నిప్పులాంటి నిజం.. నీళ్లను చీల్చుకుంటూ నిటారుగా పైకెగసింది. అబద్ధాల ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఆనకట్టయి వెలసింది. ఆ ఆనకట్టే కాళేశ్వరం. కాళేశ్వరుడి సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు అగ్నిపునీతై అవతరించింది. ముక్తీశ్వరుడి సాక్షిగా అన్ని ఆరోపణల నుంచీ విముక్తమైంది. కాళేశ్వరం గెలిచింది. తెలంగాణ మరోసారి గెలిచింది. కేసీఆర్ జల సంకల్పం సమున్నతంగా నిలిచింది. సర్కార్ వేసిన నేలబారు ఎత్తుగడ ఎదురుతన్నింది. తమ్మిడిహట్టికి వకాల్తా పుచ్చుకున్న ఘోష్ కమిషన్ నివేదికను అడ్డం పెట్టుకొని తెలంగాణ జలదాతను వేధించాలనుకున్న కాంగ్రెస్ కుట్రను ఉన్నత న్యాయస్థానం భగ్నం చేసింది. సీఎం హోదాలో ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలను రాజకీయజోక్యంగా చిత్రీకరించిన జస్టిస్ ఘోస్ట్ నివేదికను వేస్ట్ అంటూ ధర్మాసనం బుట్టదాఖలా చేసింది.
దుర్బుద్ధితో చేసే పనులు దుఃఖంతోనే
అంతమవుతాయని మరోసారి రుజువైంది.
కాళేశ్వరం కూలేశ్వరం అని కూసినోళ్లు, జలప్రదాతపై బురద చల్లేందుకు పన్నిన పన్నాగం పటాపంచలైంది. మహా జలసౌధం నిర్మాతలపై విషం చిమ్మటమే లక్ష్యంగా వేసిన కమిషన్ వండివార్చిన నివేదిక ఇక చిత్తు ప్రతి విలువ కూడా చేయదు. గుర్రపు గంతల విచారణ, కట్టుకథల రిపోర్టు రంగు వెలిసి భంగపడ్డది. బట్టకాల్చి మీదేసే పాలకుల దుర్మార్గానికి దన్నుగా చెప్పుడు మాటల తప్పుడు నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది. కమిషన్లు, విచారణల పేరిట విపక్షాన్ని వేధించేందుకు బరితెగించిన సర్కార్‌కు కర్రుకాల్చి వాత పెట్టింది.
టార్గెట్ కేసీఆర్ అసలైన మిషన్!.. అందులో భాగమే పీసీ(సీ) ఘోష్ కమిషన్
పాలకుల తానాలకు తందానాల మహత్తర కసరత్తు.
ఉన్నత న్యాయస్థానం తలంటుతో సర్వం చిత్తు..చిత్తు!
తెలంగాణలో ఎవుసం వదిలి వలసబాట పట్టిన పల్లె నొసటన జలరేఖ రాసిందెవరు? మొగులు దిక్కు ముఖంపెట్టే తెలంగాణ రైతును.. దుక్కుల దిక్కు చూసేలా చేసిందేమిటి? పర్రెలిచ్చిన నేలను పంటచేనుగా మలిచిందెవరు? పుట్లకొద్దీ ధాన్యం పుట్టించిందెవరు? కేసీఆరే! ఆయన సృష్టించిన కాళేశ్వరమే!! ఆ సత్యం మళ్లీ నిరూపితమైంది. ఎల్‌నినో భయంతో కాళేశ్వరాన్ని బాగుచేయక తప్పదని ఇటీవలే సర్కార్ ఓ అడుగు వేసిన తరుణంలో.. న్యాయస్థానం తీర్పు రావడం తెలంగాణ రైతుకు శుభ సూచకం.
జలదాయిని కాళేశ్వరమే.. అది తెలంగాణ లైఫ్‌లైన్.
కాళేశ్వరమే తెలంగాణ ప్రాణేశ్వరం.. ఇదీ ట్యాగ్‌లైన్.
జలభాండంపై కాంగ్రెస్ అభాండాలు వేసింది. కాళేశ్వరంపై కాలకూట విషం కక్కింది. కుప్పకూలిందని ఒకడు, మొత్తమే కొట్టుకుపోయిందని ఒకడు.. పరుల మోచేతి నీళ్లకు అలవాటుపడి నీటి పరవళ్లపై నిందలేసిండ్రు. కుట్రలు, కుతంత్రాలు రచించిండ్రు. కమిషన్లు, విచారణల పేరిట కథలు నడిపిండ్రు. వందిమాగధ మీడియాతో రోత రాతలు రాయించిండ్రు. చిన్న పగులును చూపి మొగులుపై ఉమ్మేద్దామని చూసిండ్రు.
బురద చల్లితే మహానది మలినపడుతుందా?
ఎవరో విషం చిమ్మితే మహానేత మకిలపడుతాడా?
అడ్డగోలు పనులు చేస్తే దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు కండ్లు మూసుకోబోవని కాంగ్రెస్ సర్కార్‌కు రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. పాపం.. రేవంత్‌కు దెబ్బ మీద దెబ్బ! నిన్న కేసీఆర్ జగిత్యాల సభ దిగ్విజయం ఇచ్చిన షాక్‌నుంచి కోలుకోకముందే ఇవాళ్టి న్యాయస్థానం తీర్పుతో నడ్డి విరిగినట్టయింది. ఇక రేవంత్ ఎదురుచూడాల్సింది.. ఓటుకునోటు కేసులో రావాల్సిన తీర్పు గురించే! రాజ్యాంగ వ్యవస్థల వాడీవేడి రుచి చూడటమే!
ధర్మం జయించుగాక.. అధర్మం నశించుగాక!!.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ స్మితాసబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషిపై ఏ విధమైన చర్యలూ తీసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన జీవో 6కు, కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదని, కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అగ్రనేతలు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ బీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం 102 పేజీల తీర్పును వెలువరించింది. ‘జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నిర్ధారణలు, పరిశీలనలు పిటిషనర్ల పేరుప్రతిష్టలకు భంగం వాటిల్లేలా, హానికరంగా ఉన్నాయి. పిటిషనర్లపై నిందారోపణలు చేసేముందు.. అందుకు ఆధారాలను వారికి అందించడంతోపాటు, సాక్షులను ప్రశ్నించే అవకాశం వారికి ఇవ్వాలి. కానీ అలా జరుగలేదు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్-8 కింద ఉన్న చట్టబద్ధ రక్షణలను కమిషన్ అమలు చేయలేదు. కాబట్టి ఈ నిర్ధారణలు, పరిశీలనలు ఆచరణాత్మకం కానేకావు. కమిషన్ రిపోర్టు ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోడానికి వీల్లేదు’ అని ధర్మాసనం ఆదేశించింది. కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో-6ను సమర్థించింది. అయితే అందులో జ్యుడీషియల్ కమిషన్ అని ఉన్నం త మాత్రాన అదేమీ జ్యుడీషియల్ విచారణ కాబోదని, విచారణ కమిషన్లు చట్టానికి అతీతంగా ఉండటానికి వీల్లేదని స్పష్టంచేసింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ విధానంపై కోర్టు కీలకమైన అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ప్రధానంగా 1952 విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్-8బీ, 8సీ నిబంధనలు ఈ కేసులో అత్యంత ముఖ్యమైనవని పేర్కొన్నది. అయితే ఇవి సరైనవిధంగా అమలు కాలేదని ధర్మాసనం తప్పుపట్టింది. పిటిషనర్ల ప్రవర్తన లేదా ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నప్పుడు, వారికి ముందుగా స్పష్టమైన నోటీసు ఇవ్వాలన్న నిబంధనను కమిషన్ అమలు చేయలేదని ఆక్షేపించింది. చట్టం ప్రకారం పిటిషనర్లపై ఇతరులు, సాక్షులు చేసిన ఆరోపణల వివరాలను కమిషన్ తెలియజేయడంతోపాటు, వారి వాదనలు వినిపించే అవకాశం విధిగా కల్పించాలని పేర్కొన్నది. కానీ పిటిషనర్లపై ఉన్న ఆరోపణల గురించి కమిషన్ ముందస్తుగా పూర్తి సమాచారాన్ని వారికి ఇవ్వలేదని తెలిపింది. పిటిషనర్లు విచారణలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు కాబట్టి సెక్షన్ 8(బీ), 8(సీ)లను అమలు చేయలేదన్న వాదనను ధర్మాసనం తిరస్కరించింది. సాక్షులుగా హాజరైనంత మాత్రాన చట్టపరంగా సెక్షన్ 8(బీ), 8(సీ) కింద ఉన్న హక్కులు వదులుకున్నట్టు కాదని పేర్కొన్నది. విచారణలో సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన జరిగిందని స్పష్టంచేసింది. ‘విచారణ జరిగినరోజు పిటిషనర్లు అడిగిన పత్రాలు ఇచ్చినంత మాత్రాన.. వారికి అవకాశం ఇచ్చినట్టుకాదు. కేసీఆర్‌కు రెండురోజుల ముందు అడిగిన పత్రాలు ఇవ్వడం సెక్షన్ 8(బీ) కింద కమిషన్ బాధ్యతలను నిర్వహించినట్టు కాబోదు. కమిషన్ అందజేసిన పత్రాలు ఎక్కువగా ఉంటే, వాటిని నోటీసుగా పరిగణించరాదు. చట్టనిబంధనలకు అనుగుణంగానే కమిషన్ నోటీసు ఇచ్చితీరాలి. ఇలా పొందే హక్కు పిటిషనర్‌కు ఉన్నది’ అని తేల్చిచెప్పింది.
ఆరోపణలపై వివరణ తీసుకోకుండా, ఇతర సాక్షుల అభియోగాల ఆధారంగా తుది నివేదికలో పిటిషనర్ల ప్రవర్తన, నిర్ణయాలపై కమిషన్ తీవ్రవ్యాఖ్యలు చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది సహజన్యాయ సూత్రాలకు వ్యతిరేకమని, హక్కుల రక్షణను ఉల్లంఘించడమేనని తేల్చింది. సెక్షన్ 8(సీ) ప్రకారం.. పిటిషనర్లకు సాక్షులను క్రాస్‌ఎగ్జామిన్ చేసే హక్కు కూడా ఇవ్వాల్సి ఉన్నా, ఆ అవకాశాన్ని కమిషన్ కల్పించలేదని తప్పుపట్టింది. ఈ విధమైన లోపాలు విచారణ ప్రక్రియను ప్రభావితం చేస్తాయని స్పష్టంచేసింది. సహజన్యాయ సూత్రాలను విధిగా అమలు చేయడంలో కమిషన్ విఫలమైందని వ్యాఖ్యానించింది. వ్యక్తి ప్రతిష్ట కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్-21 కింద జీవనహక్కులో భాగమనే కీలక విషయాన్ని గుర్తుచేసింది. అలాంటి హక్కును ప్రభావితం చేసే ముందు పూర్తిస్థాయిలో రక్షణ అవకాశాన్ని ఇవ్వాల్సిన బాధ్యతను కమిషన్ విస్మరించిందని ఆక్షేపించింది. చట్టపరమైన ప్రమాణాలను పాటించనందున, నివేదికలో పిటిషనర్లపై కమిషన్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని.. ఎలాంటి చర్యలూ తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ‘కమిషన్ చేపట్టే నిజనిర్ధారణ నివేదికలో బాధ్యులుగా గుర్తించినవారిపై సొంతంగా చర్యలు తీసుకోవడానికి వీల్లేదని రామకృష్ణ దాల్మియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇందుకు విరుద్ధంగా జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఉన్నది. ఈ నివేదికలు పూర్తిగా సిఫారసు మాత్రమే. కమిషన్ ముం దు ఏ వ్యక్తి అయినా వెల్లడించిన అంశా లు భవిష్యత్తులో సివిల్, క్రిమినల్ కేసుల విచారణల్లో సాక్ష్యంగా స్వీకరించడానికి వీల్లేదు’ అని ధర్మాసనం విస్పష్టంగా వెల్లడించింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుపై కమిషన్ తన నివేదికలో తీవ్ర పదజాలం ఉపయోగించినట్టు ధర్మాసనం తెలిపింది. ప్రాజెక్టు వ్యవహారంలో విచ్చలవిడిగా బరితెగించారని, విధానపరమైన, ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ పేర్కొన్నదని,.. ఇవి కేసీఆర్, హరీశ్‌రావు ప్రవర్తనకు సంబంధించి ప్రతికూల వ్యాఖ్యలేకాకుండా, వారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ‘మూడు బరాజ్‌ల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణకు కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని కమిషన్ పేర్కొన్నది. ఆయన ప్రమేయం, ఆదేశాలే మూడు బరాజ్‌ల నిర్మాణాల్లో అవకతవకలకు, నష్టానికి కారణమన్నట్టుగా ఆరోపించింది. సీఎంగా కేసీఆర్ తనకు నచ్చినట్టుగా మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాలని ముందుగానే నిర్ణయించి మొండిగా వ్యవహరించారని, దీనికి అధికారులు సహకరించారని ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్నది. ప్రైవేట్ సంస్థలకు అనుచితంగా ప్రయోజనం చేకూర్చడానికి ప్రజాధనం దుర్వినియోగం చేయాలన్న ఉద్దేశం కేసీఆర్‌కు ఉన్నదని కమిషన్ తెలిపింది. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ప్రవర్తనకు, ప్రతిష్టకు కచ్చితంగా హానికరమైనవే’ అని కోర్టు అభిప్రాయపడింది. సెక్షన్-8(బీ) కింద నోటీసు ఇవ్వాలన్న నిబంధన ‘జీవించే హక్కులో ఒక అంశమైన పరువునష్టం నివారణకు చట్టద్ధమైన రక్షణ’ అని పేర్కొన్నది. నిర్ణీత తేదీల్లో విచారణకు హాజరైనంత మాత్రన వారి హక్కును వదులుకున్నట్టు భావించరాదని స్పష్టంచేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు వారు హాజరైనందున పిటిషనర్లకు అన్నీ తెలుసన్న ప్రభుత్వ వాదన ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం పేర్కొన్నది. ‘పిటిషనర్లను విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేయడానికి ముందు ఇతర సాక్షుల వాంగ్మూలాల నమోదు సమయంలోగానీ, లిఖిత పూర్వక సాక్ష్యాల సేకరణలోగానీ వారికి ఎలాంటి సంబంధమూ లేకుండా కమిషన్ చూసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా అంశాలను నిర్ధారించే ముందు వారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు, ఆధారాల గురించి నోటీసుల్లో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని ధర్మాసనం గుర్తుచేసింది.
కమిషన్ మొత్తం 119 మంది సాక్షులను విచారించిందని కోర్టు గుర్తుచేసింది. కేసీఆర్, హరీశ్‌రావుకు పంపిన నోటీసులు ఒక తీరుగా, ఎస్కే జోషి, స్మితాసబర్వాల్‌కు పంపిన నోటీసులు మరో తీరుగా ఉన్నాయని పేర్కొన్నది. ‘కేసీఆర్, హరీశ్‌రావుకు ఇచ్చిన సమన్లు చూస్తే విచారణ చేయడానికి, వాళ్ల వాదనలు వినడానికి అన్నట్టుగానే ఉన్నాయి. హరీశ్‌కు సంబంధించి అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థానాలను మార్చాలన్న ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులపై కమిషన్ ప్రశ్నించింది. కేసీఆర్‌కు మూడు ప్రాంతాల్లో బరాజ్‌ల నిర్మాణాలు, సమావేశాలు, క్యాబినెట్ ఆమోదంపై ప్రశ్నలు వేసింది. అయితే, వారికిచ్చిన సమన్లలో వారికి వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలు, నేరారోపణల ప్రస్తావన లేదు. అయితే కమిషన్ నిర్ధారించిన అంశాలను విడివిడిగా పరిశీలిస్తే.. పిటిషనర్ల ప్రతిష్టకు అవి కచ్చితంగా భంగం కలిగించేలా ఉన్నాయి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం, ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, రాష్ట్రస్థాయీ సంఘం పరిధి, పరిపాలన అనుమతులు పొందారా, లేదా?, ప్రాజెక్టు ప్రణాళిక, మేడిగడ్డ బరాజ్‌లో లోపాలకు కారణాలపై ఎస్కే జోషిని కమిషన్ ప్రశ్నించిందని తెలిపింది. బరాజ్‌ల ఆమోదం కోసం మంత్రివర్గం ముందుంచారా, లేదా? ముఖ్యమంత్రి కార్యదర్శిగా మీ పాత్ర ఏమిటి? ముఖ్యమంత్రి ముందు ఏవైనా విభేదిస్తూ నోట్స్ ఉంచారా, లేదా? తదితరాల గురించి స్మితా సబర్వాల్‌ను ప్రశ్నించినట్టు గుర్తుచేసింది. సెక్షన్-8(బీ) ప్రకారం ఈ ఇద్దరికీ కమిషన్ ఎలాంటి నోటీసులను జారీ చేయలేదని స్పష్టం చేసింది. విచారణకు హాజరుకావాలని మాత్రమే నోటీసులు ఇచ్చారని, వీటిని సెక్షన్ 8(బీ) కింద నోటీసులుగా పరిగణించలేమని తెలిపింది. తరువాత సమన్లు జారీ చేయకుండా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని, 8(బీ) కింద వాదనలు వినిపించుకునేందుకు అవకాశం కల్పించకుండానే వీరి ప్రవర్తన, ప్రతిష్టలకు సంబంధించి ప్రతికూల నిర్ధారణలను కమిషన్ తన నివేదికలో నమోదు చేసిందని ఆక్షేపించింది. ‘స్మితా సబర్వాల్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్టు కమిషన్ పేర్కొన్నది. నిపుణుల కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగా ఎస్కే జోషి తొక్కిపెట్టినట్టు ఆరోపించింది. ఇవి వారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేవి. నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి ఆరోపణలు చెల్లవుగాక చెల్లవు’ అని ధర్మాసనం పేర్కొన్నది.
కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తును ఇప్పటికే సీబీఐకి అప్పగించిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. సీబీఐ దర్యాప్తు వేరే చట్టపరమైన ప్రక్రియ కాబట్టి స్వతంత్రంగా కొనసాగవచ్చని, అదే సమయంలో కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టడం సరికాదని స్పష్టంచేసింది. సంబంధిత చట్టాల ప్రకారం సాక్ష్యాధారాలు సేకరించి, న్యాయ ప్రక్రియను అనుసరించాల్సిన బాధ్యత సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలపై ఉంటుందని పేర్కొన్నది. మొత్తంగా హైకోర్టు కమిషన్ ఏర్పాటును సమర్థించినా, కమిషన్ నివేదిక ఆధారంగా చట్టపరమైన విధానాలు పాటించరాదని చెప్పింది. కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదని, దాని వినియోగం కూడా చెల్లుబాటు కాదని తేటతెల్లం చేసింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. కానీ విచారణలో కమిషన్ సహజన్యాయ సూత్రాలను పాటించలేదని తప్పుపట్టింది. పిటిషనర్లు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ స్మిత సబర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషిపై కమిషన్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలు చట్టవ్యతిరేకమని కీలక ఆదేశాలు జారీ చేసింది. 1952 విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్-3 ప్రకారం ప్రజాప్రాధాన్యత కలిగిన అంశాలపై విచారణ కోసం కమిషన్‌ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిపింది. జీవో-6లో ‘జ్యుడీషియల్ ఎంక్వైరీ’ అనే పదం వాడినా, దానివల్ల కమిషన్ స్వరూపం కోర్టుగా మారదని కుండబద్ధలు కొట్టింది. కమిషన్ వాస్తవాలను సేకరించే సంస్థ మాత్రమేనని, దాని నివేదికకు స్వతంత్రంగా శిక్షలు విధించే అధికారం ఉండదని, సిఫారసులకే పరిమితమని స్పష్టంచేసింది. అలాంటి కమిషన్ల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలో, లేదో ప్రభుత్వం నిర్ణయమని తెలిపింది.
కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌ను సాక్షిగా పిలిచి, ఆ తర్వాత దోషిగా నిర్ధారించిందని, ఇది చెల్లదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదించారు. కమిషన్ విధివిధానాలకు అనుగుణంగా విచారణ జరుపలేదని పేర్కొన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని సెక్షన్-4 ప్రకారం సివిల్ కోర్టు అధికారాలు కమిషన్‌కు ఉంటాయని చెప్పారు. నోటీసులు, సమన్లు జారీచేసి, విచారణ చేపట్టే అధికారం మాత్రమే ఉంటుందని తెలిపారు. విచారణ చేయబోయే అంశానికి సంబంధించి ఏ సమాచారమున్నా ఎవరైనా అందజేయవచ్చని పబ్లిక్ నోటీసు జారీ చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలని సెక్షన్-5 కింద కేసీఆర్‌కు నోటీసు జారీ చేసిందని తెలిపారు. ఆయన స్వయంగా హాజరై వివరాలు, ఆధారాలు, రికార్డులు అందజేశారని వెల్లడించారు. అయితే కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కి కేసీఆర్‌పై ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా తుది నిర్ణయానికి వచ్చిందని పేర్కొన్నారు. సాక్షిగా హాజరుకావాలని మాత్రమే నోటీసు ఇచ్చి తీరా ప్రాజెక్టు డిజైన్, టెండర్ల ఖరారు, కాంట్రాక్టర్ల ఎంపిక వరకు అన్నింటికీ అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్‌నే బాధ్యుడిగా తేల్చుతూ కమిషన్ నివేదిక ఇచ్చిందని వివరించారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి రూ.7,500 కోట్ల నష్టం వాటిల్లిందని కూడా చట్ట వ్యతిరేకంగా తేల్చేసిందని వాదించారు. ప్రభుత్వం సమర్పించిన రికార్డుల ఆధారంగా కమిషన్ తప్పుడు నిర్ణయానికి వచ్చిందని, కేసీఆర్ వ్యక్తిత్వం, కీర్తి ప్రతిష్ఠలను దెబ్బతీసేలా కమిషన్ నిర్ధారణకు వచ్చిందని తెలిపారు. వాస్తవానికి ఇతర సాక్షులు లేదా పత్రాల ద్వారా అభియోగాలున్నాయని కమిషన్ భావిస్తే, విచారణ కమిషన్ చట్టం-1952లోని సెక్షన్-8(బీ) కింద పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలన్న నిబంధనను జస్టిస్ ఘోష్ కమిషన్ ఉల్లంఘించిందన్నారు. ఒకవేళ నోటీసు ఇస్తే ఆరోపణలకు సంబంధించిన పత్రాలతోపాటు ఆధారాలు కూడా అందజేయాలన్న నిబంధనను కమిషన్ పట్టించుకోలేదని, సహజ న్యాయసూత్రాలకు కమిషన్ తిలోదకాలిచ్చిందని, దీంతో కేసీఆర్ హకులకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన సాక్షులను సెక్షన్ 8(సీ) ప్రకారం క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు కూడా కమిషన్ వీలు కల్పించలేదని తెలిపారు. కమిషన్ వద్ద అప్పటికే అభియోగాలు ఉంటే, సాక్షిగా కేసీఆర్ హాజరైనప్పుడు ప్రశ్నించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. కమిషన్‌కు శిక్ష విధించే అధికారం లేదని రామకృష్ణ దాల్మియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, కిరణ్ బేడీ కేసులో సెక్షన్-8(బీ) కింద నోటీసు ఇవ్వలేదని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని, వ్యక్తి ప్రతిష్ఠ దెబ్బతినేలా విచారణ కమిషన్ వ్యవహారం ఉండకూడదని ఎల్కే అద్వానీ-బీహార్ స్టేట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని శేషాద్రి నాయుడు ఉదహరించారు.
కమిషన్ ప్రభుత్వానికి 650 పేజీల నివేదిక ఇస్తే, దానిని ముగ్గురు అధికారులతో కూడిన కమిటీతో 60 పేజీలకు కుదించారని, సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ నివేదికను బహిర్గతం చేశారని, ఇది చట్ట వ్యతిరేకమని శేషాద్రినాయుడు వివరించారు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాక తదుపరి చర్యలు ఉండాలన్న నిబంధనలను తుంగలోకి తొకారన్నారు. కేసీఆర్ తప్పు చేశారని తేల్చాలనే కుట్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని తెలిపారు. పూర్తి నివేదిక ఆధారంగా కాకుండా, ప్రభుత్వానికి అవసరమైన మేరకు తయారుచేసిన 60 పేజీల సంక్షిప్త నివేదికలోని ఆరోపణలపై మీడియా ట్రయల్ చేసిందని తెలిపారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పతాక శీర్షికలతో కథనాలు వెలువడ్డాయన్నారు. 60 పేజీల నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేశారని, హైకోర్టు ఆదేశించిన తర్వాత సైట్ నుంచి తొలగించారని తెలిపారు. ఈ పరిణామాలను బట్టి ప్రజాజీవితంతో మమేకమైన కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర జరిగిందన్నారు. ప్రభుత్వం రాజకీయంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చిందని, దానికితోడు నిబంధనలకు వ్యతిరేకంగా కమిషన్ నివేదిక ఉన్నదని తేల్చిచెప్పారు. కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్లో ఎకడా ఆర్థిక అంశాల ప్రస్తావన లేదని, ప్లానింగ్, నిర్వహణ, డిజైన్ వంటివి మాత్రమే ఉన్నాయన్నారు. రామనాథన్ అయ్యర్ నిఘంటువు ప్రకారం జ్యుడీషియల్ కమిషన్ నిజనిర్ధారణ నివేదికను మాత్రమే సమర్పించాలని, కోర్టు మాదిరిగా ఎవరు తప్పు చేశారో? ఎవరు ఒప్పు చేశారో? తేల్చడానికి వీల్లేదని, ఈ అధికారం విచారణ కమిషన్‌కు లేదని స్పష్టం చేశారు. కాబట్టి ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా జరిగిన విచారణ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం గానీ, ఇతర దర్యాప్తు సంస్థలు గానీ ఏవిధమైన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని లేని కేసులో ఇరికించాలన్న కుట్రతో ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదించారు. ప్రాజెక్టులోని ఒక పిల్లర్ కుంగుబాటుకు కారణాలు తేల్చాల్సిన కమిషన్ తన పరిధికి సంబంధం లేని అంశాల్లోకి వెళ్లి విచారించిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంశాల్లోకి కమిషన్ వెళ్లడమే కాకుండా రుణాలు తీసుకోవడంపైనా నివేదికలో పొందుపరచడాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆర్యమ సుందరం కోరారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు చేసిందని, ఈ విషయాల జోలికి కమిషన్ వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పిల్లరు కుంగుబాటు జరిగి తర్వాత రోజే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కమిషన్ నిజనిర్ధారణ చేయడానికి బదులు ప్రాజెక్టు నిర్మాణం, వ్యయ్యం, రుణం తీసుకోవడం వంటి సంబంధం లేని అంశాల్లోకి వెళ్లిందన్నారు. పిల్లర్ కుంగుబాటుకు కారణాలు తేల్చాల్సిన కమిషన్ ఏకంగా ప్రాజెక్టు నిర్మాణ తీరుతెన్నులపైనే విచారణ చేయడం చట్టవ్యతిరేకమని, కాబట్టి కమిషన్ నివేదిక చెల్లబోదన్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం మరో విడ్డూరమన్నారు. జ్యుడీషియల్ ఎంక్వైరీకి, కమిషన్ ఎంక్వైరీకి ఉన్న తేడాను గుర్తించి కమిషన్ నివేదికను కొట్టేయాలని ఆయన కోరారు.
బరాజ్ కుంగుబాటు కారణాలపై నిజనిర్ధారణ చేయాల్సిన కమిషన్, ఆ పని చేయకుండా వ్యక్తులను బాధ్యులుగా చేస్తూ ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందని ఆర్యమ సుందరం వాదించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఒకరూ వ్యక్తిగతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదని, కేబినెట్లో చర్చించాకే నిర్ణయాలు అమలు జరిగాయన్నారు. కమిషన్ నిజనిర్ధారణకు బదులు పిటిషనర్లు తప్పు చేశారన్నట్టుగా చార్జిషీట్ మాదిరిగా రిపోర్టు ఇచ్చారని తెలిపారు. ‘2024 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే దారుణం జరిగిపోయిందని గగ్గోలు మొదలుపెట్టింది. రాష్ట్ర శ్రేయస్సు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుట్రపూరితంగా కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం ముందే చెప్పినట్టుగానే, ఫలానా తప్పులు జరిగాయని కమిషన్ తేల్చింది. ఫలానా వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కమిషన్ చట్టవిరుద్ధంగా నిర్ధారణకు వచ్చేసింది. మొత్తంగా చూస్తే కమిషన్ అన్ని కోణాల్లోనూ నిబంధనలను ఉల్లంఘించింది. 2025 మే 10న కమిషన్ చేసిన కామెంట్లు పరిశీలిస్తే పరిధి దాటిందని స్పష్టమవుతున్నది’ అని ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు.