ఉత్తరాదిలో అనేక మంది విద్వేష వ్యాఖ్యానాలు చేస్తున్నారు… నూపుర్‌శర్మ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు.. వారి వలలో తెలంగాణ పడలేదు.
దేశంలో అనేక చోట్ల మత ఘర్షణలు జరిగాయి. ప్రజల్ని మతపరంగా రెచ్చగొట్టేందుకు బీజేపీ, దాని పరివారం అనేకసార్లు ప్రయత్నించింది.. కానీ తెలంగాణ రెచ్చిపోలేదు!
తెలంగాణలో ఇంత సామరస్యం, శాంతి కాముకత బీజేపీ పెద్దలకు నచ్చినట్టు లేదు!
గంగా జమున తెహజీబ్‌తో జీవిస్తూ.. కేంద్రంలో తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతుండటంతో సెగ తగిలినట్టయింది!
అందుకే.. సమస్యల నుంచి జనాన్ని ఏమార్చేందుకు నేరుగా ఇక్కడే ఇప్పుడు చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు!
వాళ్ల పన్నాగంలో పాచిక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ పాచిక పని.. అటెన్షన్ డైవర్షన్!!
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రశాంతతకు నెలవుగా.. సామరస్యానికి ప్రతీకగా, అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లను రెచ్చగొట్టే కుట్రలో ఇదొక భాగం. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసి.. ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేనట్టుగా పైకి దృశ్యం కనిపిస్తుంది. కానీ.. ఇదంతా ఎజెండాను ఏమార్చే ఎత్తుగడ. తమ వైఫల్యాలను దాచిపెట్టి.. తప్పించుకొనే కుట్ర. దీనిపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా స్పందించారు. కేంద్రం తన పరిపాలనలో వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు అలర్లు రెచ్చ గొట్టి, ప్రజలను అసలు సమస్యలనుంచి దృష్టి మరల్చేందుకు కుట్ర పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు పాల్పడుతున్న కుట్రలపై మండిపడ్డారు. ప్రజా సంగ్రామయాత్ర పేరుతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మంతటా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం.. వీటన్నింటికి పరాకాష్టగా ఎమ్మె ల్యే రాజాసింగ్ ఏకంగా ఒక వర్గం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా వీడియో విడుదల చేయడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ మోదీ సర్కారు వైఫల్యాన్ని.. బీజేపీ దుందుడుకుతనాన్ని ఎండగట్టారు.
కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం కాదు..అటెన్షన్ డైవర్షన్ (ఏ-డీ) ప్రభుత్వం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ-డీ అంటే అటెన్షన్ డైవర్షన్ అని నిర్వచించారు. దేశంలోని అన్ని సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర బీజేపీ చేస్తున్నదని మండిపడ్డారు. ‘దేశవ్యాప్తంగా మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్ర.. భారమౌతున్న నిత్యావసరాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర.. ఊడిపోతున్న ఉద్యోగాల నుంచీ ప్రజల దృష్టి మరల్చే కుట్ర’ బీజేపీ చేస్తున్నదని బుధవారం వరుస ట్వీట్లలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికి ప్రస్తుతమే కాకుండా భవిష్యత్తు తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. దేశం కోసం.. ధర్మం కోసం.. అనేది బీజేపీ అందమైన నినాదంగా కనిపిస్తున్నా.. నిజానికి విద్వేషం కోసం.. అధ ర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానమని పేర్కొన్నారు. ‘హర్ ఘర్ జల్ అన్నారు కానీ.. హర్ ఘర్ జహర్.. హర్ దిల్ మే జహర్ నింపే కుట్ర చేస్తున్నారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని.. సోషల్ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే కుతంత్రం ఇది. మిత్రులారా గుర్తుంచుకోండి.. ద్వేషం కాదు.. దేశం ముఖ్యం. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యం’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలో మీడియా సంస్థల ఆక్రమణపైనా మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దేశంలో స్వతంత్ర మీడియా చచ్చిపోయిందని, ‘ఆర్.ఐ.పీ. ఇండిపెండెంట్ మీడియా’ అని మంత్రి పేర్కొన్నారు. ఇకపై మన దేశంలో మీడియాను ‘మోదియా’ అని పిలువాలా? అని ప్రశ్నించారు. ఎన్డీటీవీలో వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసిన నేపథ్యంలో స్పందించిన మంత్రి కేటీఆర్.. దేశంలో సమాచార శూన్యతను సృష్టించి.. దేశాన్ని ఏక కేంద్రక రాజ్యంగా నడపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న నరేంద్ర మోదీకి అభినందనలు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దేశంలో బలవంతపు ఫెడరలిజం అమలులో ఉన్నదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష సెస్‌లు సర్‌చార్జీల ద్వారా తన ఆదాయాన్ని 10.4% నుండి 20%కి పెంచిందనే ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. సిగ్గుచేటు జనగామ జిల్లాలో బీజేపీ నేత బండి సంజయ్ ఫ్లాప్ యాత్ర సందర్భంగా మహిళ, సామాన్యులపై బీజేపీ గుండాలు దాడి చేయడంపైనా మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ దాడిని చూసి తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. జనగామ జిల్లాలో ఫ్లాప్ యాత్ర పేరుతో మహిళలు, సామాన్యులపై దాడులకు దిగిన బీజేపీ గుండాలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాజకీయ ఎజెండా కోసం రాష్ట్రంలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ గుండాల వ్యవహరశైలి సిగ్గుచేటన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య మృతి పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కే తారకరామారావు సంతాపం తెలిపారు. బుధవారం ట్విట్టర్లో ఈట ల కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లయ్య ఆత్మకు శాంతి కలగాలని కేటీఆర్ ప్రార్థించారు. సంతాపం తెలిపిన మంత్రి కేటీఆర్‌కు ఈటల రాజేందర్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.