హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ) : కోపముంటే తమపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని, కానీ కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా రైతులను వేధిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేడిగడ్డ వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నా రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా పంటలను ఎండబెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ను బదనాం చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్నెపల్లి పంప్‌హౌస్‌లో రెండు పంపులు ఆన్ చేయకుండా లక్ష క్యూసెకుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్-మల్కా జిగిరి జిల్లా మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన హమాలీ యూనియన్ 18వ ఆవిర్భావ దినోత్సవ మహాసభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులకు నీళ్లిస్తే ఎరువులు, పంటలు పండితే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని విమర్శించారు. రైతులపై కక్షసాధింపు చర్యలు తీసుకోవద్దని కన్నెపల్లి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని కేటీఆర్ చెప్పారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, కానీ రైతులను ఇబ్బందులుపెడితే ప్రజలే తగినగుణపాఠం చెబుతారని తేల్చిచెప్పారు. గోదావరిలో నీళ్లున్న ప్రాంతాన్ని గుర్తించి కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్లే సాగువిస్తీర్ణం పెరిగి తెలంగాణ సస్యశ్యామలమైందని కేటీఆర్ గుర్తుచేశారు.
హమాలీలు వడ్ల బస్తాలు.. ఢిల్లీకి రేవంత్ డబ్బుల మూటలు
హమాలీ కార్మికులు కష్టపడి వడ్ల బస్తాలు మోస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దల కోసం డబ్బుల మూటలు మోస్తూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో హమాలీలు, రైతులు, మిల్లు యజమానులు అందరూ సంతోషంగా ఉన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ర్టాన్ని మంచి నాయకుడు పాలిస్తే పేదలు, రైతులు, హమాలీలు, మిల్లు యజమానులు అందరూ సంతోషంగా ఉంటారని, కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అదే చూసిందని పేర్కొన్నారు. రైతులు అభివృద్ధి చెందితే హమాలీలకూ ఉపాధి దొరుకుతుందన్నారు.
హమాలీల కష్టాన్ని గుర్తించింది బీఆర్ఎస్సే
హమాలీల కష్టాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం కూలీ రేట్లను రూ.8 నుంచి రూ.26కు పెంచిందని, దాదాపు 250శాతం పెంపు సాధించడం బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఐదేండ్లకోసారి మాత్రమే కూలీ రేట్లు పెరిగేవని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేండ్లకోసారి రేట్లు సవరించడంతో హమాలీల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానించిన హమాలీ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్, హమాలీల ప్రేమాభిమానాలకు రుణపడి ఉన్నానని తెలిపారు. కార్మికుల ఆరోగ్య భద్రతతో పాటు వారి అన్ని సమస్యలను ఒకొకటిగా పరిషరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో లేకపోయినా ప్రజల మద్దతు ఏమాత్రం తగ్గలేదని, కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన ప్రతి కార్యకర్తనూ, నాయకుడినీ కాపాడుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మరో రెండేండ్లలో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకొని, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామని హమాలీ కార్మికులు, ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , హమాలీ కార్మికుల గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశం, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.