హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ‘మాట మీద నిలబడే వ్యక్తివే అయితే.. చర్చిద్దాం రా’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ‘ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చ పెడదాం.. మేము 10-15 మంది శాసనసభ్యులు, సీనియర్ నాయకులం వస్తం.. దూద్‌కా దూద్.. పానీకా పానీ తేల్చుదాం.. డెడ్‌లైన్.. 72 గంటలు విధిస్తున్న.. రండి’ అని సవాల్ చేశారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను బీఆర్ఎస్ పార్టీ తరఫున తాను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణభవన్‌లో శనివారం మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి, తుల ఉమతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతుల పేరుతో రొటీన్‌గా రంకెలు వేసిన రేవంత్‌రెడ్డి ముచ్చట తీర్చేందుకే ఆయన చాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. ‘బేసిన్లు, బెండకాయలని పరువు తీసుకోకుండా ఉండేందుకే బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్‌రెడ్డికి 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నం’ అని తెలిపారు.
‘రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి, నీ నియోజకవర్గం కొడంగల్ లేదంటే కేసీఆర్ సొంతూరు చింతమడక, ఆయన నియోజకవర్గం గజ్వేల్ లేదంటే హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ కాడా పెడుతవా? అసెంబ్లీలో పెడుతవా? చర్చకు రెడీగా ఉన్నం.. ఊరు నీ ఇష్టం..ప్లేసు నీ ఇష్టం..డేట్ నీ ఇష్టం..అంతా నీ ఇష్టం’ అని కేటీఆర్ సూచించారు. ‘కాకుంటే నువ్వు తప్పించుకొని పోయే బాపతి అని మాకు తెలుసు..నీకు బురదజల్లడం అవతలపడటం.. డైలాగ్ చెప్పడం..మళ్లెక్కడన్న అని తప్పించుకోవడం అలవాటు. నిన్న నువ్వే అడిగినవ్ చర్చకు కేసీఆర్ వస్తరా? కేటీఆర్ వస్తరా? అని నేను చర్చకు సిద్ధంగా ఉన్న..దమ్ముంటే రా’ అని సవాల్ చేశారు. ‘లేదంటే ఒక ప్రతిపాదన పెడుతున్నం..ఈ నెల 8వ తేదీనాడు ఉదయం 11 గంటలకు మేం అందరం వస్తం.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తం. మీకు కుర్చీ వేస్తం. మీరు ఎంత మంది వస్తరో రండి. వాళ్లకు ఇంతజాం చేస్తం. చాయ్ బిస్కెట్ పెడతం. నువ్వు వస్తవా రావా? నీ ఇష్టం. నువ్వే చాలెంజ్ విసిరినవ్ కాబట్టి దమ్ముంటే రా’ అని ధ్వజమెత్తారు.
గుడ్డలూడదీసి కొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? రేవంత్‌రెడ్డీ.. ఇందిరమ్మ రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం అన్నవు. గుడ్డలూడదీసి కొట్టడమే ఇందిరమ్మ గొప్పతనం అంటున్నవు. ఇందిరమ్మ రాజ్యంలో మళ్లీ కాలిపోయిన మోటర్లు.. పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు.. విత్తనాలు, ఎరువులు, యూరియా కోసం చెప్పుల లైన్లు.. మార్పు తెస్తమని చెప్పి నిజంగానే తెచ్చినవు.
-కేటీఆర్
‘అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా దేవాదుల ఏ బేసిన్ల ఉన్నదని రేవంత్‌రెడ్డి అడిగిండు. ఇంకా దరిద్రమేందంటే నల్లమల పులి అని చెప్పుకుంటడు..నల్లమల తెలంగాణలో ఉన్నదా అని అడుగుతడు.. ఇంత అవగాహన లేని వ్యక్తి కాబట్టే ప్రిపరేషన్ కోసం ఆయనకు 72 గంటల సమయం ఇస్తున్నం. నీళ్లు పల్లమెరుగు..నిజం దేవుడెరుగు అన్నట్టు తెలంగాణలో వ్యవసాయానికి ఎవరేం చేసిన్రో చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు ఎవరినడిగినా చెప్తరు. తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తెచ్చిన్రో.. హర్యానా, పంజాబ్‌ను తలదన్నేలా ధాన్యం ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా నిలిపిందెవరో.. సమైక్య రాష్ట్రంలో దండుగలా మారిన వ్యవసాయాన్ని పండుగ చేసిందెవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. జాతీయపార్టీగా అవతరించిన బీఆర్ఎస్ హయాంలో ‘ఆప్కీబార్..కిసాన్ సర్కార్’ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని నడిపింది కేసీఆరే. కాకపోతే జగమెరిగిన సత్యాన్ని ఒప్పుకోనివాన్ని చవట అంటరు..నిజం తెలిసినా అంగీకరించలేని వాడిని రేవంత్‌రెడ్డి అంటరు. అన్నీ తెలుసు కానీ తెలిసినా తెలియనట్టు.. చూస్తున్నది కనబడనట్టు.. నటించేవాడిని రేవంత్‌రెడ్డి అని చెప్పకతప్పదు. 18 నెలలుగా అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి ముచ్చటపడుతున్నరు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు రెడీ’ అని తేల్చిచెప్పారు.
‘వాస్తవాలు చెప్పాలంటే దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయంలో ఎలాంటి విప్లవాలు సృష్టించినమో ప్రజల అవగతంలో ఉన్నది. అయినా కొన్ని విషయాలను గుర్తుచేయాల్సిన బాధ్యత మాపై ఉన్నది. వాస్తవమేంటి అంటే 78 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా కేసీఆర్ చేసినన్ని సాహసోపేత కార్యక్రమాలను తీసుకోలేదనేది అక్షర సత్యం. రైతుబంధు అనే ఒక విప్లవాత్మక పథకం తెచ్చినం. మొన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చెప్తే వాళ్లు పరేషాన్ అయిండ్రు. 72 వేల మిలియన్ డాలర్లు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ రూపంలో 11 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేసినమని చెప్తే అక్కడి అధ్యాపకులు, విద్యార్థులు కూడా అబ్బురపడ్డరు. తెలంగాణలో రైతురాజ్యం తెచ్చిందే కేసీఆర్. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణే..ఈ ఘనత కేసీఆర్‌దే. రేవంత్‌రెడ్డి కాదన్నా, అవునన్నా, గింజుకున్నా, గిలగిలా కొట్టుకున్న ముమ్మాటికీ వాస్తవమే’ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
ఎవరేం చేశారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అంతా తెలుసు.. కానీ ఏమీ తెల్వనట్టు ఉంటడు. ఇందులో సవాల్ చేయాల్సింది ఏమీ లేకున్నా 18 నెలలుగా అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి ముచ్చటపడుతున్నరు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా నేను చర్చకు రెడీ. నిన్న రంకెలేసిండు. రేవంత్ సభ పెడితే మూడు బూతులు, ఐదు చాలెంజ్‌లు, ఆరు తొడలు గొట్టే డైలాగులు, రెండు గుడ్డలు ఊడదీస్తాననే భూషణాలు షరా మాములే!
–కేటీఆర్
‘ఇందిరమ్మ రాజ్యంలో దగా పడ్డ రైతులకు ధైర్యమిచ్చింది కేసీఆర్.. ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీని గుర్తుకు తేస్తున్న రేవంత్‌రెడ్డి.. బట్టలూడదీసి కొడతామంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదు.. తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నది’ అని కేటీఆర్ హెచ్చరించారు. ‘రాహుల్‌గాంధీ వరంగల్‌కు వచ్చి రైతు డిక్లరేషన్ పేరిట మాయమాటలు చెప్పిండ్రు.. ఒకటే విడుత రుణమాఫీ అన్నరు. కానీ రేవంత్ సర్కారు రూ.50 వేల కోట్ల రుణమాఫీని రూ.12 వేల కోట్లకు కుదించి చేతులు దులుపుకున్నది.. అవతలపడి అయిపోయిందని పారిపోయిండ్రు.. ఈ రోజుకూ రూ.12 వేల కోట్లు దాటలే..కానీ సిగ్గులేకుండా రూ.21 వేల కోట్లని చెప్తున్నరు’ అని ఎద్దేవా చేశారు. ‘రైతు డిక్లరేషన్ హామీల్లో ఏ ఒక్కటైనా అమలైందా రేవంత్‌రెడ్డీ.. సమాధానం చెప్పు?’ అని నిలదీశారు. ‘కేసీఆర్ పాలనలో 2,300 రైతు వేదికలు కట్టామని, 5,500 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించామని, మాటలు చెప్పకుండా అకుంఠిత దీక్షతో వ్యవసాయ విస్తరణ చేశామని, రైతుబంధు, ఉచిత కరెంట్, రైతుబీమా ఇలా అన్నిటినీ కలగలిపి తెలంగాణను అభివృద్ధి చేశామని వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాలతోపాటు నిరుద్యోగులను సైతం కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘ఉద్యోగాలు ఇచ్చిన 60 వేల తలకాయలు లెక్కపెడుతడా ఈయన? ఇదో పెద్దజోక్. మందికి పుట్టిన బిడ్డలు మాబిడ్డలు అని చెప్పుకొనే బాపతు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలే అన్నీ. నీ సమయం వచ్చేవరకు కాగితమిచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకుని నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకొనేందుకు సిగ్గున్నదా? వస్తవా అశోక్‌నగర్‌లో చర్చకు? నిరుద్యోగుల మధ్య చర్చపెడదాం వస్తావా? రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో చాయ్తాగి.. పోజులు కొట్టి తెలుగులో ట్వీట్‌పెట్టి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని నరికి.. నువ్వోటి.. ఆయనోటి రెండు ఉద్యోగాలు సంపాదించుకొని తప్పించుకొని తిరుగుతున్నరు’ అని కేటీఆర్ కడిగిపారేశారు.
తెలంగాణలోని ప్రతివర్గం కాంగ్రెస్ మోసాన్ని అర్థం చేసుకున్నదని, మహిళలు రేవంత్ సర్కారు మోసాన్ని గ్రహించారని కేటీఆర్ తెలిపారు. ‘కోటి మందిని కోటీశ్వరులను చేస్తానని డైలాగ్‌లు కొడుతున్నవు కదా.. కోటీశ్వరులను చేయడమేందో గానీ ఇవాళ రూ.2,500 ఇస్తే చాలని వాళ్లు ఎదురుచూస్తున్నరు. నెల రోజుల్లోనే ఇస్తానన్నవు. 1.68 కోట్ల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నరు. 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలు ఎప్పుడొస్తది మహాలక్ష్మి అని ఎదురుచూస్తున్నరు. మా తమ్ముళ్లు, చెల్లెల్లు నువ్వు ఇస్తానన్న స్కూటీలేవి?. నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది? నువ్వు నింపుతానన్న రెండు లక్షల ఉద్యోగాలేవి? అని ఎదురుచూస్తున్నరు. ఎప్పుడుజేస్తరు సంపూర్ణ రుణమాఫీ అని రైతులు ఎదురుచూస్తున్నరు. ఎప్పుడిస్తరు రూ.15 వేల రైతుబంధు అని అన్నదాతలు ఎదురుచూస్తున్నరు. నాలుగువేల పెన్షన్ ఏమాయెనని పెద్ద మనుషులు ఎదురుచూస్తున్నరు. ప్రతి వర్గాన్ని మోసం చేసి బుకాయించుకుంట బతుకుతా అంటే నడువదు రేవంత్‌రెడ్డీ. అందరికి అన్ని విషయాలు తెలిసిపోయినయి’ అని దుయ్యబట్టారు.
ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను స్వీకరిస్తున్న. రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దాం. తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరును అడిగినా.. ఏ రైతును అడిగినా.. ఏ రైతు పకనున్న ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ అనే చెప్తయి. బీఆర్ఎస్ తెచ్చిన రైతురాజ్యం మీద, కాంగ్రెస్ తెచ్చిన రాబందుల రాజ్యం మీద చర్చించేందుకు నేను సిద్ధం.
– కేటీఆర్
‘నీకు దమ్ముంటే.. మాటమీద నిలబడే మనిషివే అయితే.. ప్లేస్, డేట్ నువ్వే డిసైడ్ చెయ్యి. ఈ మూడు రోజుల్లో నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తవు కాబట్టి.. మాటమీద నిలబడే మనిషివి కాదు కాబట్టి.. ఈ మూడు రోజుల్లో నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. కాదంటే 8వ తారీకు నాడు ఉదయం 11 గంటలకు మేం మా బృందం వస్తం. మేం నీలాగ మందను తీసుకుని రాం. మా లెజిస్లేచర్లు, సీనియర్ నేతలు 10 -15 మందిమి వస్తం. సావధానంగా చర్చిద్దాం. మేమేం జేసినం.. మీరేం జేసిండ్రు? ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నరు? నువ్వొస్తావా? లేక ఎవ్వరినైనా పంపుతవా నీ ఇష్టం. నువ్వే సవాల్ చేసినవు గని నువ్వేరా అని నేను డిమాండ్ చేస్తున్న. దూద్‌కా దూద్.. పానీ కా పానీ తేలాలంటే ఈ సవాల్‌ను స్వీకరించి రేవంత్‌రెడ్డి చర్చకు రావాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆనాడు సమైక్య రాష్ట్రంలో నీళ్లివ్వకుండా ఎండబెట్టిన్రు కాబట్టే..కరెంట్ ఇవ్వక కాల్చుక తిన్నరు కాబట్టే..తెలంగాణ ఉద్యమం పుట్టింది. కేసీఆర్ ఆధ్వర్యంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో నాడు ఉద్యమాన్ని నడిపినం. కానీ ఇప్పుడు నీళ్లేమో బనకచర్ల రూపంలో ఆంధ్రాకు.. నిధులేమో మూటల రూపంలో ఢిల్లీకి.. నియామకాలేమో వారి అనుయాయులకు, తొత్తులకు ఇచ్చి వాళ్లతో తెల్లారి లేస్తే మమ్మల్ని తిట్టిస్తున్నరు.
-కేటీఆర్
‘ఎలక్షన్లు పెట్టుమనుండ్రి ఎవరి సత్తా ఏందో తేలుతది’ అని కేటీఆర్ సవాల్ విసరారు. ‘ఆయన సొంత నియోజకవర్గంలోనే జడ్పీటీసీలు గెలుస్తడో లేదో! రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతయి. అది చెప్పి.. ఇది చెప్పి 420 అడ్డమైన హామీలిచ్చి.. ఢిల్లీకెళ్లి టూరిస్ట్‌లను తీసుకొచ్చి ఆ డిక్లరేషన్.. ఈ డిక్లరేషన్ అని చెప్పి.. వంద సీట్లు గెలవాలే ఎట్ల గెలవాలె? ప్రజలు ఓట్లు వేయాలె.. ఎవరు ఓట్లు వేయాలె రేవంత్‌రెడ్డీ? రేవంత్‌రెడ్డి ద్వారా దళితబంధు అందుకున్న దళితులు ఓట్లు వేయాలా? ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 వేల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు, గిరిజనులు వేయాలా? నాలుగు వేల పింఛన్ వేసినందుకు ముసలోళ్లు వేయాలా? రెండు లక్షల ఉద్యోగాలిచ్చినందుకు యువకులు వేయాలా? 2,500 వేస్తున్నందుకు మహిళలు వేయాలా? రైతుబంధు ఎగ్గొట్టినందుకు రైతులు వేయాలా? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలా? ఎవ్వరు వేయాలె? ఎందుకు వేయాలె? ఏ వర్గం సంతోషంగా ఉన్నది ఇయ్యాల తెలంగాణల? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉన్నది. రేవంత్‌రెడ్డి ఆయన తొట్టిగ్యాంగ్ సంతోషంగా ఉన్నది. ఆ తొట్టిగ్యాంగ్ బాగా భయంకరమైన దోపిడీ, దండుపాళ్యం ముఠాలా దోచుకునే పనిలో ఉన్నది. వాళ్లు మాత్రం సంతోషంగా ఉన్నరు. బిల్డర్లను గోకుడు.. కాంట్రాక్టర్లను గీకుడు పనిలో ఫుళ్లు బిజీగా ఉన్నరు. ఒక్క కొత్త స్కీం అమలుకాదు. ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అప్పు రెండు లక్షల కోట్లకు చేరింది. ఎక్కడపోతున్నయి ఈ పైసలు? బడ్జెట్ కాకముందే రెండు లక్షల కోట్లు అప్పు. రైతు బంధు రాదు. రుణమాఫీ సంపూర్ణంగా జరగదు. మహిళలకు 2,500 రాదు. పెద్దమనుషులకు పెన్షన్ నాలుగువేలు రాదు. ఒక్క ఇళ్లు కట్టింది లేదు. ఒక్క చెక్‌డ్యామ్ కట్టింది లేదు. ఒక్క చెరువు తవ్వింది లేదు. ఒక ఇటుక పెట్టింది లేదు. ఏడపోతున్నయి పైసలన్నీ’ అని కేటీఆర్ నిలదీశారు.
రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఎరువులు, విత్తనాల కోసం రైతులు కొట్లాడే పరిస్థితులు వచ్చిన మాట వాస్తవం కాదా? ఎరువుల దుకాణాల్లో ఆధార్‌కార్డు చూపెడితే ఒక్క ఎరువు బస్తా ఇవ్వాలని మీ అధికారులను ఆదేశించింది నిజం కాదా? ఎరువులు కూడా పంచే చేతగాని నువ్వు కేసీఆర్‌ను చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు రేవంత్‌రెడ్డీ’
-కేటీఆర్
‘రైతులకు ఖాతాల్లో డబ్బులు పడటం లేదుగాని ఢిల్లీ నేతల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ‘మొత్తం మంచిగ ఢిల్లీకి టకీటకీ మని చెప్పి రాహుల్‌గాంధీ ఖాతాల, ఖర్గే ఖాతాల, ప్రియాంకగాంధీ ఖాతాల, కేసీ వేణుగోపాల్ ఖాతాల పడుతున్నయ్. మేం ఈయనకు పెట్టుకున్న ముద్దుపేరు పే సీఎం. పేటీఎం అందరికీ ఐడియా ఉండవచ్చు. ఈ పే సీఎం తెలంగాణను ఏటీఎంగా మార్చిండు. టకీ టకీ మని ఏఐసీసీల మాత్రం మోత మోగుతున్నది. కొత్త కొత్త బిల్డింగ్లు కడుతున్నరు. కొత్త కొత్త ఆఫీసులు తెరుస్తున్నరు. ఇయన పదవి కాపాడుకుంటున్నడు. ఇది తప్ప.. మరేం లేదు. ఇక్కడ ఆయనకు ఓటేసేటోళ్లు ఎవరూ లేరు. అందుకే వందనా. బొందనా.. అని అంటున్నం. ముఖ్యమంత్రిపై గౌరవముంది. కానీ ఆ మాట అనక తప్పడంలేదు’ అని విమర్శించారు.
చంద్రబాబుకు తెలంగాణలో అసలు సిసలైన కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘రాష్ట్రంలో నడుస్తున్నది కోవర్డుపాలన. చంద్రబాబు కోవర్డు ఈ రోజు రాష్ర్టాన్ని ఏలుతున్నడు. ఇది వాస్తవం. తమ్ముడు.. ఆయన ఎమ్మెల్యేను నేను అభినందిస్తున్న. ఇన్నాళ్లకు కాంగ్రెస్‌లో ఒక్కడైనా వాస్తవం చెప్పేందుకు మిగిలిండు. ఆ ఎమ్మెల్యేను అభినందిస్తున్నా. ఆ ఎమ్మెల్యే చెప్పింది కరెక్టు. పక్కా కోవర్టు పాలన. ఇక్కడి నీళ్లను ఆంధ్రాకు ఎట్లా తరలించుకుపోవాలనే కోవర్టు పాలన. ఇక్కడి నిధులను ఢిల్లీకి ఎట్లా తలించాలనే కోవర్టు పాలన. ఇక్కడి నియామకాలను తెలంగాణ ద్రోహుల చేతిలో పెట్టే కోవర్టు పాలన. పదేండ్లు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఆధిత్యనాథ్దాస్ను తెచ్చి ఎవరన్న సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకుంటరా? పదేండ్లు అన్యాయం చేసినోడు ఇవ్వాల వచ్చి న్యాయం చేస్తడా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు చేసే పనేనా ఇది? అందుకే రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్టుగా కోవర్టు పాలన. దిస్ మ్యాన్ చీఫ్ మినిస్టర్ ఈజ్ కోవర్ట్. దీంట్లో డౌటేలేదు’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీని గుర్తుకుతెస్తున్న రేవంత్‌రెడ్డి బట్టలూడదీసి కొడతామంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నది. రేవంత్‌రెడ్డీ..నీకు లెక్కలు తెలియకపోవచ్చు.. నేను గుర్తుచేస్తా.. కేసీఆర్ నేతృత్వంలో సాగిన పోరాటం.. ప్రజల ఆకాంక్షల మేరకు 2014లో తెలంగాణ అవతరించింది. కొత్త రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు. అయినా రెండు దఫాల్లో రూ. 35 వేల కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా.? కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు సమస్య వచ్చినా? కొత్త రాష్ర్టాన్ని మోదీ ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేసినా? తట్టుకొని రుణమాఫీ చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆరే.
-కేటీఆర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు బడుగు బలహీనవర్గాలను మోసగిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ‘బీసీ రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలోనే కడిగిపారేసినం. కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేస్తున్నరని తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్ అసెంబ్లీలనే చెప్పిండ్రు. బీసీ డిక్లరేషన్ చిత్తశుద్ధి లేని శివపూజ వంటిదని ఆనాడే స్పష్టం చేసినం. మీకు అంతా తెలుసు. మీకు తెలిసే బీసీలను మోసం చేసిండ్రు అని అసెంబ్లీ వేదికగా చెప్పినం. ఈ ప్రభుత్వం చేత మోసగించబడని వాళ్లే లేరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని మోసం.. అభయహస్తం 12 లక్షలని దళితులు, గిరిజనులను దగా చేసిండ్రు. మైనార్టీలను సబ్‌ప్లాన్ అని దగా చేసిండ్రు. ఆ వర్గం ఈ వర్గం అని లేదు. మహిళలకు మోసం.. యువతకు మోసం. అందరికీ మోసం. మోసాల పరంపంర. 420 హామీల గురించి రాబోయే రోజుల్లో నిలదీస్తూనే ఉంటం’ అని కేటీఆర్ హెచ్చరించారు.
‘గుడ్డలూడదీసి కొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఇయ్యాల ఎరువుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడిగాపులు పడుతున్నరు. రైతులను కాల్చుకుతింటున్నది నిజం కాదా? నిన్నగాక మొన్న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో వేలాది మంది రైతులు ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఎరువులు, విత్తనాల కోసం కొట్లాడే పరిస్థితులు వచ్చిన మాట వాస్తవం కాదా? ఎరువుల దుకాణాల్లో ఆధార్‌కార్డు చూపెడితే ఒక్క ఎరువు బస్తా ఇవ్వాలని మీ అధికారులను ఆదేశించింది నిజం కాదా? ఎరువులు కూడా పంచే చేతగాని దద్దమ్మ అయిన నువ్వు కేసీఆర్‌ను చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు’ అని కేటీఆర్ కడిగిపారేశారు. ‘సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా, రైతుల పొలాలను ఎండబెట్టి దగా చేసింది మీ ప్రభుత్వాలు కావా? ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది మీరు కాదా?’ అని నిలదీశారు. ‘అదే కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయమిచ్చిండ్రు. ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు. మిషన్ కాకతీయ తెచ్చి చెరువులు తవ్విచ్చిండ్రు. చెక్‌డ్యాంలు కట్టిండ్రు. ఆఖరికి గోదావరి నీళ్లను తీసుకొచ్చి మంజీరా, మానేరు, కూడవెళ్లి, హల్దీవాగుల్లో పోసి నింపింది నీకు తెలియదా రేవంత్?’ అని నిలదీశారు.
‘కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలమవుతుంటే ఆనాడు 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజదాకా కొని రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నది కేసీఆర్.. ఇవ్వాల బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనకుండా ఎగ్గొట్టింది నీ ప్రభుత్వం.. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా రైతుబీమాను తెచ్చింది కేసీఆర్.. మూడు నెలలుగా ప్రీమియం కట్టకుండా రైతుబీమాను ఎగ్గొట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘ఆనాడు ఇందిరమ్మ పాలనలో చెరువులను తాంబాలాలుగా చేసి పొలాలు ఎండబెడితే మిషన్ కాకతీయ తెచ్చి ప్రాణం పోసింది కేసీఆర్ కాదా? ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ.. మత్స్య పరిశ్రమకు ఊపిరిపోసి రూ. 30 వేల కోట్ల మత్స్య సంపదను సృష్టించి తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపింది కేసీఆర్ కాదా? ఒకవైపు కృష్ణమ్మ బిరబిరా ఆంధ్రాకు తరలిపోతుంటే హారతులు పట్టింది నీ పార్టీ. గోదావరి నీళ్లను చెరబట్టింది నీ పార్టీ. కానీ పోరాడి ఆనాడు దాశరథి చెప్పినట్టు ఒక్కొక్క బొట్టూ ఒడిసిపట్టి.. తెలంగాణను కోటి ఎకరాల మాగణంలా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? ఇది తెలియదా ప్రజలకు.. 2014లో ధాన్యం ఉత్పత్తి ఎంత? 2023లో వచ్చిన ధాన్యం ఉత్పత్తి ఎంత తెలువదా? ఇవ్వాల బనకచర్ల ద్వారా మీ గురువు చంద్రబాబు తెలంగాణ రైతుల గొంతుకోసి ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోతుంటే నువ్వు వంతపాడుతున్న సంగతి ప్రజలు గుర్తించడం లేదనకుంటున్నావా? నీ జలదోపిడీని అడ్డుకుంటున్నది మేం కాదా?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘ఆనాడు వలసల జిల్లా పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో.. 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 10 శాతం పూర్తిచేయకుండా ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా రేవంత్‌రెడ్డీ? అని నిలదీశారు. ‘ఆనాడు నల్లగొండలో ఫ్లోరైడ్ రక్కసికి బొక్కలు వంగిపోయి ప్రజలు చచ్చిపోతుంటే ఆ ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టింది కేసీఆర్ కాదా? అన్నదాతల ఆత్మహత్యలను ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా? ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పింది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు. ‘నాడు తెలంగాణలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవంటే చివరికి ఫెయిలైన బోర్ల పేర్లే ఇంటి పేరుగా మార్చుకొనే దుస్థితి ఉండేది.. 57 బోర్లేసిన రాంరెడ్డి..బొక్కాబోర్లా పడిన దారుణాతి దారుణమైన పరిస్థితులు ఉండేవి’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
రాష్ట్రంలో నడుస్తున్నది కోవర్టు పాలన. చంద్రబాబు కోవర్టు రేవంత్‌రెడ్డే. గురువు కోసం ఏపీకి తెలంగాణ నీళ్లను పారిస్తున్నడు. ఏపీ ప్రయోజనాల కోసం, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్‌ను నీటిపారుదలశాఖ సలహాదారుగా పెట్టుకున్నడు. నీళ్లను ఆంధ్రాకు, నిధులకు ఢిల్లీకి పారిస్తున్నడు. ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండానే, ఒక్క ప్రాజెక్టుకు ఇటుక పేర్చకుండానే రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చిండు.
-కేటీఆర్
‘అన్నదాతలకు సున్నం పెట్టిందే రేవంత్ సర్కారు’ అని కేటీఆర్ చురకలంటించారు. ‘సిగ్గులేకుండా రైతుబంధు వేసిన.. పండుగ చేసుకోండి అంటూ రేవంత్‌రెడ్డి అంటున్నడు. నాలుగు పంటలకు ఒకసారి వేసి దానికే పండుగ చేసుకో అంటున్నడు. మేం వీళ్లలా ఒకసారి రైతుబంధు వేయలేదు. 11 సార్లు మొత్తం 73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసినం. కానీ ఎన్నడూ హడావుడి చేయలేదు. అసలు కాంగ్రెస్ రైతులకు ఎగ్గొట్టింది ఎంత? ఇచ్చింది ఎంత? మీరు చెప్పింది ఏందీ? ఇచ్చింది ఏందీ? రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తమన్నరు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10 వేలు ఇస్తున్నడు. నేను 15 వేలు ఇస్త్త అన్నవు. కేసీఆర్ రెండు పంటలకిస్తున్నడు.. నేను మూడు పంటలకు ఇస్త అన్నవు. ఈరోజు ఏం చేస్తున్నవు? ఇచ్చినవా 15 వేలు ఎవరికన్న?. రైతుభరోసా పదానికి అర్థమున్నదా? తాత్పర్యమున్నదా? కౌలు రైతులకు రేవంత్‌రెడ్డే కదా లేఖరాసింది. నేను రాంగనే కౌలు రైతులకు రైతుభరోసా ఇస్త అని 22 లక్షల మందికి ఈ మొగోడు లేఖరాయలేదా? మేం వస్తనే ఉన్నం.. ఇస్తమని రెచ్చగొట్టిండు. గద్దెనెక్కి మోసం చేసిండు. అసలు పట్టాదారులకు నాలుగు పంటలకు కలిపి ఎగ్గొట్టింది 24 వేల కోట్లు. కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15 వేల కోట్లు. మొత్తం కలిపి ఒక్క రైతుబంధులోనే ఎగ్గొట్టింది అక్షరాలా 39 వేల కోట్లు’ అని రేవంత్ అబద్ధాలను కేటీఆర్ ఏకరువు పెట్టారు.
తెలంగాణలో రైతురాజ్యం తెచ్చిందే కేసీఆర్. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణే. 11 విడతలుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేసినం. ఈ ఘనత కేసీఆర్‌దే. రేవంత్‌రెడ్డి కాదన్నా, అవునన్నా, గింజుకున్నా, గిలగిలా కొట్టుకున్నా ముమ్మాటికీ వాస్తవమే’
-కేటీఆర్
ఓట్ల అవసరం తీరాక రైతుభరోసాకు కాంగ్రెస్ సర్కారు రాంరాం చెప్తదని కేటీఆర్ హెచ్చరించారు. ‘రైతు రుణమాఫీ కింద రూ.38 వేల కోట్లను కాంగ్రెస్ ఎగ్గొట్టింది. మొత్తం రూ.50 వేల కోట్ల లెక్కను 12 వేలకు రౌండప్ చేసి 38 వేల కోట్లు రైతులకు ఎగనామం పెట్టింది. రైతుబంధులో ఇంకో 39 వేల కోట్లు ఎగ్గొట్టింది. ఎట్లా అంటే.. 2023 రబీలో ఒక ఎకరానికి ఆనాడు రూ. 2,500 ఇచ్చి చేతులు దులుపుకున్నడు. కేసీఆర్ తెచ్చిపెట్టిన 7,500 కోట్లు ఇచ్చి ఎకరానికి 2,500 ఎగ్గొట్టిండు. ఆ తర్వాత ఒక పంట మొత్తానికే ఎగ్గొట్టిండు. 2023-24 రబీలో రూ. 5 వేలు ఇచ్చిండు. వానకాలంలో మొత్తం రూ.7,500 ఎగ్గొట్టిండు. 2024 -25లో మొత్తానికి మొత్తం ఎగ్గొట్టిండు. మొన్న మళ్లా రూ. 1,500. మొత్తం కలిపితే ఒక ఎకరానికి రైతుబంధు కింద రూ.19 వేలు బాకీ. మొత్తం 1.52కోట్ల ఎకరాలకు రూ.39 వేల కోట్లను కాంగ్రెస్ ఎగ్గొట్టింది. టోటల్‌గా అన్నదాతకు సున్నం పెట్టింది. కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లువేసేటప్పుడు రైతుబంధు వేస్తే. ఈయనేమో ఓట్లు వేసేటప్పుడే వేస్తడు. ఆ తర్వాత వెయ్యడు. మళ్లా ఓట్లు దాటినయంటే రైతుబంధు రాదు. రైతుబంధుకు రాంరాం.. రైతులారా రైతుబంధును మరిచిపోండి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటది. రాహుల్‌గాంధీ ఏకకాలంలో రుణమాఫీ అన్నడు. ఉరుకుండ్రి.. తెచ్చకోండ్రి.. నేను వస్తనే ఉన్న.. వేస్తనే ఉన్న అన్నడు. రూ.49,500 కోట్లకు కుదించి. ఆఖరుకు రూ. 20 వేల కోట్లు చేసినమని బయటికిచెబుతున్నా నిజానికి చేసింది రూ.12 వేల కోట్లే. ఇక్కడా ఎగ్గొట్టిండ్రు. రైతుకూలీలకు మోసం. 500 బోనస్ అని అక్కడా మోసం. కౌలుదారులకు మోసం. ఆఖరుకు పంటలు కొనేకాడ మోసం. పంటలుకొంటే బోనస్ ఇవ్వాలే కదా? మొదట అన్ని రకాల వడ్లకు బోనస్ అన్నరు. ఆఖరుకు సన్నవడ్లకు అన్నరు. ఆ సన్నవడ్లకు కూడా పూర్తిగా ఇవ్వలేదు. మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం 30 శాతం కూడా కొనలేదు. ఇది వాస్తవం. ఇట్ల ఎన్నోరకాలుగా మోసం చేసిండ్రు’ అని కేటీఆర్ మండిపడ్డారు.