హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇసుక తవ్వకం ద్వారా వచ్చే ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ.39 కోట్లేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంసరణలతో ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగి, ఒక సంవత్సరంలోనే రూ.886 కోట్లకు చేరిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ధర టన్నుకు రూ.645 మాత్ర మే ఉండి, ప్రజలకు అందుబాటులో ఉన్నదని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ‘సాండ్ బజార్’ పేరుతో ఇసుక ధరను టన్నుకు రూ.1,600కు పెంచి, అదనంగా రవాణా భారం కూడా ప్రజలపై మోపుతున్నదని వాపోయారు.
సర్వీస్ చార్జీలు టన్నుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3 నుంచి రూ.100కు పెంచినా, ఆదాయం మాత్రం పెరుగకపోవడం అనుమానాస్పదంగా ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే ఇసుక తవ్వకాలు జరిగితే, ఇప్పుడు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు తవ్వకాలకు, 24 గంటల పాటు రవాణాకు అనుమతించినా ఆదాయం రెట్టింపు కాలేదని తెలిపారు. ఈ పరిస్థితి చూస్తే ఇసుక ఆదాయం ‘సాండ్ మాఫియా’ చేతుల్లోకి పోతున్నదనే అనుమానాలు వ్యక్తంచేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్వోగా ఉన్న గుర్రం మల్సూర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్ ఎండీసీ ఎండీగా పనిచేశారని ఆయనకు వాస్తవ గణాంకాలు తెలుసునని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను వక్రీకరించి, తప్పుడు గణాంకాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నదనే విషయంపై సీపీఆర్వో మల్సూర్ వెంటనే స్పష్టత ఇవ్వాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.