హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్ నుంచి ఇతర ఔట్ బేసిన్లకు నీటిని మళ్లించవచ్చని, వాటిపై ఎలాంటి నిషేధం లేదని ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. ఆ మళ్లింపునకు ట్రిబ్యునల్-1 చట్టబద్ధత కల్పించడమేగాక, అనుమతి ఇచ్చిందని పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో గురువారం సైతం కొనసాగింది.
ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట ఏపీ తరఫున సీనియర్ అడ్వకేట్ జయదీప్‌గుప్తా వాదనలు కొనసాగించారు. బయటి బేసిన్ మళ్లింపులను ఇతర ట్రిబ్యునళ్లు కూడా అనుమతిస్తాయని పే రొన్నా రు. నాగార్జునసాగర్ ఆర్బీసీ, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా వ్యవస్థలకు ట్రిబ్యునల్-1 నీటిని కేటాయించిందని చెప్పారు. బయటి బేసిన్లో నీటిపారుదల కోసం నీటి మళ్లింపులపై ఎలాంటి పరిమితి విధించలేదని తెలిపారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూల్-11లో ఏపీకి చెందిన నాలుగు ఔట్‌సైడ్ బేసిన్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని, ట్రిబ్యునల్-2 కూడా ఆయా ప్రాజెక్టుల కేటాయింపులను ధ్రువీకరించిందని వెల్లడించారు. బయటి బేసిన్ ప్రాంతాలైన కొయనాకు 65%, డిపెండబులిటీ కింద 25 టీఎంసీలు, సగటు ప్రవాహాల వద్ద తెలుగు గంగా ప్రాజెక్టుకు 25 టీఎంసీలను కేటాయించిందని, పెన్నా బేసిన్లో చాలా త కువ నీరు ఉన్నదని, కృష్ణా నీటిని మళ్లించకపోతే అది ఎండిపోతుందని గుప్తా వివరించారు. కృష్ణాకు ఉత్తరాన ఎత్తులో తెలంగాణ ఉన్నదని, నీటిపారుదల వసతికి లిఫ్ట్ స్కీమ్‌లు శరణ్యమని, అందుకు విద్యుత్తు కూడా అవసరమని వెల్లడించారు. తదుపరి విచారణ జనవరి 21, 22,23 తేదీలకు వాయిదా పడింది. కాగా,సెక్షన్-3 ఆధారం గా కేంద్రం జారీచేసిన నూతన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై జనవరి, ఫిబ్రవరిలో విచారణ ప్రా రంభమయ్యే అవకాశం ఉన్నది.