Rajnath Singh : పాకిస్థాన్ సర్ క్రీక్ ప్రాంతంలో ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, చరిత్రతో పాటు భౌగోళికంగా రూపురేఖలు మారిపోయేలా గట్టి సమాధానం ఇస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. గురువారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ బేస్‌లో నిర్వహించిన శస్త్ర పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం పంపారు. 1965 యుద్ధంలో భారత సైన్యం లాహోర్ వరకు వెళ్లగలిగే సత్తా చూపించిందని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. కరాచీకి వెళ్లే ఒక మార్గం సర్ క్రీక్ గుండానే వెళుతుందనే విషయాన్ని పాకిస్థాన్ ఇప్పుడు గుర్తుంచుకోవాలని అన్నారు. ఇటీవలే జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రస్తావిస్తూ.. లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు భారత రక్షణ వ్యవస్థలను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ విఫలయత్నం చేసిందని చెప్పారు. ‘మన బలగాలు జరిపిన ప్రతిదాడిలో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా బట్టబయలైంది. భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కావాలంటే అప్పుడు పాకిస్థాన్‌కు భారీ నష్టాన్ని కలిగించగలదని ‘ఆపరేషన్ సిందూర్’ ప్రపంచానికి స్పష్టం చేసింది’ అని అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 78 ఏళ్లుగా సర్ క్రీక్ వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా పరిష్కారానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తోందని, కానీ పాకిస్థాన్ ఉద్దేశాలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయని రాజ్‌నాథ్ విమర్శించారు. సర్ క్రీక్ సమీపంలో పాకిస్థాన్ ఇటీవల సైనిక మౌలిక సదుపాయాలను పెంచుతుండటమే వారి దుష్ట పన్నాగాలకు నిదర్శనమని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా ఊహించని రీతిలో బదులిస్తామని స్పష్టం చేశారు.