడం, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పడంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. రూ.లక్షలాది కోట్ల విలువైన భూముల అంశంలో ఎందుకీ తొందర? ఎందుకీ వేగవంతమైన ప్రక్రియ? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సోదరులు, అనుచరులు, మధ్యవర్తులు ఇప్పటికే ఆయా భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. పాలసీ ఆమోదం పొందడానికి ముందే డీల్స్ కుదిరాయని తెలిపారు. హెచ్ఐఎల్టీపీ పాలసీని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చుకున్నదని మండిపడ్డారు. దీని వెనుక అసలు ఉద్దేశం పట్టణాభివృద్ధి కాదని, ఎంపిక చేసిన కొద్దిమందిని పెద్ద ఎత్తున ధనవంతులుగా మార్చడమేనని ఆరోపించారు.
ఎవరినీ వదిలిపెట్టం
హెచ్ఐఎల్టీపీ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చికులను ఎదురొంటారని కేటీఆర్ హెచ్చరించారు. ‘ఈ లావాదేవీలు నిలబడవు. ఆ భూమిని తిరిగి తీసుకుంటాం. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమబద్ధీకరణను రద్దుచేసి, తగిన చర్యలు ప్రారంభిస్తాం. మేము పూర్తిస్థాయి విచారణ జరుపుతాం. ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఒకరిపై చర్యలు తీసుకుంటాం. ఈ సామ్లో పాల్గొనే ఎవరినీ వదిలిపెట్టం’ అని హెచ్చరించారు. పెద్దలకు మాత్రమే లబ్ధి చేకూర్చే హెచ్ఐఎల్టీపీ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘దీనిపై బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హెచ్ఐఎల్టీపీ పాలసీని వ్యతిరేకించాలి. మౌనంగా ఉంటే కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని అర్థం’ అని అన్నారు.
కాంగ్రెస్‌కు ఆర్ఆర్ ట్యాక్స్, తెలంగాణ ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ అంటున్నారని, కానీ, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కారు అని పునరుద్ఘాటించారు. ఈ భారీ భూకుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందించకపోతే యాక్షన్‌ప్లాన్ రెడీ చేస్తామని చెప్పారు. పాలసీ రద్దు కోసం బీఆర్ఎస్ లీగల్ టీమ్‌తో చర్చించి న్యాయస్థానాల్లో కొట్లాడుతామని చెప్పారు. అలాగే అసెంబ్లీలోనూ ఈ భూ కేటాయింపులపై సర్కారును నిలదీస్తామని చెప్పారు. హెచ్‌సీయూ భూముల విషయంలో విద్యార్థులతో కలిసి కొట్లాడి అడ్డుకున్నట్టుగా, ఈ పాలసీ విషయంలో కూడా ప్రజలతో కలిసి కొట్లాడి భూదోపిడీని అడ్డుకుంటామని కేటీఆర్ స్పష్టంచేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
9,292 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆ భూములను పేదలకు ఉపయోగడేలా తీర్చిద్దాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘పార్కులు, దవాఖానలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఆ భూములను వినియోగించాలి. లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలి. తద్వారా వచ్చిన మొత్తాన్ని సంక్షేమ పథకాలకు వాడాలి’ అని సూచించారు. మొన్న అమృత్ టెండర్లు, నిన్న టీడీఆర్, ఇవాళ రూ.5 లక్షల భూ కుంభకోణం.. ఇలా ప్రజల సొమ్మును దోచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించడం అభివృద్ధి కాదని, పగటిపూట దోపిడీ అని మండిపడ్డారు. ఇలా డబ్బులు దోచుకొని, దాచుకొని ఓట్లు కొని తిరిగి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, పార్టీ నేత మన్నె క్రిశాంక్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం జేబులోకి రూ.50 వేల కోట్లు
ఇందిరమ్మ ఇండ్ల్లు, శ్మశానవాటికలకు కూడా స్థలం లేని హైదరాబాద్‌లో, ప్రజల ఆస్తులను రేవంత్ సర్కారు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. పేదల భూములను పెద్దలకు ప్రభుత్వం సంతర్పణ చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ‘కనీసం, ప్రభుత్వం 50 శాతం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, మిగతా 50 శాతం భూమిని క్రమబద్ధీకరించాలి. కానీ, కాంగ్రెస్ సర్కారు 100% భూమిని ఎస్ఆర్వో ధరలకు క్రమబద్ధీకరించాలని చూస్తున్నది. ఇది ఆమోదయోగ్యం కాదు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి భూములను వేలం వేసి ప్రభుత్వం ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే, ఇకడ మాత్రం రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా సంపూర్ణంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కనీసం రూ.50 వేల కోట్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత జేబులో వేసుకోవాలని చూస్తున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్లా రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘ముందు మూసీ నదీ తీరంలోని భూములు. తర్వాత మెట్రో రైలు భూములు. ఆ తర్వాత లగచర్ల గిరిజనుల భూములు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు. ఇప్పుడు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములు. రేవంత్ దృష్టి కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే అని నిరూపించుకుంటున్నారు. ఆయన చుట్టూ భూ డీలర్లు ఉన్నారు. ఆయన సోదరులు, సన్నిహితులు ఇప్పటికే ఆ భూముల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. ఏవీ రెడ్డి, తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి సీఎం బిజినెస్ భాగస్వాములు. అందుకే రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను పారిశ్రామికీకరణ పేరుతో సొంతవారికి అప్పనంగా అందించాలని చూస్తున్నారు. అందుకే పాలసీ అమలుకు తొందర పెడుతున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్వో రేట్ల కంటే 100-200% అధికంగా చెల్లించాలని ఒక చట్టం చేశాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్వో రేటులో కేవలం 30% చెల్లిస్తే చాలు భూ కేటాయింపులు చేయాలని చూస్తున్నది. ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి? ఇంతలా తగ్గించారు?
– కేటీఆర్
ముందు మూసీ నదీ తీరంలోని భూములు. తర్వాత మెట్రో రైలు భూములు. ఆ తర్వాత లగచర్ల గిరిజనుల భూములు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు. ఇప్పుడు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములు.. రేవంత్‌రెడ్డి దృష్టి కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే అని నిరూపించుకుంటున్నారు.
– కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో అనేక మంది భూయజమానులు, బ్రోకర్లు అత్యంత తకువ ధరలకు క్రమబద్ధీకరణ కోసం నన్ను సంప్రదించారు. ఆ ప్రతిపాదనలను మేము తిరసరించాం. ప్రజల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం సేకరించిన భూములను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామంటే కుదరదు.
– కేటీఆర్
హెచ్ఐఎల్టీపీ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చికులను ఎదురొంటారు. ఈ లావాదేవీలు నిలబడవు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని తిరిగి తీసుకుంటాం. పూర్తిస్థాయి విచారణ జరుపుతాం. ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఒకరిపై చర్యలు తీసుకుంటాం.
– కేటీఆర్