KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డు 17వ సమావేశం బుధవారం జరుగనున్నది. హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశం కొనసాగనున్నది. ఇందులో ప్రధానంగా బోర్డు వార్షిక బడ్జెట్‌తోపాటు పలు సాంకేతిక అంశాలు, రివర్‌బోర్డుల గెజిట్ అమలు, డీపీఆర్‌లు తదితర అంశాలపై చర్చించనున్నారు. అందులో భాగంగా తెలంగాణ మాత్రం 50:50 నిష్పత్తిలో నదీ జలాల వినియోగం అంశాన్ని తన ప్రధాన ఎజెండాగా ఇప్పటికే కేఆర్ఎంబీకి స్పష్ట చేసింది. దీంతో సమావేశం ఎజెండాలో దీన్ని సైతం కేఆర్ఎంబీ చేర్చింది.
ఏపీ పునర్వీభజన సమయంలో కేవలం ఏడాది కాలపరిమితితో కృష్ణ జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు ఏపీ, తెలంగాణ తాత్కాలికంగా ఒప్పందం చేసుకున్నాయి. అయితే, ఇప్పటికే ఇంకా తాత్కాలిక ఒప్పందాన్నే కేఆర్ఎంబీ పొడిగిస్తూ వస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం కృష్ణా బేసిన్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయగా.. సాగునీటి వినియోగం పెరిగింది. ఈ క్రమంలో కృష్ణా జలాల్లో వాటాను 50:50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ పలుమార్లు డిమాండ్ పెట్టినా.. తొమ్మిదేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉన్నది.
అవార్డు ఎన్నుడు పూర్తవుతుంది? ఎప్పుడు అమలులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని పక్కనపెట్టి.. 50:50 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. గతంలో జరిగిన బోర్డు సమావేశాల్లోనే ప్రధానంగా ఈ అంశంపై పట్టుబడిట్టింది. అయినా, బోర్డు తెలంగాణ వాదనలను పట్టించుకోకుండా
ఏకపక్షంగా తాత్కాలిక ఒప్పందానే పొడిగిస్తూ వచ్చింది. తాజాగా జరిగే సమావేశంలో ఇదే అంశంపై మరోసారి బోర్డును గట్టిగా పట్టుబట్టేందుకు సిద్ధమవుతున్నది.