జూబ్లీహిల్స్‌లో ఒక్కో వ్యక్తికి రెండు, మూడు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నయి. ఒకే అడ్రస్‌తో ఒక్కొక్కరు మూడు, నాలుగు పేర్లు నమోదు చేయించుకున్నరు. ఒకే వ్యక్తికి అక్షరాలను మార్చి అనేకసార్లు ఓటర్లుగా నమోదు చేయించిండ్రు. ఈ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవే..
-కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ 400 పోలింగ్ బూత్‌లలో దొంగ ఓట్లు నమోదు చేయించిందని, తమ పార్టీ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఇప్పటిదాకా 20వేల దొంగ ఓట్లు ఉన్నట్టు బయటపడిందని చెప్పారు. ఇంకా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ బీఆర్కే భవన్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో సీఈవోకు వినతిపత్రం అందజేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి దొంగ ఓట్లను తొలగించిన తర్వాతే ఎన్నికలు జరపాలని కోరారు.
అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి సీఈవో కార్యాలయం వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ ఓటు చోరీ అంటుంటే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నదని నిప్పులు చెరిగారు.. 3-4 నెలల క్రితం నుంచే దొంగ ఓట్ల నమోదుకు కాంగ్రెస్ నేతలు కుట్ర చేశారని మండిపడ్డారు. నిధులు లేవని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ బ్యాంకుకు, వార్తా పత్రికలకు లేఖలు రాస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో మాత్రం భారీగా నిధులు ఉన్నాయని, అభివృద్ధి చేస్తున్నామని రేవంత్ సర్కారు మరోసారి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. అధికార దుర్వినియోగంతోపాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేస్తున్న దొంగ ఓట్ల ప్రయత్నంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఆధారాలతోసహా వినతిపత్రం అందజేసినట్టు వివరించారు.
ఒక్కో వ్యక్తికి 3 ఓట్లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొందరికి మూడు ఓట్లు, మరికొందరికి రెండు ఓట్లు చొప్పున ఒక్కో బూత్‌లో 40-50 వరకు దొంగ ఓట్లు నమోదు చేశారని కేటీఆర్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియా ఎదుట ప్రదర్శించారు. జీ కార్తీక్ అనే వ్యక్తికి మూడు ఓట్లు, మూడు ఎన్నికల గుర్తింపు కార్డులు ఉన్నాయని చెప్పారు. ఫొటో ఆధారాలను మీడియాకు చూపించారు. దీపక్‌శర్మ, శ్రీనాథు సత్యలత, మాధురి ఇలా అనేక మందికి రెండు మూడు ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఒకే అడ్రస్‌తో ఒక్కొక్కరు మూడు ఓట్లు, నాలుగు ఓట్లు నమోదు చేయించుకున్నారని, ఒక్కో వ్యక్తికి రెండు, మూడు ఓటర్ ఐడీకార్డులు ఉన్నాయని వివరించారు. ఒకటే వ్యక్తికి చిన్నచిన్న అక్షరాలను మార్చి అనేకసార్లు ఓట్లు నమోదు చేయించారని చెప్పారు. దీనిపై వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవేనని స్పష్టంచేశారు. ఇప్పటివరకు తమ పార్టీ పరిశీలనలో 20వేల దొంగ ఓట్లు ఉన్నట్టు బయటపడిందని, ఇంకా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ నిగ్గు తేల్చాలని కోరారు.
ఒక్కో ఇంట్లో 150-200 ఓట్లు
జూబ్లీహిల్స్‌లోని కొన్ని చోట్ల ఒక్కో ఇంట్లో 150 నుంచి 200 వరకు ఓట్లు నమోదు చేయించారని కేటీఆర్ విమర్శించారు. ఆయా ఇండ్లపై తమ పార్టీ నేతలు పరిశీలన చేస్తే చిన్న ఇంట్లో 100కు పైగా ఓట్లు నమోదై ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు. 15 వేల ఓట్లు కేవలం ఇలా చిరునామాలు లేకున్నా నమోదు చేశారని విమర్శించారు. ఓటరు లిస్టు ప్రకారం 23 ఓట్లు ఉన్న ఇంటి యజమానిని ఆరా తీయగా, వారిలో ఒక్కరు కూడా తమ వాళ్లు లేరని చెప్పారని, అసలు ఈ ఓట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారని వెల్లడించారు. అసలు ఆలాంటి వ్యక్తులకు కిరాయి ఇవ్వకముందే ఇలాంటి పేర్లు ఎట్లా రాశారని వాపోయినట్టు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓట్లు ఉన్నవాళ్లకు నగరంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా ఓట్లు ఉన్నాయని వివరించారు. ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న వాళ్లందరితో అక్కడ ఓట్లు డిలీట్ చేయకుండా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు ఓట్లు నమోదు చేయించారని, వివిధ కారణాలతో వేలాది దొంగ ఓట్లు డూప్లికేట్ ఓట్లు రాయించారని విమర్శించారు.
దొంగ ఓట్లను తొలగించాలి
కాంగ్రెస్ నేతలు నమోదు చేయించిన దొంగ ఓట్ల విషయంలో సరైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి విజ్ఞప్తి చేసినట్టు కేటీఆర్ చెప్పారు. వారి ముందు స్పష్టంగా 3 డిమాండ్లు ఉంచామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ‘మా అనుమానం ప్రకారం సుమారు 20 వేల దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నాయని సీఈవోకు వివరించినం. దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నంలో భాగంగా కిందిస్థాయి అధికారులతో కాంగ్రెస్ దొంగ ఓట్లు చేర్చినట్టు మాకు అనుమానం ఉన్నది. ఈ అవకతవకలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసినం. క్షేత్రస్థాయిలో కుమ్మక్కైన బూత్ లెవల్, రెవెన్యూ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి. వారిని వెంటనే బదిలీ చేయాలని కోరినం. 12వేల ఓట్లను వివిధ కారణాలతో తొలగించాక అదనంగా 7,000 ఓట్లు కొత్తగా చేరాయి.
డిలీట్ చేసినవి కొత్తగా చేరినవి సుమారు 19 వేల కొత్త ఓట్లను కాంగ్రెస్ దొంగతనంగా చేర్చింది. దొంగ ఓట్లు తొలగించాక ఎన్నికలకు వెళ్లాలని కోరినం’ అని కేటీఆర్ వివరించారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి తగిన సమాధానం ఇస్తామని సీఈవో చెప్పారని వెల్లడించారని, తమకు న్యాయం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామ ని స్పష్టంచేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, మన్నె క్రిశాంక్, వై సతీశ్‌రెడ్డి, పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణలోనూ ఓటు చోరీ ఇటు చూడండి రాహుల్ జీ ఎక్స్ వేదికగా కేటీఆర్ హితవు
తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీకి ప్రయత్నిస్తున్నదని, ఇటు వైపు కూడా చూడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హితవుపలికారు. దేశమంతా ఓటు చోరీగురించి మాట్లాడటం కాదు.. తెలంగాణలో జరుగుతున్న సంగతిని పట్టించుకోవాలని సోమవారం ఎక్స్ వేదికగా సూచించారు. ఒకే అడ్రస్‌తో 30కి పైగా ఓటర్లు నమోదయ్యారని, ఇలా 300 అడ్రస్‌లలో 12 వేలకు పైగా ఓటర్లు ఉండటం అసహజంగా కనిపిస్తలేదా? రాహుల్ జీ అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు ఇలా..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలగైనా గెలవాలని కాంగ్రెస్ అడ్డగోలుదారుల్లో ప్రయత్నాలు చేస్తున్నది. జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ ఓటు చోరీ అంటుంటే దొంగ ఓట్లతో ఇకడ గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసం ఒక్కో బూత్‌లో 50 దొంగ ఓట్ల చొప్పున 400 బూత్‌లలో కాంగ్రెస్ 20 వేల దొంగ ఓట్లు నమోదు చేయించింది. 3-4 నెలల నుంచే దొంగ ఓట్ల నమోదుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేసిండ్రు. -కేటీఆర్