హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) నిర్వహించతలపెట్టిన 21వ బోర్డు సమావేశం మూడోసారి కూడా వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు బోర్డు తాజాగా లేఖ రాసింది. బోర్డు సమావేశం నిరుడు డిసెంబర్లోనే జరపాలని నిర్ణయించారు. మీటింగ్ ఎజెండా, ఇండెంట్లను సమర్పించాలని ఇరు రాష్ర్టాలను బోర్డు కోరింది. తర్వాత సమావేశం ఊసే తీయలేదు. దాదాపు 4 నెలల అనంతరం ఏప్రిల్ 30న 21వ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ర్టాల విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని మే5వ తేదీకి వాయిదా వేసింది. తరువాత మళ్లీ 14వ తేదీన నిర్వహిస్తామని తెలిపింది. కానీ తదుపరి 21వ తేదీన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. అనంతరం మళ్లీ ఈసారి కూడా సమావేశాన్ని బోర్డు వాయిదా వేసింది. 21న క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో హాజరుకాలేమని తెలంగాణ అధికారులు బోర్డుకు నివేదించారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు వెల్లడించి, ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది. సమావేశ నిర్వహణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆ లేఖలో తెలిపింది.