కరువు తెచ్చి.. వరి వద్దంటరా?
గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా రాష్ట్రంపైకి కరువును తెచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వరి వేయవద్దంటూ రైతులకు సుద్దులు చెప్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని, అన్ని వర్గాలనూ మోసం చేసిండని దుయ్యబట్టారు.
- గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయరు
- కృష్ణకు వదిలి కరువు అంటున్నరు
- రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది
- ఈ ప్రభుత్వం ఏ వర్గానికీ న్యాయం చేయలే
- ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి మద్దతు
- ఏడాది ఓపిక పడితే.. మళ్లీ వచ్చేది కేసీఆరే
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా రాష్ట్రంపైకి కరువును తెచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వరి వేయవద్దంటూ రైతులకు సుద్దులు చెప్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని, అన్ని వర్గాలనూ మోసం చేసిండని దుయ్యబట్టారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం అసెంబ్లీలో నిలదీస్తామని భరోసా ఇచ్చారు. సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ సోమవారం పర్యటించారు. మొదట గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. తర్వాత సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్లో అంబా భవానీ మండపంలో పూజలు చేశారు. అనంతరం సిరిసిల్లలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో రూ.30 లక్షల విలువైన అత్యవసర వైద్య సేవల పరికరాలను ప్రారంభించారు.
అనంతరం తెలంగాణ భవన్లో కుమ్రం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను ఎన్హెచ్ఎం ఉద్యోగులు కలిశారు. తాము 14 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇది మూర్ఖపు ప్రభుత్వమని, మీకిచ్చిన హామీలు అమలు చేస్తాడని నమ్మకం లేదన్నారు. మరో ఏడాదిన్నర ఓపిక పడితే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కోరారు.
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఉద్యోగులకు ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని, మూడేండ్లలో ఏడు డీఏలు బాకీ ఉన్నాడని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీలు అందించారని గుర్తుచేశారు.
ప్రస్తుతం గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందికి కృష్ణకు గోదావరి నీళ్లు వదిలిపెట్టి ఇప్పుడు కరువు అంటూ కథలు చెప్తున్నాడని విమర్శించారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ కట్టిందే నీళ్ల కోసమని, దానిని మూడేండ్లుగా బదనాం చేసి నీళ్లు ఎత్తిపోయడం లేదని అన్నారు. రాబోయే ప్రభుత్వం అన్ని వర్గాలకు, ఉద్యోగులకు కావాల్సిన అవసరాలను అడగకుండా తెలుసుకొని అమలు చేస్తుందని చెప్పారు. ఒక్క సంవత్సరం ఓపిక పట్టాలని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.
ఇది మూర్ఖపు ప్రభుత్వం
ప్రస్తుతం రాష్ట్రంలో కరువు ఉన్నదని ముఖ్యమంత్రే చెప్తున్నారని, మళ్లీ మూసీ సుందరీకరణ అంటూ సోకులు పడడానికి వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలుస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. గతంలో రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి పేదలు, చిరుద్యోగులు, వాళ్లకు ఇచ్చిన హామీలపై పట్టింపు, సోయి లేదని అన్నారు.
సిరిసిల్ల దవాఖానకు 30 లక్షల వైద్య పరికరాలు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు కేటీఆర్ చొరవతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా దాదాపు రూ.30 లక్షల విలువైన వైద్య పరికరాలు సమకూర్చగా.. సోమవారం వాటిని ఆయన ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఎగదండి మేఘనకు మెరుగైన వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మేఘన ఆహారం కూడా తీసుకోలేని స్థితికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన గుగులోత్ జశ్వంత్‌కు కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ల్యాప్‌టాప్‌ను అందజేశారు.

Ktr
సీఎం.. సీఎం అంటూ నినాదాలు
కేటీఆర్ పర్యటనలో అభిమానులు ‘సీఎం.. సీఎం’ అనే నినాదాలతో హోరెత్తించారు. సోమవారం ఆయన సిరిసిల్లలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో అక్కడున్న వారంతా ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎదురుపడగా.. కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం.. సీఎం నినా దాలు మరింతగా మార్మోగాయి. గంభీరావుపేట మండలం లింగన్నపేట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లోనూ కేటీఆర్ పాల్గొనగా.. ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. – రాజన్న సిరిసిల్ల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

