కాసిపేట : నెల రోజుల్లోనే సిమెంట్ కంపెనీ కార్మికులకు అనేక హక్కులు సాధించామని దేవాపూర్ సిమెంట్ కంపెనీ యూనియన్ గుర్తింపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సత్యపాల్ రావు (Kokkirala Satyapal Rao) పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipeta) మండలంలోని దేవాపూర్‌లో ఓరియంట్(అదానీ) సిమెంట్ కంపెనీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో గుర్తింపు సంఘంగా గెలిచి నెల రోజుల ప్రగతి నివేదికను వివరించారు.
ఈ సందర్భంగా అంబులెన్సు ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు రూ. 4వేలు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ. వెయ్యి దసరా బోనస్ (Dussehra Bonus) పెంపు సాధించినట్లు వెల్లడించారు. గత యూనియన్ చేయని పనులు చేసినట్లు తెలిపారు. కార్మికుల మెడికల్ పాలసీని పెంచుతూ తల్లి తండ్రులకు కూడా వర్తించే విధంగా మాట్లాడినామని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుడు శంకరయ్య చనిపోతే అంత్యక్రియలకు రూ. 50వేలు, వారి కుటుంబానికి రూ.పది లక్షలకు పైగా పరిహారం, కుటుంబంలో ఒకరికి సెమీ స్కిల్డ్ కాంట్రాక్టు ఉద్యోగం కల్పించే ఏర్పాటు చేశామన్నారు.
పర్మినెంట్ ఉద్యోగి శ్యామ్ దురదృష్టవశత్తు చనిపోతే, ఆయన భార్యకు పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యాన్ని ఒప్పించామని, కార్మికులకు ఒకేసారి 26 క్వార్టర్స్ కేటాయింపు చేయించినట్లు తెలిపారు. పదేళ్ల క్రితం రద్దు చేసిన అంబులెన్సు సర్వీస్ ను మళ్లీ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి దసరాకు పునః ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ రెడ్డి, మేరుగు శంకర్, అచ్యుత్ రావు, భీమిని మహేందర్, బొల్లు రమణారెడ్డి, కొమ్ముల బాపు, కొంరం జనార్దన్, సత్యం, వేముల కృష్ణ పాల్గొన్నారు.