KRMB | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి 66:34 నిష్పత్తిలోనే నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తేల్చిచెప్పింది. 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ రాష్ట్రం చేసిన డిమాండ్‌ను కొట్టిపారేసింది. ఇరు రాష్ర్టాల ఈఎన్సీలకు తాజాగా లేఖ రాసింది. ప్రస్తుత నీటి సంవత్సరానికి సంబంధించి నీటి డిమాండ్లను పంపించాలని సూచించింది. గత నెల 21న నిర్వహించిన 19వ బోర్డు సమావేశంలో నీటివినియోగ వాటాలపై చర్చించారు.
ట్రిబ్యునల్ అవార్డును ప్రకటించేవరకూ 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ డిమాండ్ చేసింది. అయితే 66:34 నిష్పత్తినే అమలుచేయాలని ఏపీ ప్రతిపాదించింది. ఏపీ ప్రతిపాదనకే కేఆర్ఎంబీ మొగ్గుచూపింది. అదే నిష్పత్తిలోనే నీటిని వినియోగించుకోవాలని తేల్చిచెప్పింది. సంవత్సరంలో మొత్తంగా 1,010.13 టీఎంసీలు వచ్చాయని వివరించింది. అందులో 66% అంటే 666.688 టీఎంసీలకుగాను ఏపీ ఇప్పటికే 639.652 టీఎంసీలను వినియోగించుకున్నదని, ప్రస్తుతం ఏపీ కోటాకు సంబంధించి 27.036 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది.
తెలంగాణ కోటా 34% అంటే 343.446 టీఎంసీలకుగాను 211.691 టీఎంసీలను వినియోగించుకున్నదని, తెలంగాణ కోటాలో ఇంకా 131.755 టీఎంసీలు ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 510 అడుగుల వరకు 63.603 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు ఎండీడీఎల్ 834 అడుగుల వద్ద 30.811 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని బోర్డు వెల్లడించింది. కానీ సాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు అదనంగా 18 టీఎంసీలు కావాలని ఏపీ, తెలంగాణ 116 టీఎంసీలు కావాలని ఇండెంట్లను సమర్పించాయని తెలిపింది. 21లోగా ఇండెంట్లు ఇవ్వాలని ఈఎన్సీలకు బోర్డు లేఖ రాసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): ఎస్సారెస్పీ కాకతీయ ప్రధా న కాల్వ అత్యవసర మరమ్మతుల కోసం 1.8 కోట్లను ప్రభుత్వం మంజూరు చే స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ మెయిన్ కెనాల్ 311 కిలోమీటర్ల వద్ద అక్వడెక్ట్ మరమ్మతులకు ఈ నిధులను మంజూరు చేసింది.