KTR | ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ వెనుక కాంగ్రెస్ వాళ్లే ఉన్నారని తమకు అనుమానాలున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎరువుల కొరత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతో జరుగుతుందో.. దాని వెనుక కాంగ్రెస్ వాళ్లే ఉన్నరనేది అనుమానం. ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చి.. వాటి నుంచి ముడుపులు దొబ్బాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో రేవంత్‌రెడ్డి అనుచరులు.. కాంగ్రెస్ నాయకులు, వారు బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాముల్లో దాస్తున్నారా? కృత్రిమ కొరత సృష్టించి.. రేటు పెంచి రైతును ఆగం చేసి వారి వద్ద ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారా? రైతులు ఆలోచించాలి. ముఖ్యమంత్రి కొరత లేదని అంటున్నడు. కృత్రిమ అని చెబుతున్నడు. కాంగ్రెస్ ఎంపీలు మాత్రం అక్కడ బీజేపీ ఇవ్వడం లేదని ధర్నాలు చేస్తున్నరు. ఇందులో ఎవరిది డ్రామా? సీఎం రేవంత్‌ది డ్రామానా? కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నది డ్రామా? అనేది రైతులు ఆలోచించాలని కోరుతున్నా’ అని పిలుపునిచ్చారు.
‘51సార్లు రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. ఈయన మొఖం చూసి 51 బస్తాల ఎరువులు కూడా కేంద్రం మంజూరు చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో, గ్రామాల్లో పుట్టిన రోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే.. ఇంతకు మించిన సిగ్గుచేటు ఏ ప్రభుత్వానికి ఉండదు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఎన్నికల ముందు వస్తరు. డిక్లరేషన్ అని చెబుతరు. వరంగల్‌లో పెద్దపెద్ద మాటలు అని రాహుల్ గాంధీ చెప్పిండు. రైతులకు బోనస్ ఇస్తం, రూ.15వేల రైతుబంధు ఇస్తం, రైతులకు రూ.12వేలు ఇస్తమని చెప్పిన రాహుల్ గాంధీ.. పార్లమెంట్లో ఇవాళ ఎందుకు నోరు తెర్వడం లేదు. ఒక్కటంటే ఒక్క రోజు రాహుల్ గాంధీ ఎరువుల కొరతపై మాట్లాడారా? ఒక్క మాట మాట్లాడకపోతే ప్రతిపక్ష నాయకుడు, ఎనిమిది మంది ఎంపీలు ఎందుకు ఉన్నరని రైతులు అడుగుతున్నరు. పదేళ్లలో రాని సమస్య.. కొరత ఇవాళ ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం’ అన్నారు.
‘ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయరంగంలో ఉన్న పరిస్థితులను దాచి.. కావాలని పంటలను ఎండబెట్టేవిధంగా.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా.. కిందికి నీళ్లుపోతుంటే.. శ్రీశైలం నుంచి పాలమూరులో చెరువులు నీరు నింపేందుకు మోటార్లు ఆన్ చేయకుండా.. రాష్ట్రంలో ఎక్కడా ఎరువులను నింపకుండా కిందకు నీటిని పంపే పరిస్థితి ఉన్నదో రాష్ట్ర రైతాంగం మొత్తం చూస్తున్నది. వాస్తవాలను మాట్లాడుకుంటే.. కొన్ని బాకా పత్రికలు, డబ్బా కొట్టే పత్రికలు, కొన్ని బాకా చానళ్లు ఆయనకు భజన చేయొచ్చు గానీ.. రుణమాఫీలో, రైతుబంధు, ఉచిత కరెంటు, రైతుబీమాలో ఫెయిల్ అయ్యిందని రైతులు అంటున్నరు. రైతుల ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం విఫలమైంది. సాగునీరందించడంలో, పంటల కొనుగోలు, బోనస్ ఇవ్వడంలో, విత్తనాల సరఫరాలో.. ఈ రోజు ఎరువుల సరఫరాలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీని వల్ల నష్టపోతున్నది 70లక్షల మంది రైతులు. వారి తరఫున కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నం. తప్పకుండా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోరాటంలో ముందుంటాం. వెంటనే పోరాట కార్యాచరణ ప్రకటిస్తాం’ అని వెల్లడించారు.