అనర్హులకు అందలం
కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనర్హులకు కట్టబెడుతున్నది.
- మూసీ బాధిత బస్తీవాసులకు సర్కార్ మొండిచేయి
- ఎమ్మెల్యే అనుచరులకే డబుల్ బెడ్రూం గృహాలు
- కొందరికి రెండు మూడు సార్లు ఇండ్లు మంజూరు
- అర్హత ఉన్న వారిని తిప్పించుకుంటున్న అధికారులు
సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనర్హులకు కట్టబెడుతున్నది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట పరీవాహక ప్రాంతాల్లోని బస్తీలను ఖాళీ చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రకటించి బస్తీలను ఖాళీ చేయించి రెండేండ్లు అవుతున్నా ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
అందులో భాగంగానే మలక్‌పేట నియోజకవర్గం పరిధిలోని అంబేద్కర్‌నగర్, శాలివాహనగర్ బస్తీ వాసులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండు బస్తీల్లో ఉన్న సుమారు 60 కుటుంబాలు మాత్రం నెలల తరబడిగా డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. మరికొంత మందికి మాత్రం రెండు మూడు ఇండ్లు ఇస్తుండటం విస్తుగొలిపిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకొనే ఆ రెండు బస్తీల్లోని కొద్ది మందికి మాత్రం దరఖాస్తు చేసుకోగానే ఏమీ చూడకుండా మంజూరు చేస్తున్నారని అర్హులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అసలైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగని ఎమ్మెల్యే అనుచరుల దందా..

అంబేద్కర్‌నగర్, శాలివాహన నగర్‌లోని కొద్దిమంది ఎమ్మెల్యే అండదండలతో డబుల్ బెడ్రూం ఇండ్ల దందా కొసాగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇండ్లు మంజూరైనా మొండిగోడలను చూపుతూ తమ సన్నిహితులకు మళ్లీ ఇండ్లు మంజూరు చేసేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఎమ్మెల్యే అనుచరులతో కుమ్మక్కై ఒక్కో కూల్చిన ఇంటి గోడలకు పలుమార్లు మంజూరు చేశారని మండిపడుతున్నారు. అలా ఒక్కో ఇల్లుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల దాకా చెల్లించి వారి కుటుంబంలోని మరికొందరికి ఇండ్లు మంజూరు చేయించుకుంటున్నారని గుడిసెల్లో నివసిస్తున్న అసలైన బస్తీవాసులకు మాత్రం ఇండ్లు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దందా బస్తీలో ఇప్పటికీ జోరుగా సాగుతున్నదని ఆరోపిస్తున్నారు. తాజాగా మరోసారి ఎమ్మెల్యే అనుచరులు ఆర్డీవోకు మరికొన్ని ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారం అంతా ఉన్నతాధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ దందాకు స్వస్తి పలికి అర్హులకు ఇండ్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రకటించి రెండేండ్లు దాటినా అసలైన అర్హులకు ఇప్పటిదాకా ఇండ్లు మంజూరు కాలేదని ఆవేదన చెందుతున్నారు. ఈనేపథ్యంలో 60 మంది బాధితులు ఇటీవల ఆర్డీవో, ఎమ్మార్వోను కలిసి పలుసార్లు వినతి పత్రాలు సమర్పించామని చెప్తున్నారు.
సానుకూలంగా స్పందించిన ఆర్డీవో ఇప్పటి దాకా ఇండ్లు మంజూరు కాని అర్హులకు కచ్చితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. రెండు మూడు ఇండ్లు కేటాయించిన వారిని గుర్తించి, వారి పేర్లు తొలగించి వాటిని అర్హులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. ఆర్డీవో హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే అనుచరుల ఒత్తిళ్లకు తలొగ్గి తమకు అన్యాయం చేయొద్దని, వెంటనే ఇండ్లను మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

