TSRTC | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, తమను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలంటూ 2019 సమ్మె సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. వారికిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, సహకరించిన మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బస్సులకు కేసీఆర్ ఫొటోలు కట్టి ర్యాలీలు నిర్వహించారు.
ఆర్టీసీ కార్మిక సంఘం ఇక ఎంప్లాయీస్ అసోసియేషన్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు. వారికి లభిస్తున్న వేతనాలు, పెన్షన్, వసతులు ఆర్టీసీ కార్మికులకు కూడా అందుతాయి. సమ్మెలు, ధర్నాలు చేయాల్సిన అవసరముండదు. ఆర్టీసీ కార్మిక సంఘం ఇకపై ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్‌గా మారుతుంది.
– రాజిరెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్
ఆ డిమాండ్‌తోనే మజ్దూర్ యూనియన్ ఏర్పడింది
ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఏకైక డిమాండ్‌తోనే జాతీయ మజ్దూర్ యూనియన్ ఆవిర్భవించింది. ఇది ఆర్టీసీ ఉద్యోగుల విజయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, బకాయిలన్నీ ఇవ్వాలి.
-కే హనుమంతు ముదిరాజ్, టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలి
క్యాబినెట్ నిర్ణయం హర్షణీయం. విధివిధానాలు రూపొందించే అధికారుల సబ్‌కమిటీలో అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఎంతోకాలంగా చేస్తున్న డిమాండ్‌ను మంత్రివర్గం ఆమోదించడంతో పాటు వచ్చే శాసనసభ సమావేశాలలోనే బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించడం శుభ పరిణామం.
– కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న క్యాబినెట్ నిర్ణయం సంస్థలోని 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం. సిబ్బంది శ్రమను గుర్తించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయానికి ఆర్టీసీ తరపున కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో సిబ్బంది మరింత ఉత్సాహంతో పనిచేసి ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తారని ఆశిస్తున్నా.
– వీసీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎండీ ఆర్టీసీని రక్షించి
నిలబెట్టింది సీఎం కేసీఆరే
ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఆర్టీసీని రక్షించినదీ.. ఆదుకున్నదీ కేసీఆరే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్టీసీ కార్మికులకు 44శాతం పీఆర్సీ ఇచ్చారు. ఆర్టీసీకి మొదటి రెండేండ్లు రూ.500 కోట్లు, ఆ తర్వాత రెండేండ్లు రూ.1500 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించి సంస్థను నిలబెట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా లభించింది. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. క్యాబినెట్ నిర్ణయానికి కృతజ్ఞతగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని పిలుపునిచ్చాం.
– మారంరెడ్డి థామస్‌రెడ్డి, తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి