నీలగిరి, జూన్ 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ప్రత్యేక వార్డు సభల కార్యక్రమం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు నాల్గవ, చివరి విడత వార్డు సభలతో విజయవంతంగా ముగిసింది. చివరి విడతలో భాగంగా 11, 31, 32, 33, 34, 35, 36, 37, 41, 43, 47 అలాగే 48లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించగా, ప్రజలు, కార్పొరేటర్లు, వార్డు అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర మాట్లాడుతూ.. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా నగర ప్రజల అభిప్రాయాలు, అవసరాలు, సమస్యలు మరియు అభివృద్ధి సూచనలను నేరుగా తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతో నిర్వహించిన వార్డు సభలు నగరాభివృద్ధి ప్రణాళికలకు బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు.
వార్డు సభలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026, ఫోర్ వే వేస్ట్ సెగ్రిగేషన్, “జల్ సంచయ్ – జల్ భాగీధారి” కింద వర్షపు నీటి సంరక్షణ, వర్షాకాల సన్నద్ధత చర్యలు, డ్రైనేజీల నిర్వహణ, నిరంతర తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ, రహదారులు మరియు వీధి దీపాల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, హరితహారం మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రతి వార్డులో స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రజా సౌకర్యాలకు సంబంధించిన అంశాలపై ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులు మరియు సూచనలు స్వీకరించారు. అందిన ప్రతిపాదనలను నమోదు చేసి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లలో నాలుగు విడతలుగా నిర్వహించిన వార్డు సభలు విజయవంతంగా పూర్తికావడం పట్ల కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన గౌరవ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు మరియు నగర ప్రజలందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సూచనలు, అభిప్రాయాలు మరియు అవసరాలను సమగ్రంగా పరిశీలించి భవిష్యత్ నగరాభివృద్ధి ప్రణాళికల్లో పొందుపరుస్తామని, ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని కమిషనర్ స్పష్టం చేశారు. “ప్రజలతో కలిసి – ప్రజల కోసం – ప్రజల అభివృద్ధే మా లక్ష్యం” అనే భావనతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు.

నగరాభివృద్ధికి ప్రజల సూచనలే మార్గదర్శకం : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర