కృష్ణా ట్రిబ్యునల్‌లో తెలంగాణ పంతం నెగ్గింది. పదేండ్ల బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి గంపగుత్తగా చేసిన కేటాయింపుల్లో ముందుగా రాష్ర్టాల వాటా తేల్చేందుకు కృష్ణా నదీ జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ 2) అంగీకరించింది. ‘కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా రావాల్సిందే. తెలంగాణ, ఏపీకి కలిపి గంపగుత్తగా ఇచ్చిన కేటాయింపులను దామాషా ప్రకారం పంచడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది..’ పదేండ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ ముందు వినిపించిన వాదన ఇది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్-3 ప్రకారం ముందుగా రాష్ర్టాల వాటా తేల్చిన తర్వాతే.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై విచారణ జరపాలని కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేసింది.
Krishna Tribunal | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పోరాటానికి ఫలితంగా.. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్-3పై ముందుగా వాదనలు వింటామని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్-3పై వచ్చే నెల 19-21 వరకు వాదనలు వింటామని తెలిపింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్- 89 ప్రకారం ముందుగా ప్రాజెక్టులవారీ కేటాయింపులను తేల్చాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ కొట్టిపారేసింది.
బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన గంపగుత్త కేటాయింపుల్లో తెలంగాణ, ఏపీ వాటాలు తేల్చడమే తమకు ప్రాధాన్య అంశమని స్పష్టం చేసింది. ముందుగా రాష్ట్రాల వాటాలు తేలాకే ప్రాజెక్టులవారీ కేటాయింపులపై విచారణ జరుపుతామని తేల్చిచెప్పింది. రెండు అంశాలను ఒకేసారి విచారించి, ఉత్తర్వులు జారీ చేస్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. సెక్షన్-3లోని ‘ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’ను కొట్టివేయాలని ఏపీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిందని గుర్తుచేసింది. ఏపీకి అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇస్తే ట్రిబ్యునల్ గుర్తించిన అంశాలు, ఉత్తర్వులకు పొంతన ఉండకపోవచ్చని పేర్కొన్నది. కాబట్టి ముందుగా తెలంగాణ చెప్తున్న ప్రకారం సెక్షన్-3పై వాదనలు వింటామని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి సెక్షన్-89పై వాదనలు కొనసాగిస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలను కేటాయించింది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటిని కేటాయించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఈ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేసింది. అయినా పట్టించుకోకుండా ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-89 ప్రకారం ముందుగా తెలుగు రాష్ర్టాల మధ్య ప్రాజెక్టులవారీగా మాత్రమే నీటిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు మార్గదర్శకాలను జారీ చేసింది.
దీంతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని, అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్-3 ప్రకారం ట్రిబ్యునల్‌కు విచారణ చేసే అధికారం కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం సుదీర్ఘ పోరాటం చేసింది. కేసీఆర్ అవిశ్రాంత కృషి, తెలంగాణ ప్రభుత్వ అలుపెరగని పోరాటం ఫలితంగా ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. సెక్షన్-3 కింద కృష్ణా జలాలను పంపిణీ చేయాలని గతేడాది అక్టోబర్‌లో నూతన మార్గదర్శకాలను జారీచేసింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను రెండు రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయాలని, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల అంశాన్ని కూడా తేల్చాలని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేసింది. ఈ మేరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది.