హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగబోయే బోర్డు మీటింగ్కు ఎజెండా అంశాలను పంపాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎస్కే కాంబోజ్ బుధవారం ఇరు రాష్ర్టాలకు లేఖలు రాశారు. ఈ నెలాఖరున బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్నందున మీటింగ్లో చర్చించాల్సిన అంశాలను సత్వరమే అందజేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
సర్కార్ అనుమతి కోసం ఎదురుచూపు
బోర్డు మీటింగ్కు ఎజెండా అంశాలను ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేశారు. 14 కీలక అంశాలను సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఆ ప్రతిపాదనలను దాదాపు 20 రోజుల క్రితమే ప్రభుత్వానికి పంపారు. కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎజెండా అంశాలను ఖరారు చేయకపోగా, అధికారులకు దిశానిర్దేశం చేయలేదు. దీంతో సర్కారు అనుమతి కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. సర్కార్ అతిజోక్యం వల్లే అధికారులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది.