కృష్ణా జలాల కేటాయింపులు రాష్ర్టాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచీ కేసీఆర్ చేసిన వాదనతో ఎట్టకేలకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించింది. నదీజలాల కేటాయింపుల్లో తెలంగాణకు ఇకనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నం. కేసీఆర్ కొట్లాడి సాధించిన విజయాన్నీ తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ భావదారిద్య్రానికి నిదర్శనం.
– హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. పదేండ్లపాటు నిర్విరామంగా కేసీఆర్ చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన విజయమేనని తేల్చిచెప్పారు. ఇది కాంగ్రెస్ గొప్పతనం అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. నీటి వాటాల్లో తెలంగాణ హకులను సాధించుకునేందుకు నాడు కేసీఆర్ సీఎం హోదాలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట హాజరై తెలంగాణ పక్షాన వాదనలు వినిపించారని, అందుకే తెలంగాణకు న్యాయం దకే అవకాశాలు మెరుగు పడ్డాయని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటైన నెల రోజులకే నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో, ఆనాటి సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని జూలై 14, 2014న లేఖ రాసినట్టు తెలిపారు. అయితే, కేంద్రం ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టానికి బదులుగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం విచారణకు ఆదేశించిందని, ఈ విచారణతో తెలంగాణకు న్యాయమైన వాటా లభించే అవకాశం లేదని కేసీఆర్ భావించారని, అందుకే ఆయన నిరంతరాయంగా ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం 1956, సెక్షన్ 3 ప్రకారం పునఃపంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారని వివరించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం 2015లోనే కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని హరీశ్ గుర్తుచేశారు. 2020 అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశంపై తీవ్రంగా పట్టుబట్టినట్టు తెలిపారు. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయడానికి అంగీకరించారని, అయితే, కేసు విరమించుకున్న తక్షణమే ట్రిబ్యునల్ వేసేందుకు హామీ ఇవ్వాలని కేసీఆర్ పట్టు బడితే, ‘మేము న్యాయ మంత్రిత్వ శాఖ సలహా తీసుకున్న తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తాం’ అని నాడు కేంద్ర మంత్రి పేర్కొన్నారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి షెకావత్‌ను మరోసారి ఢిల్లీలో కలిసిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేసు విత్ డ్రా చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం 2021 జూన్‌లో విత్‌డ్రా పిటిషన్ వేసిందని, సుప్రీం కోర్టు అక్టోబర్ 2021లో అనుమతించిందని వివరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే (అక్టోబర్ 2023) సెక్షన్ 3 కింద నీటి విభజన కోసం ట్రిబ్యునల్‌కు కేంద్ర ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రెఫెరెన్స్ (టీవోఆర్) ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
కృష్ణా జలాల కేటాయింపులు రాష్ర్టాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచీ కేసీఆర్ చేసిన వాదనతో ఎట్టకేలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించింది. నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నం. కేసీఆర్ కొట్లాడి సాధించిన విజయాన్ని కూడా తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ భావదారిద్య్రానికి నిదర్శనం.
-హరీశ్‌రావు
అనేక వేదికల ద్వారా బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితంగానే తాజాగా సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలని హరీశ్ స్పష్టంచేశారు. ఒకవైపు సెక్షన్ 3 ప్రకారం నీటి వాటా జరగాలని శాశ్వత పరిషారం కోసం పోరాటం చేస్తూనే, మరోవైపు తాతాలికంగా నీటి వాటాను 50 శాతం పెంచాలని పోరాటం కొనసాగించామని వివరించారు. అందులో భాగంగానే ట్రిబ్యునల్ ముందు 575 టీఎంసీల నీటి వాటా డిమాండ్ పెట్టినట్టు గుర్తుచేశారు. కేఆర్ఎంబీ సమావేశాల్లో, కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల్లో ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా తెలంగాణకు కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని నిరంతరాయంగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే వచ్చిందని తెలిపారు. ఇప్పటికే పదేండ్ల విలువైన కాలం హరించుకుపోయిందని, తెలంగాణ దశాబ్దాలుగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను కోల్పోయిన నేపథ్యంలో సెక్షన్ 3 కింద విచారణ త్వరితగతిలో పూర్తి చేసి న్యాయమైన వాటా వచ్చేలా చేయాలని ట్రిబ్యునల్‌ను కోరుతున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా నదీజలాల కేటాయింపులపై ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన క్రమంలో పటిష్టమైన వాదనలు వినిపించేలా నిష్ణాతులైన న్యాయవాదులను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సెక్షన్ 3 ప్రకారం వాదనలు వినేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పాక్షిక విజయమే అని, తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో న్యాయమైన వాటా దకితేనే అంతిమ విజయం సాధించినట్టవుతుందని తేల్చిచెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగరూకతతో అంతిమ ఫలితాన్ని రాబట్టేలా కృషి చేయాలని కోరారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత రైతుల పాలిట శాపంలా మారిందని, కాలువలు తవ్వితే రైతుల పొలాలకు నీలిచ్చే అవకాశమున్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గమని హరీశ్ ధ్వజమెత్తారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తే తప్ప మార్చుకోలేదని గుర్తుచేశారు. నీటి కేటాయింపుల కోసం కృషి చేస్తూనే ప్రాజెక్టుల నిర్వహణ అవసరమని, యాసంగిలో తగిన నీటిని అందించాలని కోరారు. గత యాసంగిలో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితినే రేవంత్ ప్రభుత్వం పునరావృతం చేస్తే అది రైతాంగం పాలిట చేసిన ద్రోహంగానే భావించాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా నీటి విడుదలకు ప్రభుత్వం మీనమేషాలు లెకపెడుతున్నదని రైతుల నుంచి తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రాజెక్టుల కింద వేసిన పంటలకు నీళ్లివ్వాల్సిన బాధ్యత సాగునీటి శాఖదేనని స్పష్టం చేశారు. యాసంగి సాగునీటి ప్రణాళికలో అదనంగా మరిన్ని ఎకరాలను చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు హకుగా రావాల్సిన నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృష్టి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరిస్తామని స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, నీటి వాటా కోసం రాజీలేని పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమని తేల్చిచెప్పారు.
ఏపీ పునర్విభజన చట్టం, సెక్షన్ 89ను తెచ్చిందే నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ! కృష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే, దాన్ని సరిదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేండ్లు పట్టింది.
-హరీశ్‌రావు