Lionel Messi : దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. భారత పర్యటన ఖరారైనట్లు నిర్వాహకులు ప్రకటించడంతో దేశంలోని ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ దేశంలోని పలు నగరాలను సందర్శించనున్నారు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025’ పేరుతో భారత్‌లో పర్యటించనున్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడురోజుల పాటు జరగనున్న ఈ టూర్లో భాగంగా మెస్సీ మొదట కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు. త్వరలోనే నాలుగో నగరం పేరును కూడా వెల్లడిస్తామని ఈవెంట్ మేనేజర్ తెలిపారు. 2011లో అర్జెంటీనా జాతీయ జట్టుతో కలిసి కోల్‌కతాలో వెనిజులాపై ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన తర్వాత మెస్సీ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి.
తన భారత పర్యటనపై మెస్సీ స్పందిస్తూ.. తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. భారత్ చాలా ప్రత్యేకమైన దేశమని, 14 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పటి మధుర జ్ఞాపకాలు తనకింకా గుర్తున్నాయని అన్నారు. అప్పటి అభిమానుల స్పందన అద్భుతమని చెప్పారు. ఇప్పుడు కొత్త తరం అభిమానులను కలుసుకోవడానికి, ఫుట్‌బాల్‌పై తనకున్న ఇష్టాన్ని వారితో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మెస్సీ పేర్కొన్నారు.
మెస్సీ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోల్‌కతాలో మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు, ఓ కొత్త స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్య నేతలతో పాటు, స్థానిక క్రీడా, సినీ ప్రముఖులతో కూడా మెస్సీ సమావేశం కానున్నారు.
అయితే ఈ పర్యటనకు ముందే నవంబర్‌లో అర్జెంటీనా ప్రపంచకప్ విజేత జట్టుతో కలిసి మెస్సీ కొచ్చిలో ఓ మ్యాచ్ ఆడనుండటం విశేషం. ఫిఫా అంతర్జాతీయ విండోలో భాగంగా అర్జెంటీనా జట్టు ఈ మ్యాచ్ ఆడనుంది.