హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కృషి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పేరుతో జరిగిన రూ.36.37 కోట్ల మోసంలో ఏ3 నిందితుడు, ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన కాగితాల శ్రీధర్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని పాలకొల్లులో శనివారం అరెస్టు చేసి, సోమవారం కోర్టులో ప్రవేశపెట్టినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భాగవత్ తెలిపారు. ఇతనిపై ఇప్పటికే ఒక నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉండటంతో సీఐడీ విభాగంలోని సీఎంఎస్ ఎస్పీ రాంరెడ్డికి ఈ కేసు అప్పగించినట్టు తెలిపారు.
దీంతో ఓ ప్రత్యేక బృందం శ్రీధర్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని శ్రీరాంపేటలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కృషి కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా సీఎండీ కొసరాజు వెంకటేశ్వరరావు, ఇతర డైరెక్టర్లు, సిబ్బంది కలిసి ఖాతాదారుల నుంచి రూ.36.37 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించారు. మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా వారికి చెల్లింపులు చేయకుండా 2001 లో బ్యాంకును మూసివేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. కాగా, శ్రీధర్ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సీఐడీ సిబ్బందికి రివార్డులు అందజేస్తామని మహేశ్ భాగవత్ తెలిపారు.