హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : కృష్ణానదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. అవార్డును ప్రకటించేందుకు 2027 జూలై 31 వరకు గడువును పెంచింది. కృష్ణా జలాల పంపిణీ కోసం 2004లో కేంద్రం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ 2013లో అవార్డును ప్రకటించగా, దానిపై అభ్యంతరాలు తెలుపుతూ ఉమ్మడి ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ వాదనలు పూర్తయ్యేదశలోనే రాష్ట్ర పునర్విభజన జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య పంపిణీ చేసే బాధ్యతను కూడా కేంద్రం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగించింది. ఏడాదిలోగా విచారణ పూర్తిచేసి అవార్డును ప్రకటించాల్సి ఉండగా, 2014 నుంచి ఇప్పటికీ విచారణ కొనసాగుతూ రావడం, ప్రభుత్వం గడువును పొడిగిస్తూ రావడం పరిపాటిగా మారింది.
తొలుత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం విచారణ నిర్వహించి కృష్ణానదీ జలాలను తెలంగాణ, ఏపీ మధ్య పునఃపంపిణీ చేయాలని నిర్దేశించింది. అయితే సెక్షన్ 89 ప్రకారం న్యాయం జరుగబోదని, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3ను అనుసరించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జలాలను పంపిణీ చేయాలని మొదటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టడంతో 2023 అక్టోబర్‌లో అందుకు కేంద్రం అంగీకరించింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నూతన మార్గదర్శకాలను జారీ చేయడంతోపాటుగా విచారణ గడువును సైతం తొలుత 2024 మార్చి వరకు, ఆ తరువాత 2025 జూలై 31 వరకు, తదుపరి ఈ ఏడాది జూలై 31వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆ గడువు సైతం సమీపించిన నేపథ్యంలో ట్రిబ్యునల్ సూచనల మేరకు తాజాగా మరోసారి గడువును ఆగస్టు 1 నుంచి 31 జూలై 2027 వరకు కేంద్ర జల్‌శక్తిశాఖ పొడిగించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
అదేవిధంగా రావి బియాస్ నదీ జలాల పంపిణీ అంశంపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ గడువును సైతం 2027 ఆగస్టు 5వ తేదీ వరకు కేంద్ర జల్‌శక్తిశాఖ పొడిగించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. రావి, బియాస్ నదీ జలాలపై పంజాబ్ ఒప్పందంలోని కొన్ని అంశాలను పరిశీలించేందుకు, వాటిపై నిర్ణయం తీసుకోవడానికి 1986లో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయగా, 1987లో కేంద్రానికి నివేదికను సమర్పించింది. అయితే మరిన్ని అంశాలను జోడిస్తూ నివేదిక సమర్పించాలని కేంద్రం ట్రిబ్యునల్‌ను కోరింది. నాటి నుంచి ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతుండగా, గడువును పొడిగించడం పరిపాటిగా మారింది.